Basara IIIT Student Suicide : బాసర ట్రిపుల్ ఐటీలో మళ్లీ టెన్షన్ టెన్షన్.. హాస్టల్ గదిలో విద్యార్థి ఆత్మహత్య

బాసర ట్రిపుల్ ఐటీలో మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హాస్టల్ గదిలో ఇంజినీరింగ్ ఫస్టియర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. విద్యార్థి చనిపోయినా కాలేజీ ఇంచార్జి వీసీ, డైరెక్టర్ కనీసం పట్టించుకోవడం లేదని, విద్యార్థి మృతి వివరాలపై ఆరా తీయలేదని తోటి విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Basara IIIT Student Suicide : బాసర ట్రిపుల్ ఐటీలో మళ్లీ టెన్షన్ టెన్షన్.. హాస్టల్ గదిలో విద్యార్థి ఆత్మహత్య

Basara IIIT Student Suicide : బాసర ట్రిపుల్ ఐటీలో మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హాస్టల్ గదిలో ఇంజినీరింగ్ ఫస్టియర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. విద్యార్థి చనిపోయినా కాలేజీ ఇంచార్జి వీసీ, డైరెక్టర్ కనీసం పట్టించుకోవడం లేదని, విద్యార్థి మృతి వివరాలపై ఆరా తీయలేదని తోటి విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబులెన్స్ ను కానీ, వైద్యాధికారులను కానీ పిలిపించలేదని మండిపడ్డారు. అధికారుల తీరుకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. వీసీ చాంబర్ ముట్టడికి యత్నించారు. పక్కనే ఉన్న సీఐ వాహనంపై విద్యార్థులు దాడి చేశారు. ఈ దాడిలో వాహనం అద్దాలు ధ్వంసం అయ్యాయి.

కొంతకాలంగా బాసర ట్రిపుల్ ఐటీలో ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తోంది. ఇప్పుడు ఇంజినీరింగ్ ఫస్టియర్ విద్యార్థి సురేశ్ హాస్టల్ రూమ్ లో సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. సూసైడ్ చేసుకున్న విద్యార్థిది నిజామాబాద్ జిల్లాగా గుర్తించారు. విద్యార్థి సూసైడ్ తో బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థులు ఆందోళనకు దిగారు. స్టూడెంట్ ఉరేసుకుని చనిపోయినా అధికారులు కనీసం స్పందించడం లేదని ఆరోపించారు.

కొంతకాలం బాసర ట్రిపుల్ ఐటీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. జూలైలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. మౌలిక సదుపాయాలు కల్పించాలని, సమస్యలు పరిష్కరించాలంటూ వారం రోజులకుపైగా రోడ్డుపైకి వచ్చారు. క్యాంపస్ అధికారులు ఎన్నిసార్లు చర్చలు జరిపినా విద్యార్థులు వెనక్కి తగ్గలేదు. చివరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బాసరకు ట్రిపుల్ ఐటీకి వెళ్లి విద్యార్థులతో చర్చలు జరిపారు. సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. మంత్రి ఇచ్చిన గడువు పూర్తి కాగానే మరోసారి విద్యార్థులు ఆందోళనకు దిగారు. డైరెక్టర్ హామీతో విరమించారు.

ఇదిలా ఉండగానే క్యాంపస్ లో పుడ్ పాయిజన్ జరిగింది. పదుల సంఖ్యలో విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు. దీంతో విద్యార్థులు మరోసారి ఆందోళనకు దిగారు. ఫుడ్‌ పాయిజన్‌కు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. భోజనశాలకు లైసెన్స్‌ను వెంటనే రద్దు చేసి కొత్త వారిని నియమించాలని.. అంతవరకు పోరాటం ఆపబోమని చెప్పారు. మరోసారి అధికారులు చర్చించి హామీ ఇవ్వడంతో విద్యార్థులు శాంతించారు. ఆ తర్వాత మరో దారుణం వెలుగుచూసింది. వంటగదినే బాత్రూమ్ గా మారేశారు మెస్ సిబ్బంది. వంట రూమ్ లో మెస్ సిబ్బంది స్నానాలు చేస్తున్న వీడియో బయటకు రావడం దుమారం రేపింది.

ఇక రెండు రోజుల క్రితం క్యాంపస్ లోని తమ హాస్టల్ గదిలో ఇద్దరు విద్యార్థులు గంజాయి సేవిస్తూ పోలీసులకు పట్టుబడటం తీవ్ర కలకలం రేపింది. ఇది మరువక ముందే విద్యార్థి సూసైడ్ ఘటన వెలుగుచూసింది. వరుస ఘటనలతో బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. తమ పిల్లల క్షేమం గురించి వారి తల్లిదండ్రులు కూడా టెన్షన్ పడుతున్నారు.