Army Chopper Crash : బిపిన్ రావత్ నీళ్లు కావాలని అడిగారు..కన్నీటి పర్యంతమైన ప్రత్యక్ష సాక్షి
తమిళనాడు రాష్ట్రంలోని కూనూర్ కి ఏడు కిలోమీటర్ల సమీపంలో బుధవారం మధ్యాహ్నాం సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఎయిర్ ఫోర్స్ హెలికాఫ్టర్ కూలిపోయిన ఘటనలో 13మంది ప్రాణాలు

Choper Crash2
Army Chopper Crash : తమిళనాడు రాష్ట్రంలోని కూనూర్ కి ఏడు కిలోమీటర్ల సమీపంలో బుధవారం మధ్యాహ్నాం సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఎయిర్ ఫోర్స్ హెలికాఫ్టర్ కూలిపోయిన ఘటనలో 13మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే అసలు ప్రమాదం ఎలా జరిగింది, హెలికాప్టర్ కుప్పకూలిన తర్వాత ఏం జరిగిందనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్న క్రమంలో… ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జనరల్ బిపిన్ రావత్ కొద్దిసేపు ప్రాణాలతోనే ఉన్నారని.. చివరిసారిగా తనతో ఆయన మాట్లాడారని ఒక ప్రత్యక్ష సాక్షి చెప్పిన విషయం ఇప్పుడు వైరల్‌గా మారింది.
హెలికాఫ్టర్ ప్రమాద సమయంలో అక్కడే ఉన్న శివకుమార్ అనే ప్రత్యక్ష సాక్షి మాట్లాడుతూ..”మధ్యాహ్నం మేం టీ ఎస్టేట్ లో పనిచేస్తున్న సమయంలో భారీ శబ్దం వినబడింది. అక్కడకు వెళ్లి చూస్తే చెట్టుకొమ్మలపై ఓ హెలికాప్టర్ మంటల్లో కాలుతూ కన్పించింది. ఆ ప్రదేశంలోని పొదల్లో ముగ్గురు వ్యక్తులు తీవ్రగాయాలతో కనిపించారు. వారు హెలికాప్టర్ నుంచి దూకేసి ఉండవచ్చు. వాళ్ల దగ్గరికి వెళ్లి చూస్తే వాళ్ల బట్టలు పూర్తిగా కాలిపోయి ఉన్నారు. వారిలో ఒకరు ఊపిరితో ఉన్నారు. దాహంగా ఉంది.. కొన్ని మంచినీళ్లు కావాలని అడిగాడు.
కానీ మేం ఆయనకు ఏం కాదని ధైర్యంచెప్పి.. తప్పకుండా సహాయం చేస్తామని చెప్పాం. మేం అతడిని ఒక బెడ్ షీట్ సహాయంతో పొదల్లో నుంచి బయటకు లాక్కొచ్చాం. అప్పుడే రెస్క్యూ సిబ్బంది వచ్చి ఆయనని వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అయితే ఆ సమయంలో ఆయన ఎవరో తెలియదు. ఇది జరిగిన మూడు గంటల తర్వాత నేను మాట్లాడిన వ్యక్తి ఈ దేశానికి ఎంతో సేవ చేసిన సీడీఎస్ బిపిన్ రావత్ అని తెలిసింది. అది తెలిసి నాకు రాత్రంతా నిద్రపట్టలేదు. ఈ దేశం కోసం అహర్నిశలు కష్టపడిన గొప్ప వ్యక్తికి చివరి నిమిషంలో మంచినీళ్లు అడిగినా ఇవ్వలేకపోయాను”అని కన్నీటి పర్యంతమయ్యాడు. కాగా, బిపిన్ రావత్.. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయినట్లు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.
ALSO READ Army Chopper Crash : పార్ఠీవ దేహాలను తరలించే అంబులెన్స్ కు యాక్సిడెంట్