కోటి కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకోవడం అభివృద్ధి కాదా?- కూటమి నేతలపై సజ్జల ఫైర్

రాష్ట్రంలో అభివృద్ది జరగలేదంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. తప్పుడు ప్రచారంతో అధికారంలోకి వచ్చేందుకు చూస్తున్నారు. నాలుగు రోజుల్లో ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు.

కోటి కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకోవడం అభివృద్ధి కాదా?- కూటమి నేతలపై సజ్జల ఫైర్

Sajjala Ramakrishna Reddy : ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. అధికారం దాహం తప్ప ప్రజలకు మంచి చేసే ఆలోచన లేదని ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రధాని మోదీ చేసిన విమర్శలను ఖండించారు సజ్జల. ”2019లో చంద్రబాబు గురించి మోడీ మాట్లాడింది అందరికీ గుర్తుంది. పోలవరం ఏటీఎం అన్నారు.. వెన్నుపోటు అన్నారు.. అవినీతిలో నెంబర్ వన్ అన్నారు. అవన్నీ ఇప్పుడు ఏమయ్యాయి..? ఎన్నికల కోసం హడావిడిగా కలిసి చంద్రబాబు స్క్రిప్ట్ చదువుతున్నారు. 2019లో ముగ్గురూ కలిసి ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించారు” అని ప్రధాని మోదీపై మండిపడ్డారు సజ్జల.

సీఎం జగన్ పాలనలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ఏంటో వివరించారు సజ్జల. ”చేయూత పథకం కింద 16లక్షల మంది మహిళలకు సాయం అందింది. మహిళలకు రూ.75వేలతో చేయూత అందించాం. స్వయం ఉపాధితో కోటికిపైగా కుటుంబాలు తమ కాళ్లపై నిలబడగలిగాయి. కోటి కుటుంబాలు ఆర్థికంగా నిలబడటం అభివృద్ధి కాదా? టీడీపీ పాలనలో జీడీపీలో ఏపీ వాటా 4.47శాతం ఉంటే.. వైసీపీ పాలనలో 4.82 శాతానికి పెరిగింది. కియాకు మించిన పరిశ్రమలు ఏపీకి చాలా వచ్చాయి” అని తెలిపారు సజ్జల.

”మూడు పార్టీలు ఒక్కటే జగన్ కు శాపనార్థాలు పెడుతున్నారు. రాష్ట్రంలో అభివృద్ది జరగలేదంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. తప్పుడు ప్రచారంతో అధికారంలోకి వచ్చేందుకు చూస్తున్నారు. నాలుగు రోజుల్లో ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. రాష్ట్రంలో చేసిన అభివృద్ధి ప్రతిపక్షాలకు కనిపించడం లేదా? ఐదేళ్లలో మేం ఏం చేశామో ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నాం. మంచి జరిగితేనే ఓటు వేయండి అని ప్రజలకు జగన్ ధైర్యంగా చెబుతున్నారు.

పేదల ఆర్థిక పరిస్థితి బాగుపడేలా జగన్ పాలన ఉంది. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పౌర సేవలు అందించాం. వాలంటీర్ల సేవలు మరువలేనివి. ప్రతి సచివాలయం పరిధిలో ఏటా అభివృద్ధి లేదా పథకాల కోసం రూ.20 కోట్ల నుంచి రూ.30 కోట్లు ఖర్చు చేశాం. చంద్రబాబు పాలనలో డ్వాక్రా రుణాలు మాపీ చేయలేదు. సున్నా వడ్డీ రుణాలు ఇవ్వలేదు” అని ధ్వజమెత్తారు సజ్జల రామకృష్ణారెడ్డి.

Also Read : మార్పు కోసం, సేవ కోసం పవన్ వచ్చాడని భావించాం.. కానీ: పోతిన మహేశ్