Honey Trap : హనీ ట్రాప్ అంటే ఏమిటి? ఎలా చేస్తారు?

ఐ యామ్‌ సింగిల్‌.. వాంట్‌ టు మింగిల్‌.. బోర్‌ ఫీలవుతున్నా.. న్యూ ఫ్రెండ్స్‌ కావాలి.. నాతో ఫ్రెండ్‌షిప్‌ చేయాలంటే కాల్‌ మీ ఎనీ టైమ్‌ అని ఊరించే మెసేజ్‌లు మీకు వస్తున్నాయా? ఆ తీయని వలపు సంభాషణలు విని, నిజమేననుకొని నమ్మి కాల్‌ చేశారో మీ ఖేల్ ఖతమైపోయినట్టే. న్యూడ్‌ కాల్స్‌ పేరుతో నిలువు దోపిడీ చేసేస్తారు.

Honey Trap : హనీ ట్రాప్ అంటే ఏమిటి? ఎలా చేస్తారు?

Honey Trap exploitation : ఐ యామ్‌ సింగిల్‌.. వాంట్‌ టు మింగిల్‌.. బోర్‌ ఫీలవుతున్నా.. న్యూ ఫ్రెండ్స్‌ కావాలి.. నాతో ఫ్రెండ్‌షిప్‌ చేయాలంటే కాల్‌ మీ ఎనీ టైమ్‌ అని ఊరించే మెసేజ్‌లు మీకు వస్తున్నాయా? ఆ తీయని వలపు సంభాషణలు విని, నిజమేననుకొని నమ్మి కాల్‌ చేశారో మీ ఖేల్ ఖతమైపోయినట్టే. న్యూడ్‌ కాల్స్‌ పేరుతో నిలువు దోపిడీ చేసేస్తారు. నగరాల్లోని విద్యార్థులు.. ఉద్యోగులే వీరి టార్గెట్‌. దేశ వ్యాప్తంగానూ ఇలాంటి వ్యవహారాలు బయటపడుతూనే ఉన్నాయి. అసలేంటి ఈ కొత్త క్రైమ్‌? ఎలా చేస్తారు?

ఒంటరిగా ఉన్నా.. న్యూ ఫ్రెండ్స్‌ కావాలి.. కాల్‌ మీ ఎనీ టైమ్‌.. న్యూడ్‌గా కనిపిస్తా.. అని కవ్వించి.. వలపు వల విసిరి.. హనీ ట్రాప్‌లో చిక్కుకొనేలా చేస్తున్నారు ఆన్‌లైన్‌ మోసగాళ్లు. టెంప్ట్‌ అయ్యి మాట కలిపారో అంతే సంగతులు. సర్వం దోచేస్తారు. అంతేనా మీ పరువు కూడా గంగలో కలిసిపోతుంది. ఒకప్పుడు ఇది చాలా అరుదుగా వినిపించిన మాట… హనీ ట్రాప్‌. కానీ, ఇప్పుడు హనీ ట్రాప్‌లో పడిపోతున్న వారు వేల సంఖ్యలో బయటకు వస్తున్నారు. మహిళలు వలపు వలవేసి డబ్బు సంపాదనే ధ్యేయంగా చాలా మందిని బురిడీ కొట్టిస్తున్నారు. ముఖ్యంగా ఆన్‌లైన్ ఉపయోగం పెరిగిన నేపథ్యంలో ఈ మోసాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ముఖ్యంగా నగరాల్లో పెద్ద ఎత్తున ఇలాంటి మోసగాళ్ల బారిన పడిన వారు బయటకు పడేందుకు నానా యాతన పడుతున్నారు. ముఖ్యంగా మహిళల చేతిలో మోసాపోయామని చెప్పుకునేందుకు వెనకడుగు వేస్తున్నారు.

ఇలాంటి కేసులు ఈ మధ్య ఎక్కువైపోతున్నాయి. చాలా మంది ఇలాంటి మాయల ముఠాల చేతిలో చిక్కి విలవిల్లాడిపోతున్నారు. ఊరించే మెసేజ్‌లు చూసి కక్కుర్తి పడితే అంతే సంగతులు. తొలుత ఆకర్షించేలా ఒక మెసేజ్‌ చేస్తారు. దానికి జవాబు ఇస్తే.. న్యూడ్‌ కాల్‌కి రెడీయా అని అడుగుతారు. ఇక్కడే మీకు అనుమానం రావాలి. అలా కాదనుకొని, ఆ కాల్‌కి సిద్ధమయ్యారా? మీరు అడ్డంగా బుక్కయిపోయినట్టే. మీ న్యూడ్‌ వీడియోను రికార్డు చేసి, ఒక బ్లాక్‌ మెయిల్‌ చేయడం మొదలుపెడతారు. ఇప్పుడిలాంటి మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి.

