Yogesh Kadya: 19 ఏళ్లకే గ్యాంగ్‌స్టర్‌.. ఏకంగా అంతర్జాతీయ క్రిమినల్ పోలీసింగ్ నుంచి రెడ్ కార్నర్ నోటీసులు

ఎన్ఐఏ కఠినంగా వ్యవహరించిన తర్వాత చాలా మంది గ్యాంగ్‌స్టర్లు దేశం విడిచి పారిపోయారు. ఈ చర్య తర్వాత 19 ఏళ్ల యోగేష్ కూడా నకిలీ పాస్‌పోర్ట్‌ను ఉపయోగించి దేశం విడిచిపెట్టి ఉండవచ్చని అంటున్నారు.

Yogesh Kadya: 19 ఏళ్లకే గ్యాంగ్‌స్టర్‌.. ఏకంగా అంతర్జాతీయ క్రిమినల్ పోలీసింగ్ నుంచి రెడ్ కార్నర్ నోటీసులు

Updated On : October 27, 2023 / 3:50 PM IST

Yogesh Kadya: మామూలుగా 19 ఏళ్ల వయసులో యువత ఏం చేస్తారు? కాలేజీ రోజులు గడుపుతూనో ప్రేమ పాఠాలు వల్లెవేస్తూనే ఉంటారు. కాస్త పక్క దారి పడితే చిన్న చిన్న గొడవలు, చిల్లర దొంగతనాలు ఉంటాయి. కానీ హర్యానాకు చెందిన ఒక కుర్రాడు.. 19 ఏళ్లకే గ్యాంగ్‌స్టర్‌ అయ్యాడు. గ్యాంగ్‌స్టర్‌ అంటే అంతా ఇంతా గ్యాంగ్‌స్టర్‌ కాదు. అతడికి అంతర్జాతీయ పోలీసింగ్ నుంచి రెడ్ కార్నర్ నోటీసులు వచ్చాయంటే ఏ స్థాయి గ్యాంగ్‌స్టరో అర్థం చేసుకోవచ్చు.

హర్యానాలోని ఝజ్జర్‌లో నివసిస్తున్న 19 ఏళ్ల గ్యాంగ్‌స్టర్‌పై ఇంటర్‌పోల్ (అంతర్జాతీయ క్రిమినల్ పోలీసింగ్) రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. గ్యాంగ్‌స్టర్‌ను యోగేష్ కడయాన్‌గా గుర్తించారు. మీడియా నివేదికల ప్రకారం, యోగేష్‌పై హత్యాయత్నం, నేరపూరిత కుట్ర, ఆయుధాల చట్టం ఆరోపణలు ఉన్నాయి. అయితే యోగేష్.. భారతదేశం నుంచి పారిపోయి అమెరికాలో ఆశ్రయం పొందినట్లు సమాచారం. గత కొద్ది నెలలుగా దేశంలోని గ్యాంగ్‌స్టర్-టెర్రరిస్ట్ నెట్‌వర్క్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) వేగంగా చర్యలు తీసుకుంటోంది. ఎన్ఐఏ కఠినంగా వ్యవహరించిన తర్వాత చాలా మంది గ్యాంగ్‌స్టర్లు దేశం విడిచి పారిపోయారు. ఈ చర్య తర్వాత 19 ఏళ్ల యోగేష్ కూడా నకిలీ పాస్‌పోర్ట్‌ను ఉపయోగించి దేశం విడిచిపెట్టి ఉండవచ్చని అంటున్నారు.

19 ఏళ్ల యోగేష్ హర్యానాలోని ఝజ్జర్ జిల్లా వాసి. అన్ని రకాల ఆయుధాలను ఉపయోగించడంలో యోగేష్ నిష్ణాతుడని చెబుతున్నారు. యోగేష్ ఎత్తు 1.72 మీటర్లుగా, అతని బరువు 70 కిలోగ్రాములని రెడ్ కార్నర్ నోటీసుల్లో పేర్కొన్నారు. అలాగే అతని కళ్ళు, జుట్టు రంగు నల్లగా ఉంటుంది. ఇంటర్‌పోల్ నోటీసు ప్రకారం.. యోగేష్ ఎడమ చేతిపై పుట్టుమచ్చ కూడా ఉంది. హర్యానా గ్యాంగ్‌స్టర్ హిమాన్షు భౌకి యోగేష్ చాలా సన్నిహితుడని చెప్పారు. హిమాన్షు జైల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్-గోల్డీ బ్రార్‌కు ప్రధాన శత్రువు అయిన బంబిహా గ్యాంగ్‌కు మద్దతుదారుడు.

హర్యానాలోని రోహ్‌తక్ జిల్లా నివాసి హిమాన్షు భౌపై కూడా ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు కూడా జారీ చేశారు. 2020లో హిమాన్షు భౌ జువైనల్ హోమ్ నుంచి పరారీ అయ్యాడు. అప్పటి నుంచి అతడు దర్యాప్తు ఏజెన్సీలకు పట్టుబడలేదు. ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం.. హిమాన్షుపై రెండు డజన్లకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే అమెరికాలో ఉంటున్న హిమాన్షు వద్దకు యోగేష్ చేరుకున్నట్లు సమాచారం.