Tirumala Ghat Road : తిరుమల ఘాట్ రోడ్లలో ప్రమాదాల నివారణపై టీటీడీ ఫోకస్.. ఈవో కీలక ఆదేశాలు
Tirumala Ghat Road : తిరుమల ఘాట్ రోడ్లలో ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై టీటీడీ పరిపాలన భవనంలో ఈవో సమన్వయ సమావేశం నిర్వహించారు.

Tirumala Ghat Road (Photo : Google)
Tirumala Ghat Road Accidents : తిరుమల ఘాట్ రోడ్లపై ఇటీవల చోటు చేసుకున్న వరుస రోడ్డు ప్రమాదాలు భక్తులను భయాందోళనకు గురి చేశాయి. వారం రోజుల వ్యవధిలో జరిగిన వరుస యాక్సిడెంట్లతో అటు భక్తులు.. ఇటు టీటీడీ అధికారులు ఉలిక్కిపడ్డారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోయినా.. రెండు ఘాట్ రోడ్లలో కలిపి ఐదారు ప్రమాదాలు జరగడం అందరిలోనూ కలవరం నింపింది. ఈ ప్రమాదాలతో తిరుమల ఘాట్ రోడ్ లలో ప్రయాణం అంటేనే భయపడే పరిస్థితి వచ్చింది.
ఈ క్రమంలో టీటీడీ రంగంలోకి దిగింది. ఘాట్ రోడ్లపై ప్రమాదాల నివారణపై ఫోకస్ పెట్టింది. దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించాలని టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఆదేశించారు. తిరుమల ఘాట్ రోడ్లలో ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై టీటీడీ పరిపాలన భవనంలో జిల్లా కలెక్టర్ వెంకటరమణ, జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి, వివిధ శాఖల అధికారులు, టీటీడీ అధికారులతో ఈవో సమన్వయ సమావేశం నిర్వహించారు. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం పలు నిర్ణయాలు తీసుకోవడంతో పాటు ఆదేశాలు జారీ చేశారు.
* డౌన్ ఘాట్ రోడ్డులో 1వ మలుపు, 7వ మైల్, అలిపిరి డౌన్ గేట్, అప్ ఘాట్ రోడ్డులో లింక్ రోడ్డు, సహజ సిద్ధంగా ఏర్పడిన ఆర్చి (గరుడ ఆకారం), దివ్యారామం ప్రాంతాల్లో చెక్ పాయింట్స్ ఏర్పాటు చేయాలి.
* అప్ ఘాట్ రోడ్డులో లాగా డౌన్ ఘాట్ రోడ్డులో కూడా కాంక్రీట్ రీటైనింగ్ వాల్స్ నిర్మించాలి.
* ఏ రకమైన వాహనాలను ఘాట్ రోడ్డులో నిషేధించవచ్చో ప్రణాళికలు సిద్ధం చేయాలి.
* ప్రమాదాల నివారణకు సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలి.
* ఘాట్ రోడ్లలో స్పీడ్ లిమిట్ ఎంత? డ్రైవింగ్ చేసేప్పుడు మొబైల్ వాడకంపై నిషేధం, తీసుకోవాల్సిన ఇతర జాగ్రత్తలు తెలిపేలా నిరంతరం కర పత్రాలు పంపిణీ చేయాలి.
Also Read..TDP Manifesto: టీడీపీ మ్యానిఫెస్టోపై వైసీపీ ఇంతలా రియాక్ట్ కావాల్సిన అవసరముందా?
* ఘాట్ రోడ్లలో వాహనాల వేగాన్ని గుర్తించి తగిన చర్యలు తీసుకోవడానికి స్పీడ్ గన్స్ ఏర్పాటు చేయాలి.
* అంబులెన్స్ లు, రెస్క్యూ టీమ్ లు అవసరమైన పరికరాలతో సన్నద్ధంగా ఉండాలి.
* ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆర్టీసీ బస్సుల్లో ఆడియో టేపులు వినిపించే ఏర్పాటు చేయాలి.
* తిరుమలలో ఉచిత బస్సుల సంఖ్య పెంచాలి.
* ఘాట్ రోడ్లలో ఆర్టీసీ బస్సుల డ్రైవర్లు ఓవర్ టేక్ చేయకుండా చర్యలు తీసుకోవాలి.
* ఘాట్ రోడ్లలో ప్రమాదాలు జరిగిన వెంటనే రుయా స్విమ్స్, బర్డ్ ఆసుపత్రుల్లో డాక్టర్లు, సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ గాయపడిన వారికి వెంటనే మెరుగైన వైద్య సేవలు అందించాలి.