GudiwadaCasino: గుడివాడకు వెళ్లేందుకు బీజేపీ నేతల యత్నం.. మధ్యలోనే సోము వీర్రాజు అరెస్ట్

కృష్ణా జిల్లా గుడివాడలో కాసినో వ్యవహారంపై రాజకీయాలు మరింత ముదిరాయి. గుడివాడ వెళ్లేందుకు యత్నించిన బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు.. ఇతర నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.

GudiwadaCasino: గుడివాడకు వెళ్లేందుకు బీజేపీ నేతల యత్నం.. మధ్యలోనే సోము వీర్రాజు అరెస్ట్

Bjp Leaders

Updated On : January 25, 2022 / 2:36 PM IST

Casino Politics: కృష్ణా జిల్లా గుడివాడలో కాసినో వ్యవహారంపై వేడెక్కిన రాజకీయాలు.. మరింత ముదిరాయి. గుడివాడ వెళ్లేందుకు ప్రయత్నించిన బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు.. ఇతర సీనియర్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. నందమూరు దగ్గర.. నేతలను నిలువరించే ప్రయత్నం చేశారు.

అయితే.. తాము సంక్రాంతి సంబరాలు ప్రజలకు తెలియజేసేందుకే గుడివాడ వెళ్తున్నామని.. మరో కారణం లేదని సోము వీర్రాజుతో పాటు.. బీజేపీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కానీ.. గుడివాడలో 144 సెక్షన్ అమల్లో ఉన్న కారణంగా అనుమతించేది లేదంటూ పోలీసులు తేల్చి చెప్పారు.

చివరికి.. కలువపాముల ప్రాంతంలో సోము వీర్రాజుతో పాటు.. ఇతర బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ ప్రాంతం నుంచి తరలించారు. పోలీసుల చర్యను బీజేపీ నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. ఆందోళనలు, ధర్నాలు చేయడానికి కాదని.. వేడుకలు చేసేందుకు వెళ్తున్నామని.. అయినా అరెస్ట్ చేయడం ఏంటని.. ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోలీసుల తీరుపై బీజేపీ కార్యకర్తలు నిరసన చేయడంతో.. ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఆందోళనకు దిగిన బీజేపీ కార్యకర్తలను పోలీసులు బలవంతంగా తరలించారు.