టీడీపీ కంచుకోటలో ఆ సీటు దక్కేదెవరికీ..

టీడీపీ కంచుకోటలో ఆ సీటు దక్కేదెవరికీ..

విజయనగరం జిల్లా అంటే ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. ఏ ఎన్నికలు జరిగినా.. ఆ పార్టీదే హవా.. 1994లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 12కి 12 స్థానాలను కైవసం చేసుకొని తిరుగులేదని నిరూపించుకుంది. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం తొమ్మిది స్థానాలు వైసీపీ ఖాతాలో వేసుకొంది. అనూహ్య పరాజయంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు కంగుతిన్నారు. 

ఎన్నో ఆశలు పెట్టుకొని ఎవరికి తగినట్టు వారు కష్టపడినా… ప్రజాతీర్పు మాత్రం వైసీపీకి అనుకూలంగా వచ్చింది. జిల్లాలో టీడీపీ నాయకులు ఇప్పుడిప్పుడే తేరుకొని, ప్రభుత్వ విధానాలపై పోరాటాలు చేస్తున్నారు. పార్టీ శ్రేణులు యాక్టివేట్ అవుతున్నాయి. కాకపోతే పార్టీని ముందుండి నడిపించే నాయకుడు ఇప్పుడు అత్యవసరం అయ్యింది. 
 

ప్రస్తుతం జిల్లా పార్టీకి పెద్ద దిక్కు అయిన అశోక్ గజపతిరాజే బాధ్యతలను భుజాన వేసుకొని ముందుకు నడిపిస్తున్నా… జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎవరన్నది మాత్రం ఇంకా స్పష్టం కాలేదు.  ఓ వైపు స్థానిక ఎన్నికలు వచ్చేస్తున్నాయి. కానీ, జిల్లా టీడీపీలో మాత్రం ఆ ఆసక్తి కనిపించడం లేదంట. పార్టీ వ్యవహారాలపై మాత్రం అంతగా దృష్టి పెట్టలేకపోతున్నారు. (కౌన్సిలర్‌గా నామినేషన్ వేసిన జేసీ)

పార్టీకి జిల్లా అధ్యక్షుడుని నియమిస్తే ముందుకెళ్లేందుకు అవకాశం ఉంటుంది. కానీ, పార్టీ అధిష్టానం మాత్రం ఆ దిశగా అడుగులు వేయడం లేదు. ఫలితంగా ప్రస్తుతం పార్టీలో ఎవరికి వారు యమునా తీరు అన్న చందంగా ఉన్నారట. పార్టీకి పెద్ద దిక్కు అయిన అశోక్ గజపతిరాజు అడపాదడపా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నా పూర్తిస్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారు. దీనివల్ల పార్టీ శ్రేణుల్లో నిరూత్సాహం కనిపిస్తోంది.  

పార్టీ జిల్లా అధ్యక్ష పదవిని చేపట్టేందుకు బీసీ నేతల్లో తీవ్ర పోటీ నెలకొందట. ప్రధానంగా తూర్పు కాపు, వెలమ సామాజికవర్గ నేతల మధ్య పోటీ తలెత్తడంతో అవకాశం ఎవరిని వరిస్తుందోనన్న ఉత్కంఠ పార్టీ శ్రేణుల్లో నెలకొంది. అశోక్ గజపతిరాజు చూపు ఎవరిపై ఉందోనన్న ఆసక్తి వ్యక్తమవుతోంది. 

ప్రస్తుతం జిల్లా పార్టీ అధ్యక్ష రేసులో మాజీ అధ్యక్షులు ద్వారపురెడ్డి జగదీశ్తో పాటు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కె.ఎ.నాయుడుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ద్వారపురెడ్డి అంటే అశోక్ గజపతికి కూడా అభిమానమే. మరోసారి ఆయనకు ఇస్తే ఎలా ఉంటుందనే చర్చ సాగుతోంది. ప్రస్తుతం తూర్పుకాపు సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కె.ఎ.నాయుడు అధ్యక్ష పదవి కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారట. పార్టీ అధినేత చంద్రబాబు వద్ద ఆయన తన అభీష్టాన్ని తెలియజేసినట్లు సమాచారం. 

మరోపక్క మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మధ్యవర్తిత్వం ద్వారా నాయుడు తన ప్రయత్నాన్ని ముమ్మరం చేస్తున్నారట. వీరిద్దరే కాకుండా, మాజీ ఎమ్మెల్యే మీసాల గీత, ఎస్.కోట మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి వంటి మహిళా నేతలు కూడా పార్టీ జిల్లా అధ్యక్ష పదవిపై ఆశలు పెట్టుకున్నట్లు సమాచారం. మాజీ మంత్రి కిమిడి మృణాళిని కుమారుడు నాగార్జున పేరు ప్రయత్నిస్తున్నారట. 

బీసీ నేతలకే అధ్యక్ష పదవిని వరించే అవకాశాలున్నాయని బలంగా టాక్ వినిపిస్తున్నా బొబ్బిలి రాజవంశీకుడైన బేబీ నాయన పేరు కూడా ప్రస్తావనకు వస్తోందని అంటున్నారు. మరోపక్క ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీశ్‌పై అశోక్ గజపతిరాజుకు సాఫ్ట్ కార్నర్ ఉన్నప్పటికీ, ప్రస్తుత తరుణంలో ఈ పదవిపై ఆయన అంతగా ఆసక్తి చూపడం లేదట. 

ప్రస్తుత పరిస్థితుల్లో జిల్లా నాయకత్వాన్ని, పార్టీని ముందుకు నడిపించేందుకు సమర్థుడైన నాయకుడి కోసం వెదుకులాట ప్రారంభించారట. ఎవరెన్ని చెప్పినా ఫైనల్గా చెల్లేది అశోక్ మాటేనని అంటున్నారు. ఆయన ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారన్నదే ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి కలిగిస్తోంది. 

See Also | బెస్ట్ ఇంటర్నెట్, నిత్యావసర సరుకులు హోమ్ డెలీవరీ చేస్తున్న కేరళ గవర్నమెంట్