భార్య క్రెడిట్ కార్డుతో ప్రియురాలి ట్రాఫిక్ చలాన్లు కట్టిన భర్త..ఇద్దరి ముందూ భలే బుక్ అయిపోయాడు..

భార్య క్రెడిట్ కార్డుతో ప్రియురాలి ట్రాఫిక్ చలాన్లు కట్టిన భర్త..ఇద్దరి ముందూ భలే బుక్ అయిపోయాడు..

Dubai man pays girlfriend’s traffic fines with wife’s credit card : భార్యకు తెలీకుండా ప్రియురాళ్లను మెయిన్ టెన్ చేసేవాళ్లు ఎప్పుడోకప్పుడు దొరికిపోతుంటారు.అలా ఓ భర్త భార్యకు తెలియకుండా ప్రియురాలితో… ప్రియురాలికి తెలియకుండా భార్యతో.. రెండిళ్ల పూజారిలా చక్కగా జల్సాలు చేసి ఇరుక్కుపోయాడు. చాలా రోజులు బాగానే ఒకరికి తెలియకుండా మరొకరిని బాగానే మానేజ్ చేశాడు. చిన్న తప్పుతో దొరికేశాడు. ప్రియురాలి ట్రాఫిక్ చలానాలు కట్టటానికి ఏకంగా భార్య క్రెడిట్ కార్డునే వాడేసి అడ్డంగా బుక్ అయిపోయాడో భర్త. ఆనక..ఒకరి గురించి మరొకరికి తెలిసిపోయి చిక్కుల్లో పడ్డాడు. భార్య, ప్రియురాలికి అడ్డంగా దొరికిపోయాడు.

దుబాయ్‌కు చెందిన ఓ మహిళ తన క్రెడిట్ కార్డులో డబ్బులు తరచూ మిస్ అవుతున్నాయని తెలుసుకుంది. ఎవరో కార్డును హ్యాక్ చేసి వాడేస్తున్నారని భయపడింది. దీంతో వెంటనే బ్యాంకుకు వెళ్లి కంప్లైంట్ చేసింది. దీనిపై వెంటనే స్పందించిన బ్యాంక్ అధికారులు ఆ క్రెడిట్ కార్డును ఎవరు వాడుతున్నారో తెలుసుకున్నారు. ఓ యువతి తన ట్రాఫిక్ చలానాలు కట్టేందుకు ఆ కార్డును వాడుతున్నట్లుగా గుర్తించారు. అదే విషయాన్ని ఆమెకు చెప్పారు. అది విన్న ఆమె షాక్ అయ్యింది.

ఈ ఘటనపై బ్యాంక్ అధికారులు సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేయగా..పోలీసులు ఆ సదరు యువతిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఆ చలానాలు నేను కట్టలేదనీ..నా బాయ్‌ఫ్రెండ్ కట్టాడని చెప్పింది. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు ఆమె బాయ్‌ఫ్రెండ్‌ను పిలిచి ప్రశ్నించారు. అలా పాపం..తప్పనిసరి పరిస్థితుల్లో..తన భార్య క్రెడిట్ కార్డు అని చెప్పుకొచ్చాడు. అక్కడే ఉన్న అతని గర్ల్ ఫ్రెండ్ అతని మాటలు విని షాక్ అయ్యింది. నీకు పెళ్లైందా? నాకు చెప్పలేదే? అని నిలదీసింది..

ఇదిలా ఉంటే పోలీసులు అతడి భార్యకు కబురు చేశారు. ఆమె వచ్చాక ‘‘మీ భర్త.. మీ క్రెడిట్ కార్డు యూజ్ చేసి తన ప్రియురాలి ట్రాఫిక్ చలానాలు కట్టాడని చెప్పేసరికి…ఆమెకూడా షాక్ అయ్యింది. నా భర్తకు గర్ల్ ఫ్రెండ్ ఉందనే విషయమే తనకు తెలీదని ఆశ్చర్యపోయింది.

అలా నారీ నారీ నడుమ మురారిలా ఇరుక్కుపోయిన అతడిని చూసి పోలీసులు కూడా జాలిపడ్డారు. ఇక వీడి బతుకేంటా అన్నట్లుగా ఓ లుక్ ఇచ్చారు. ఆ చూపులకు అర్థం ఏంటో అతనికి కూడా అర్థమైంది. కానీ ఏం చేయలేని పరిస్థితి. ఇక ’’ఇది సైబర్ నేరగాళ్ల పనికాదు మీ భర్త చేసిన పనేనని..తమ పని అయిపోయింది ఇక మీరూ మీరూ తేల్చుకోండి’’ మా పని అయిపోయిందన్నట్లుగా చూశారు.

అలా పాపం ఆ భర్త కళ్లముందే గర్ల్‌ఫ్రెండ్, భార్య ఎదురయ్యి..గుట్టుకాస్తా బయటపడేసరికి ఏం చేయాలో తెలికి మిడిగుడ్లేసుకుని చూస్తుండిపోయాడతను. మరోపక్క గుట్టు రట్టు అయ్యేసరికి ప్రియురాలు అతడి వంక కొరకొరా చూస్తూ వెళ్లిపోయింది. మరోపక్క భార్య వంక చూసే ధైర్యం లేక..తన పరిస్థితి ఏంటో అర్థం కాక అయోమయంగా భార్య కేసి చూశాడు. ‘‘ఇంటికి రా నీ సంగతి చెబతా..అన్నట్లుగా ఓ లుక్ ఇచ్చి భార్య కూడా అక్కడి నుంచి విసవిసా నడుచుకుంటూ వెళ్లిపోయింది.

దీనిపై దుబాయ్ పోలీస్ సైబర్ క్రైమ్ డిప్యూటీ డైరెక్టర్ అల్ షేహీ మాట్లాడుతూ..భార్య క్రెడిట్ కార్టును ప్రియురాలి ట్రాఫిక్ చలాన్లు కట్టటానికి ఉపయోగించాడని అతని భార్య ఫిర్యాదుతో విషయం వెల్లడైందని తెలిపారు. ఇక్కడ గమనించాల్సిన విషయం మరొకటేంటంటే.. అతడు ఒక్కసారి ట్రాఫిక్ చలానా చెల్లించి ఉంటే భార్యకు డౌట్ రాకపోయేది. కానీ రెండు, మూడుసార్లు కంటే ఎక్కువ వాడేసరికి పాపం అడ్డంగా బుక్ అయిపోయాడు..ఇక అతని పరిస్థితేంటో ఆ దేవుడికి కూడా తెలీదేమో..