నెలాఖరులో 2 రోజులు బ్యాంకులు సమ్మె

  • Published By: chvmurthy ,Published On : January 15, 2020 / 02:47 PM IST
నెలాఖరులో 2 రోజులు బ్యాంకులు సమ్మె

వేతన సవరణ కోరుతూ దేశ వ్యాప్తంగా బ్యాంకు యూనియన్లు మరోసారి సమ్మెకు దిగుతున్నాయి. జనవరి 31, ఫిబ్రవరి ఒకటో తేదీన సమ్మె చేయాలని బ్యాంకు యూనియన్లు బుధవారం పిలుపునిచ్చాయి. భారతీయ బ్యాంకుల సంఘం(ఐబీఏ)తో వేతన సవరణపై జరిగిన చర్చలు విఫలం కావటంతో సమ్మెకు వెళుతున్నామని తొమ్మిది కార్మిక సంఘాలకు ప్రాతినిధ్య వహిస్తున్న యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ (యుఎఫ్‌బీయూ) ప్రకటించింది.

మార్చి 11 నుంచి 13వ తేదీ వరకు కూడా మరోసారి సమ్మెచేయనున్నట్లు తెలిపింది. అప్పటికీ కూడా తమ సమస్యలను పరిష్కారించకపోతే ఏప్రిల్‌ 1 నుంచి నిరవధిక సమ్మెకు వెళ్తామని యూఎఫ్‌బీయూ పశ్చిమ బెంగాల్‌ కన్వీనర్‌ సిద్ధార్ధ ఖాన్‌ తెలిపారు. వేతన సవరణను యుఎఫ్‌బీయూ కనీసం 15 శాతం పెంపును కోరుతుంది. 12.25 శాతం వేతనాల పెంపు, స్పెషల్‌ అలవెన్స్‌ను బేసిక్‌ పేలో కలపడం, వారానికి ఐదు రోజుల పని దినాలపై ఐబీఏ ఇచ్చిన ఆఫర్‌పై అంగీకారం కుదరలేదు.

నెలాఖరు నుంచి బ్యాంకు ఉద్యోగులు సమ్మె తలపెట్టడంతో ఖాతాదారులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అత్యవసర క్లియరెన్స్‌, ఏటీఎం సేవలకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని ఖాతాదారులు కోరుతున్నారు.