17 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి… 22 రోజుల పాటు అత్యాచారం చేసిన కీచకులు

  • Published By: murthy ,Published On : October 15, 2020 / 11:23 AM IST
17 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి… 22 రోజుల పాటు అత్యాచారం చేసిన కీచకులు

odisha  : ఇంటి నుంచి పారిపోయిన 17 ఏళ్ల బాలికను ఇంటికి తీసుకెళతానని నమ్మించి , ఒక గదిలో బంధించి 22 రోజులపాటు అత్యాచారం చేసిన ఘటన ఒడిషాలో వెలుగు చూసింది.

కటక్ కు సమీపంలోని జగత్ సింగ్ పూర్ జిల్లా, తిర్టోల్ కు చెందిన 17 ఏళ్ళబాలిక కుటుంబ సభ్యులపై అలిగి.. గత నెలలో ఇంటి నుంచి పారిపోయి కటక్ చేరుకుంది. కటక్ చేరుకున్నాక తిరిగి మనసు మార్చుకుని ఇంటికి వెళదామని అనుకుంది.

తన స్వాగ్రామం తిర్టోల్  తిరిగి వెళ్లటానికి కటక్ లోని OMC స్క్వేర్ బస్టాప్ వద్ద బస్సుకోసం నిలబడింది. ఆ సమయంలో మోటార్ సైకిల్ పై వచ్చిన ఒక వ్యక్తి..ఆమెను ఇంటి దగ్గర దింపుతాను,  బైక్ ఎక్కమని కోరాడు. బండి ఎక్కిన తర్వాత బాలికను టిర్టోల్ కు బదులుగా గాటిరౌట్ పట్నా గ్రామంలోని తన ఫాం హౌస్ కు తీసుకువెళ్ళాడు. అక్కడ ఒక గదిలో ఆమెను బంధించాడు.



తన  స్నేహితుడితో కలిసి ఆమెపై 22 రోజులపాటు అత్యాచారం చేశాడు. ఫాం హౌస్ లో ఏదో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని గమనించిన స్ధానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఫాం హౌస్ పై దాడిచేసి బంధించబడిన బాలికను రక్షించారు.

బాలికను కిడ్నాప్ చేసి తీసుకు వచ్చిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. 22 రోజులుగా బాలికపై అత్యాచారం చేసిన మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితులపై ఐపీసీ సెక్షన్ 376 (2) (సి) మరియు 376 (2) (జి), మరియు సెక్షన్ 34 కింద కేసు నమోదు చేసినట్లు కటక్ డిప్యూటీపోలీసు కమీషనర్ ప్రతీక్ సింగ్ తెలిపారు.



బాలికను జిల్లా శిశు సంక్షేమ శాఖ వారి ద్వారా అనాధాశ్రమానికి అప్పగించారు. ఒడిషాలో మహిళలకు రక్షణ కల్పించటంలో నవీన్ పట్నాయక్ సర్కారు ఘోరంగా విఫలమైందని విపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రభుత్వంపై ధ్వజమెత్తాయి.  వచ్చే ఏడాది మే నెలలో ఉప ఎన్నికలు జరిగే టిర్టోల్ కు చెందిన బాలికపై అత్యాచారం ఘటన విపక్షాలకు ఆయుధంగా మారనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. బాధితురాలికి రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.