అప్పుల్లో అంబానీ : 2020 మార్చి డెడ్‌లైన్.. రూ.15వేల కోట్లు కట్టాలి!

  • Published By: sreehari ,Published On : September 30, 2019 / 11:54 AM IST
అప్పుల్లో అంబానీ : 2020 మార్చి డెడ్‌లైన్.. రూ.15వేల కోట్లు కట్టాలి!

అనిల్ అంబానీ అప్పుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. కొన్నేళ్లుగా చేసిన అప్పులు తీర్చలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రిలయన్స్ అనిల్ దిరుబాయి అంబానీ గ్రూపు (ADAG) చైర్మన్ అనిల్ అంబానీ అప్పల భారాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మార్చి 2020 నాటికి మొత్తంగా రూ.15వేల కోట్లు (2.1 బిలియన్లు) అప్పులను తీర్చాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు అనిల్ అంబానీ గ్రూపు ADAG ఒక ప్రకటనలో తెలిపింది.

మార్చి 2018 వరకు.. రిలయన్స్ గ్రూపు కంపెనీలు చేసిన మొత్తం అప్పులు రూ.1.7లక్షల కోట్లు ఉండగా.. జూలై 2019 నాటికి రూ.93వేల 900లకు వరకు తగ్గాయి. రిలయన్స్ కమ్యూనికేషన్స్ మినహా కీలకమైన ఆస్తులు, వ్యాపారానికి సంబంధించిన మొత్తం ఆస్తులను అమ్మిన తర్వాత వచ్చిన మొత్తంలో అప్పులు తీర్చేసింది. 

జూన్ నెలలో రిలయన్స్ గ్రూపు రూ.35వేల కోట్లు లోన్లు తీసుకుంది. అందులో ప్రిన్సిపుల్ అమౌంట్ రూ.24వేల 800 కోట్లు ఉండగా.. వడ్డీ చెల్లింపులు మొత్తం రూ.10వేల 600 కోట్లు. ఈ అప్పుల మొత్తాన్ని నిర్దేశించిన సమయానికి అనుగుణంగా 14 నెలల్లో తిరిగి చెల్లించింది. అప్పులను తీర్చే క్రమంలో అనిల్ అంబానీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఎక్కువ మొత్తంలో కోల్పోవాల్సిన పరిస్థితి ఎదురైంది. తప్పని పరిస్థితుల్లో మిగిలిన అప్పులను తీర్చేందుకు అంబానీ.. ప్రస్తుత షేర్ హోల్డర్లలతో కలిసి మిగతా ఆస్తులను కూడా అమ్మేందుకు ప్లాన్ చేస్తున్నారు. 

అప్పులిచ్చే వ్యాపారాల నుంచి తమ ఆర్థిక సంస్థ రిలయన్స్ క్యాపిటల్ తప్పుకుంటున్నట్టు అనిల్ అంబానీ తెలిపారు. వచ్చే డిసెంబర్ నాటికి రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ సంస్థలు రెండెంటిని మూసివేయాలని రిలయన్స్ క్యాపిటల్ నిర్ణయించినట్టు కంపెనీ పేర్కొంది.

ఈ రెండు సంస్థల ఆస్తులు కలిపి మొత్తం రూ.25వేల కోట్ల విలువ ఉంటుందని అంచనా. సోదరుడు ముఖేశ్ అంబానీ సంస్థ రిలయన్స్ జియోకు మెటేరియల్స్ అందించే వ్యాపారంలో విఫలమైన రెండేళ్ల తర్వాత ADAG గ్రూపులో రెండో మేజర్ బిజినెస్.. రిలయన్స్ కమ్యూనికేషన్స్ (RCom) అప్పుల భారంతో దివాలా తీసింది.