Vaddeswaram: హాస్టల్‌లోకి సీక్రెట్ ఎంట్రీ.. ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన బాయ్‌ఫ్రెండ్

రహస్యంగా బయటకు తీసుకెళ్లిన స్నేహితురాలిని.. తిరిగి హాస్టల్‌లో దిగబెట్టబోయి ప్రమాదానికి గురై ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఆదివారం రాత్రి జరిగిన ఘటనపై..

Vaddeswaram: హాస్టల్‌లోకి సీక్రెట్ ఎంట్రీ.. ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన బాయ్‌ఫ్రెండ్

deaths

Vaddeswaram: హాస్టల్ నుంచి రహస్యంగా బయటకు తీసుకెళ్లిన స్నేహితురాలిని.. తిరిగి హాస్టల్‌లో దిగబెట్టబోయి ప్రమాదానికి గురై ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఆదివారం రాత్రి జరిగిన ఘటనపై మృతుడి తండ్రి సోమవారం తాడేపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

వడ్డేశ్వరంలోని కేఎల్‌ యూనివర్సిటీలో బీబీఏ మొదటి సంవత్సరం చదువుతున్న ప్రకాశం జిల్లా కొండపి మండలం నేతివారిపాలెం గ్రామానికి చెందిన నేతి వినయ్‌కుమార్‌ (20), అతని స్నేహితుడు బండ్ల మనీశ్వర్‌ చౌదరి కలిసి ఆదివారం రాత్రి 7.30 గంటల సమయంలో.. అదే యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్‌లో ఫ్రెండ్స్ ఫోన్‌ చేసి బయటకు పిలిచారు.

అదే సమయంలో హాస్టల్‌లో నుంచి తోటి విద్యార్థినితో బయటకొచ్చిన వారికి హాస్టల్ లోపల ఉన్న విద్యార్థునులు ఫోన్‌ చేసి.. వాచ్‌మన్‌ గమనిస్తున్నాడని వెంటనే వచ్చేయమని చెప్పారు. లోపలికి వెళ్లిపోయే క్రమంలో హాస్టల్‌ గోడ దూకేందుకు ప్రయత్నించారు.

ఇద్దరిలో ఒకరు లోపలకు క్షేమంగా వెళ్లిపోగా మరొకరు మాత్రం గోడ ఎక్కలేక కిందకు జారిపడ్డారు. శబ్ధం విన్న వాచ్‌మన్‌ కేకలు వేయడంతో బయట ఉన్న విద్యార్థిని, ఆమె స్నేహితుడు నేతి వెంకట వినయకుమార్‌ కంగారుగా హాస్టల్‌ పక్కనే ఉన్న మరో బిల్డింగ్ పైకి పరుగులు తీశారు. ఆ భవనంలో ఉన్న వాచ్‌మన్‌ కూడా వీరిని చూసి కేకలు వేయడంతో విద్యార్థిని మెట్లపైనే ఉండిపోయింది.

వినయ్‌కుమార్‌ మాత్రం భవనం పైకి వెళ్లి, పైన రేకుల షెడ్‌ ఎక్కి దాక్కునే ప్రయత్నం చేశాడు. ప్రమాదవశాత్తు జారిపోవడంతో కింద పడి ఘటనాస్థలంలోనే మృత్యువాతకు గురయ్యాడు. వెంటనే హాస్టల్‌ నిర్వాహకులు వినయకుమార్‌ను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.

వినయకుమార్‌ స్నేహితుడైన మనీశ్వర్‌ చౌదరి మృతుడి తండ్రి రామకృష్ణకు సమాచారం అందించడంతో సోమవారం ఆయన కొడుకు మరణంపై అనుమానాలున్నాయంటూ తాడేపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఐదేళ్లుగా ప్రేమ:
నేతి వెంకట వినయకుమార్.. స్నేహితురాలి మధ్య గుంటూరులో ఇంటర్మీడియట్‌ చదివే రోజుల నుంచి ఐదేళ్లుగా ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్లు సమాచారం. యూనివర్సిటీలో చేరినప్పటి నుంచి తరచూ కలుసుకునే వారని చెబుతున్నారు. ఇటీవల అదే క్లాసులోని మరో ఇద్దరు ప్రేమించుకోవడంతో రెండు జంటలు కలసి తరచుగా బయటకు వెళ్లి వస్తుండేవారని, అందరికీ తెలిసిన విషయమేనని తోటి విద్యార్థులు పేర్కొంటున్నారు.

కాగా, ప్రకాశం జిల్లా కొండపి మండలం నేతివారిపాలెంకు చెందిన వీఆర్వో రామకృష్ణ, ప్రశాంతి దంపతులకు నేతి వెంకట వినయకుమార్‌ ఏకైక కుమారుడు కావడంతో వారి ఆవేదనకు అంతులేకుండా పోయింది.