తొలుత తియ్యగా.. రొమాంటిక్ మాటలు చెప్పి, ముగ్గులోకి దించుతారు. ఆ తర్వాత న్యూడ్‌ వీడియో కాల్స్‌ రికార్డ్‌ చేసి బ్లాక్ మెయిలింగ్ చేస్తారు. అక్కడ నుంచి బాధితుల నుంచి డబ్బు గుంజుతూనే ఉంటారు. బయటపడితే పరువు పోతుందనే ఆందోళనతో ఇలాంటి బాధితులు చాలా మంది లోలోపల కుమిలిపోతున్నారు. తాజా వ్యవహారంలో బాధితుడు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

తాజాగా విశాఖపట్నానికి చెందిన ఓ యువకుడు హనీ ట్రాప్‌లో చిక్కుకుని, లక్షల రూపాయలు కోల్పోయాడు. న్యూడ్‌‌గా కనిపిస్తానని మాయ మాటలు చెప్పి, బాధితుడి దగ్గర 24 లక్షల రూపాయలు దోచుకున్న సైబర్ కేటుగాళ్ల ముఠా గుట్టును విశాఖ పోలీసులు రట్టు చేశారు. హైదరాబాద్ నుంచి ఈ ముఠా పలువురిని మోసం చేసినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. కాల్ మీ ఎనీ టైం అనే అడ్వర్టైజ్‌మెంట్ చూసి మోసపోయాడు విశాఖకు చెందిన బాధితుడు ప్రణీత్. న్యూడ్‌‌గా కనిపిస్తానని మాయ మాటలు చెప్పి, బాధితుడి దగ్గర 24 లక్షల రూపాయలు దోచుకుంది ఆ ముఠా.

ఈ ఘరానా మోసం హైదరాబాద్‌ నుంచే జరిగిందని విశాఖ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గుర్తించారు. ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేటుగాళ్లు దోచుకున్న 24 లక్షల రూపాయల్లో మూడున్నర లక్షల సొత్తును రికవరీ చేశారు. అలాగే నిందితుల నుంచి 5 స్మార్ట్ ఫోన్లు, 3 సాధారణ మొబైల్స్, 3 ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలో హైదరాబాద్‌కు చెందిన భార్యాభర్తలు జ్యోతి, సతీష్‌తో పాటు వారికి సహకరిస్తున్న అబ్దుల్‌ రహీం అనే వ్యక్తి ఉన్నారు. వీరంతా ఒక ముఠాగా ఏర్పడి ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారు.

విశాఖకు చెందిన ప్రణీత్‌కు గతేడాది నవంబర్‌ 6న కాల్‌ మీ ఎనీటైమ్, ఐ యామ్‌ యువర్‌ బెస్ట్‌ ఫ్రెండ్‌ టు టాక్‌ అంటూ, 55678557 నంబర్‌కు ఫోన్‌ చేయాలని ఓ మెసేజ్‌ వచ్చింది. అది చూసిన ఆయన వెంటనే కాల్‌ చేయగా ఒక అమ్మాయి రొమాంటిక్‌గా మాట్లాడుతూ.. హాఫ్‌ న్యూడ్‌ వీడియోతో ముగ్గులోకి దించింది. న్యూడ్‌ వీడియో కాల్‌ చేయాలని అడిగింది. మరో క్షణం ఆలోచించకుండా న్యూడ్‌ కాల్‌ చేసి అమ్మాయితో కొంత సేపు మాట్లాడాడు. ఆ మాయలేడి వయ్యారాలను వీడియో కాల్‌లో చూస్తూ మైమరిచిపోయాడు. అక్కడితో కథ అయిపోలేదు.

ఆ తర్వాత రోజు న్యూడ్‌ వీడియో స్క్రీన్‌ షాట్‌ పంపించి డబ్బులు డిమాండ్‌ చేయడం ప్రారంభించింది ఆ వగలాడి. దెబ్బకు ప్రణీత్‌కు మైండ్ బ్లాంక్ అయింది. ఆ న్యూడ్‌ కాల్‌ స్క్రీన్‌ రికార్డ్‌ చేసి సోషల్‌ మీడియాలో పెడతామంటూ ఆమెతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు బెదిరింపులకు దిగారు. దీంతో ఆ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ తన పరువు పోతుందన్న భయంతో వారు అడిగినంత డబ్బులు ఇస్తూ వచ్చాడు. అప్పటి నుంచి దఫదఫాలుగా ఆ గ్యాంగ్‌కు చెందిన వివిధ బ్యాంకు ఖాతాల్లో 24 లక్షల రూపాయల వరకు జమ చేశాడు. అయినా వారి వేధింపులు, బెదిరింపులు ఆపకపోవడంతో ఈ ఏడాది జూలై 16న సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించి ముఠా గుట్టు రట్టు చేశారు.