Gun Culture : తెలంగాణలో పెరుగుతున్న గన్ కల్చర్-కట్టడికి పోలీసుల యత్నాలు

తెలంగాణ రాష్ట్రంలో తుపాకీ కల్చర్ పెరుగుతోంది. అక్రమంగా ఆయుధాలు తెచ్చుకుని ప్రత్యర్థులను మట్టుబెడుతున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి.

Gun Culture : తెలంగాణలో పెరుగుతున్న గన్ కల్చర్-కట్టడికి పోలీసుల యత్నాలు

Gun Culture In Telangana

Gun Culture :  తెలంగాణ రాష్ట్రంలో తుపాకీ కల్చర్ పెరుగుతోంది. అక్రమంగా ఆయుధాలు తెచ్చుకుని ప్రత్యర్థులను మట్టుబెడుతున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఇటీవలె హైదరాబాద్ శివారులోని ఇబ్రహీంపట్నం కర్ణంగూడలో ఇద్దరు రియల్టర్లను ప్రత్యర్థులు కాల్చి చంపేయగా.. నాలుగు రోజుల క్రితం సిద్ధిపేట జిల్లాలోనూ ఇలాంటి సీనే రిపీట్ అయింది. దీంతో అలెర్టయిన పోలీసులు.. గన్స్‌ ఎక్కడి నుంచి తెస్తున్నారో తేల్చే పనిలో పడ్డారు.

తెలంగాణలో అక్రమ ఆయుధాలు అలజడి సృష్టిస్తున్నాయి. ఇటీవల జరిగిన వరుస ఘటనలు ఇందుకు అద్దం పడుతున్నాయి. ఇవి అధికారులనూ అందోళనకు గురి చేస్తున్నాయి. సిద్ధిపేట జిల్లాలో రెండు ఘటనలు జరగడంతో పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. అలాగే హైదరాబాద్‌ అల్వాల్‌ హత్య, ఇబ్రహీంపట్నం జంట హత్యలు కూడా రియల్‌ ఎస్టేట్‌ వివాదాలతోనే జరిగాయి. ఈ ఘటనల్లోనూ తుపాకులనే వాడారు. దీంతో ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి.. ఎలా కొనుగోలు చేస్తున్నారనే విషయాలపై పోలీసులు ఫోకస్‌ చేశారు.

ఉత్తరాది నుంచి అక్రమంగా ఆయుధాలు సరఫరా అవుతున్నాయని పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఆయుధాలను సరఫరా చేసేందుకు కొన్ని ముఠాలు రంగంలోకి దిగాయని గుర్తించినట్లు తెలుస్తోంది. గతేడాది రాష్ట్రంలో 88 గన్స్‌, భారీగా బుల్లెట్లు పట్టుబడ్డాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. నానాటికీ పెరుగుతున్న ఈ గన్‌ కల్చర్‌ ఎటువైపు దారి తీస్తుందోననే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఇబ్రహీంపట్నం జంట హత్యలకు వాడిన ఆయుధాలను ప్రధాన నిందితుడు మట్టారెడ్డి బిహార్‌ నుంచి తెప్పించినట్లు పోలీసులు తేల్చారు. ఒక పిస్టల్, ఒక రివాల్వర్‌, 21 రౌండ్ల బుల్లెట్లను కలిపి 11 లక్షలకు కొనుగోలు చేశాడు. బిహార్‌లోని శివాన్‌ జిల్లాకు చెందిన సమీర్‌ అలీ ద్వారా తుపాకులు తెప్పించుకున్నాడు. ఉపాధి కోసం ఉత్తరాది నుంచి వేల సంఖ్యలో జనం హైదరాబాద్‌కు వస్తుంటారు. ఆయుధ వ్యాపారులు వారి ద్వారా సంప్రదింపులు జరుపుతూ.. కొనుగోలుదారులకు సరఫరా చేస్తున్నట్లు పోలీస్‌ ఎంక్వైరీలో తేలింది. 10 వేలు పెడితే రివాల్వర్‌, 30 వేలకు ఆటోమేటిక్‌ పిస్టల్‌ అమ్ముతున్నట్లు తెలిసింది.
Also Read : Telangana Police : పోలీసు శాఖలో 18,334 పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు

మధ్యప్రదేశ్‌లోని రూస్సీ, రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌, పశ్చిమబెంగాల్‌లోని మాల్దాలతో పాటు బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లోని అనేక ప్రాంతాల్లో ఆయుధాలు తయారు చేస్తున్నారు. గతేడాది బిహార్‌ రాజధాని పట్నా సమీపంలోని సబల్‌పుర్‌ గ్రామంలో ఓ ఆయుధ తయారీ పరిశ్రమపై అక్కడి పోలీసులు దాడి చేశారు. భద్రతా సంస్థలు వాడే ఆటోమేటిక్‌ పిస్టళ్లు రోజుకు 15 వరకూ తయారు చేసి ఒక్కోటి 6 వేల 500లకు అమ్ముతున్నట్లు గుర్తించారు. ఇలాంటి ఉదంతాలు ఉత్తరాదిలో ఎన్నో ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు.

హైదరాబాద్‌లో ఆయుధాలకు డిమాండ్‌ ఎక్కువవడం వల్లే ఆయుధ రవాణా జరుగుతోందని పోలీసులు గుర్తించారు. లైసెన్సులు ఇవ్వడాన్ని పోలీసులు కఠినతరం చేయడంతో రియల్ ఎస్టేట్ మాఫియా.. అనఫీషియల్‌గా వెపన్స్‌ కొనుగోలు చేస్తున్నట్లు చెప్తున్నారు. శత్రువులను బెదిరించడానికి, ప్రాణరక్షణకు వీటిని కొనుగోలు చేస్తున్నారు.
Also Read : Bhagwant Mann : తగ్గేదేలే…అంటున్న పంజాబ్ కొత్త సీఎం భగవంత్ మాన్‌

ఆయుధాల రవాణాను కొందరు వృత్తిగా మలచుకుంటున్నారని, నగరానికి చెందిన పలువురు యువకులు మహారాష్ట్రలోని నాందేడ్‌, ఔరంగాబాద్‌ వంటి ప్రాంతాలకు వెళ్లి వాటిని తీసుకొస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పోలీసులు చెప్తున్నారు. గన్ కల్చర్‌ పెరగకుండా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని.. త్వరలోనే యాక్షన్‌ ప్లాన్‌ రెడీ చేసి.. ఆయుధ రవాణాకు ఫుల్ స్టాప్‌ పెడతామంటున్నారు తెలంగాణ పోలీసులు.