ఉద్యోగుల తొలగింపు…హోండా ఫ్లాంట్ మూసివేత

  • Published By: venkaiahnaidu ,Published On : November 12, 2019 / 06:46 AM IST
ఉద్యోగుల తొలగింపు…హోండా ఫ్లాంట్ మూసివేత

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) హర్యానా రాష్ట్రంలోని మానేసర్‌లోని తన ప్లాంట్‌లో కార్యకలాపాలను నిరవధికంగా నిలిపివేసింది. ఆందోళన చేస్తున్న కార్మికులతో చర్చలు విఫలం కావడంతో సోమవారం నుండి ప్లాంట్ సాధారణ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు సోమవారం విడుదల చేసిన నోటీస్ లో హోండా తెలిపింది.

యూనియన్ నాయకులు, ప్లాంట్ మేనేజ్‌మెంట్ మధ్య సోమవారం చర్చలు జరిగినా సఫలం కాలేదు. దీంతో శాశ్వత కార్మికులు, కార్మిక సంఘాలు, ఇతర  కాంట్రాక్ట్ సిబ్బంది దుష్ప్రవర్తన ఆరోపణలు గుప్పిస్తూ ప్లాంట్ హెడ్ సైబల్ మైత్రా నోటీసులిచ్చారు.  యూనియన్ నేతలు కాంట్రాక్టు కార్మికులను రెచ్చగొట్టి  తమ అక్రమ సమ్మెను కొనసాగించమని పదేపదే కోరడంతోపాటు,  కంపెనీ ప్రాంగణంలో  చట్టవిరుద్ధంగా  నిరసనలకు ప్రేరేపిస్తున్నారని తెలిపారు. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని, ప్లాంట్ సాధారణ కార్యకలాపాలు సాధ్యం కాదని భావించి నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. తిరిగి కార్యకలాపాలను ఎప్పుడు ప్రారంభించేదీ క్లారిటీ ఇవ్వలేదు. అయితే ప్లాంట్‌ లోని పరిస్థితి సాధారణమైన తర్వాత కార్యకలాపాల పునఃప్రారంభంపై వాటాదారులకు  సమాచారం ఇస్తామని తెలిపింది.  

కాగా ఉత్పత్తి కోత, కాంట్రాక్టు ఉద్యోగులపై భారీగా తొలగించడంపై నవంబర్ 5 నుంచి కార్మికులు సమ్మెకు దిగారు. ప్లాంట్  కార్మిక సంఘం సెక్రటరీ జనరల్ రమేష్ ప్రధాన్ సమాచారం ప్రకారం, రోజుకు ప్లాంట్లో ఉత్పత్తి  చేసే ద్విచక్ర వాహనాల సంఖ్య 6,000 నుండి నవంబర్ నాటికి 3,500 కు తగ్గింది. దీంతో 2019 ప్రారంభం నుండి మొత్తం 1,000 మంది ఉపాధి కోల్పోయారు. అలాగే  తమకు జీతాలు పెంచాలని కూడా పర్మినెంట్‌ ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు. నిబంధనల ప్రకారం, ప్రతి మూడు సంవత్సరాలకు పే స్కేల్ సవరించాలి. అయితే ఆగస్టు 2018 నుండి ఇది  పెండింగ్‌లో ఉందని కార్మికులు వాదిస్తున్నారు.  వీరి ఆందోళనకు రాజకీయ పార్టీలు, ఇతర యూనియన్లు వారికి మద్దతు ఇస్తున్నాయి.