వార్నీ ఎంత ధైర్యం : పోలీసు పెట్రోలింగ్ వాహనం పక్కనే ఫేక్ పోలీసుల చోరీ

వార్నీ ఎంత ధైర్యం : పోలీసు పెట్రోలింగ్ వాహనం పక్కనే ఫేక్ పోలీసుల చోరీ

Patna : cheating of Rs. 67 thousand fake police : బీహార్ లో నకిలీ పోలీసుల ఆగడాలు అంతా ఇంతా కాదు . ఏకంగా పోలీసు పెట్రోలింగ్ వాహనం పక్కనే ఓ మనిషిని నిలువునా దోచేసుకున్నారు. పోలీసులమని చెప్పి నమ్మించి ఓ వ్యక్తి నుంచి ఏఖంగా రూ.67వేలు తీసుకుని క్షణాల్లో ఉడాయించారు. తాను నకిలీ పోలీసుల చేతిలోమోసపోయానని గుర్తించిన ఆ వ్యక్తి పాపం లబోదిబోమంటూ నిజమైన పోలీసుల దగ్గరకెళ్లి తన గోడు వెళ్లబోసుకున్న ఘటన బీహార్ రాజధాని పాట్నాలో జరిగింది.

రాజధాని పట్నాలో గోలంబర్ సమీపంలో పోలీసు పెట్రోలింగ్ వాహనం పక్కనే ఓ చోరీ జరిగింది. హాజీపూర్ నుంచి పాట్నా వచ్చిన ఒక వ్యక్తి రూ. 67 వేలు పోగొట్టుకున్నాడు. పోలీసు పెట్రోలింగ్ వాహనానికి కొన్ని అడుగుల దూరంలోనే ఈ చోరీ జరగటం గమనించాల్సిన విషయం. హాజీపూర్ నుంచి పాట్నాకు గణేష్ అనే బైక్‌పై వ్యక్తి వచ్చాడు. ఇంతలో అతనిని ఇద్దరు వ్యక్తులు అడ్డుకున్నారు. మేం పోలీసులం అని చెప్పి..లైసెన్స్ చూపించమన్నారు. ఇంతలో ఒక వ్యక్తి గణేశ్ జేబులను తడిమి చూశాడు. గణేష్ ను అడక్కుండానే అతని జేబులోని డబ్బులను బయటకు తీశాడు.

వాళ్లు పోలీసులే అని నమ్మిన గణేశ్ వారిని అడ్డుకోలేదు. తన జేబులోని డబ్బుల్ని తీసుకున్నా..ఏం చేస్తారోననే భయంతో ఏమాత్రం అభ్యంతరం చెప్పలేదు. అతను ఏమీ అనకుండా మౌనంగా ఉన్న గణేష్ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకున్న వారిద్దరూ అ డబ్బు తీసుకుని పారిపోయారు. క్షణాల్లో అక్కడ నుంచి మాయం అయిపోయారు. దీంతో వాళ్లు అసలైన పోలీసులు కాదని తెలుసుకున్న గణేష్ లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా కేసు దర్యాప్తు చేస్తున్నారు.