Hyderabad: ఇళ్ల అమ్మకాల్లో రికార్డులు సృష్టిస్తోన్న హైదరాబాద్.. 26 శాతం పెరిగిన సేల్స్

హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్‌ రంగంలో ఇళ్ల అమ్మకాలు ప్రతి నెల పెరుగుతున్నాయి. గ్రేటర్ సిటీలో నివాస గృహాలకు మంచి డిమాండ్ ఉంది.

Hyderabad: ఇళ్ల అమ్మకాల్లో రికార్డులు సృష్టిస్తోన్న హైదరాబాద్.. 26 శాతం పెరిగిన సేల్స్

hyderabad property market residential registrations rise in july

Hyderabad Property market: దేశంలోని మెట్రో నగరాలది (Metro Cities) ఒక లెక్క.. మన హైదరాబాద్ ది మరో లెక్క. అవును రియల్ ఎస్టేట్ రంగంలో (Real Estate) భారత్ లోని ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలు నెమ్మదించగా.. భాగ్యనగరంలో మాత్రం సేల్స్ పెరిగాయి. జులై నెలలో హైదరాబాద్ లో మొత్తం 5 వేల 557 ఇళ్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. గత సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే ఈ సారి ఏకంగా 26 శాతం ఇళ్ల అమ్మకాలు పెరిగాయని నైట్ ఫ్రాంక్ ఇండియా (Knight Frank India) తెలిపింది.

ఆర్థిక మాంద్యం, గృహ రుణాల వడ్డీ రేట్లు పెరగడంతో భారత్ లో రియల్ ఎస్టేట్ రంగం కాస్త నెమ్మదించింది. గత కొన్ని నెలలుగా దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో నిర్మాణ రంగంలో స్పీడ్ తగ్గింది. గతంతో పోలిస్తే ఇళ్ల అమ్మకాల్లో జోరు తగ్గింది. అయితే హైదరాబాద్ విషయానికి వచ్చే సరికి పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. భాగ్యనగరంలో రియల్ ఎస్టేట్ రంగం తగ్గేదేలే అంటోంది. అందులోను నిర్మాణ రంగంలో హైదరాబాద్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. అందుకు అనుగుణంగా గృహాల అమ్మకాల్లో గ్రేటర్ సిటీ స్పష్టమైన వృద్ధిని నమోదు చేస్తోంది. ప్రతికూల పరిస్థితుల్లోను ఇళ్ల అమ్మకాల్లో రికార్డులు సృష్టిస్తోంది హైదరాబాద్.

హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్‌ రంగంలో ఇళ్ల అమ్మకాలు ప్రతి నెల పెరుగుతున్నాయి. గ్రేటర్ సిటీలో నివాస గృహాలకు మంచి డిమాండ్ ఉంది. జులై నెలలో నమోదైన ఇళ్ల అమ్మకాలే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. జులైలో హైదరాబాద్ సహా శివారు ప్రాంతాలైన మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి ప్రాంతాల్లో ఏకంగా 5 వేల 557 గృహాల రిజిస్ట్రేషన్లు జరిగాయని లెక్కలు చెబుతున్నాయి. గత సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే ఈ నెలలో 26 శాతం ఇళ్ల అమ్మకాలు పెరిగాయని ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది. గత నెల జులైలో జరిగిన ఇళ్ల అమ్మకాల విలువ 2 వేల 878 కోట్ల రూపాయలుగా నమోదైంది. భాగ్యనగరంలోని ఇళ్ల అమ్మకాల్లో ఎక్కువగా అపార్ట్ మెంట్స్ వాటా ఉందని, లగ్జరీ ఫ్లాట్స్ కొనుగోలుకు నగరవాసులు ఆసక్తి చూపుతున్నారని లెక్కలు చెబుతున్నాయి.

Also Read: భాగ్యనగరం లెక్కే వేరు.. మిగతా మెట్రో నగరాలతో పోలిస్తే.. హైదరాబాద్‌లోనే ఇళ్ల ధరలు తక్కువ

హైదరాబాద్ లో తక్కువ విస్తీర్ణం గల ఇళ్లపై నగరవాసులు ఆసక్తి చూపడం లేదు. 500 చదరపు అడుగుల లోపు కొనేవారు 3 శాతంగా ఉండగా, 500 నుంచి 1000 చదరపు అడుగుల లోపు ఇళ్లకు 18 శాతం మంది మొగ్గుచూపుతున్నారు. మెజార్టీ హైదరాబాదీలు 1000 నుంచి 2000 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ఇళ్లను కొంటున్నారు. ఈ సైజు ఇళ్ల మార్కెట్ వాటా హైదారబాద్ లో 67 శాతంగా ఉందని నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది. మరోవైపు గ్రేటర్ సిటీలో 2వేల నుంచి 3వేల లోపు విస్తీర్ణం గల గృహాల వాటా క్రమంగా పెరుగుతోంది.

Also Read: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో కొత్త పోకడలు.. వెల్‌నెస్ హోమ్స్ కు పెరిగిన డిమాండ్