Nalgonda : కాలువలో కారు కేసులో కొత్త ట్విస్ట్-కారు చోరీకి గురైందన్న యజమాని విఘ్నేశ్వరి

నల్గొండ జిల్లా సాగర్ కాలువలో కారు ఘటనలో కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది. కాలువలోకి కారును తోసింది  అన్నాచెల్లెల్లుగా అనుమానిస్తున్నారు పోలీసులు.

Nalgonda : కాలువలో కారు కేసులో కొత్త ట్విస్ట్-కారు చోరీకి గురైందన్న యజమాని విఘ్నేశ్వరి

Nalgonda Canal Car Casse

Nalgonda : నల్గొండ జిల్లా సాగర్ కాలువలో కారు ఘటనలో కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది. కాలువలోకి కారును తోసింది  అన్నాచెల్లెల్లుగా అనుమానిస్తున్నారు పోలీసులు. మల్లికార్జున్‌, విఘ్నేశ్వరి కారును కాలువలోకి తోసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.  అయితే వారిద్దరికి మతిస్థిమితం సరిగా లేదంటున్నారు బంధువులు.

ఈ కారు కూడా విఘ్నేశ్వరిదిగా గుర్తించారు పోలీసులు.. ఇటీవలే కొనుగోలు చేసిన ఈ కారు.. మిర్యాలగూడలోని ఓ థియేటర్‌ వద్ద పార్క్‌ చేసిన సమయంలో చోరి అయ్యిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది విఘ్నేశ్వరి. అయితే అర్ధరాత్రి 12 గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసులో డీఎస్పీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది.

మరోవైపు వేములపల్లి మండలం గోగువారిగూడెం వద్ద సాగర్ ఎడమ కాలువలో నుంచి తీసేందుకు ఇవాళ మరోసారి ప్రయత్నించనున్నారు పోలీసులు. గజ ఈతగాళ్ల సహాయంతో కారును బయటకు తీసేందుకు చర్యలు చేపట్టనున్నారు. కారు మొత్తం నీటిలో మునిగిపోవడంతో వెలికితీసేందుకు కష్టంగా మారింది. నిన్న రాత్రి వరకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగినా.. చీకటి పడడంతో కారును బయటకు తీసే పనిని ఆపేశారు.

అసలు కారు కాలువలోకి ఎలా వెళ్లిందనే విషయంపై ఎడమ కాలువ పక్కన గ్రామాల్లో పోలీసులు ఆరా తీస్తున్నారు. గోగువారిగూడెం, చిల్లాపురం పరిధిలోనే కారు కాలువలో పడి ఉండే అవకాశం ఉందంటున్నారు పోలీసులు. మరోవైపు వేములపల్లి మండలం అన్నపురెడ్డిగూడెం సమీపంలో కారును ఉద్దేశ్యపూర్వకంగా ఇద్దరు కాలువలోకి తోసేసినట్లు స్థానికులు చెబుతున్నారు. కారులో తమ లగేజీ, ఇతర వస్తువులు అన్ని ఉంచి కాలువలోకి నెట్టేశారని అంటున్నారు.

హోలీ పండగ చేసుకొని కాలువలో ఈత కొడుతుండగా కారు కొట్టుకొచ్చిందని తెలిపారు స్థానికులు. కారు ముందు అద్దం పగిలిపోయి ఉందని, అందులో మనుషులెవరూ లేరని చెప్పారు. అయితే రోడ్డుకు అవతలి వైపు ఓ జంట మాత్రం తమకు కనిపించిందని అంటున్నారు.
Also Read : Sagar Canal Car : నల్గొండ జిల్లా సాగర్ ఎడమ కాలువలో కారు కలకలం

తమకు నిన్న మధ్యాహ్నం 2నుంచి 2: 30గంటల సమయంలో కారు కాలువలో కొట్టుకొచ్చిన్నట్లు సమాచారం అందిందన్నారు పోలీసులు. కారు ఉన్న ప్రదేశాన్ని గుర్తించామని, ఈరోజు దానిని బయటకు తీస్తామని వెల్లడించారు పోలీసులు.