మత్తుమందు ఇచ్చి, నగ్నంగా వీడియోలు తీసి విద్యార్థినికి బెదిరింపులు

మత్తుమందు ఇచ్చి, నగ్నంగా వీడియోలు తీసి విద్యార్థినికి బెదిరింపులు

మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు తెచ్చినా, కఠిన శిక్షలు విధిస్తున్నా మార్పు రావడం లేదు. ఆడపిల్ల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. మృగాళ్లు రెచ్చిపోతూనే ఉన్నారు. అమ్మాయిలను నమ్మించి మోసం చేస్తున్నారు. నగ్న వీడియోలు తీసి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. తాజాగా గుంటూరులో దారుణం జరిగింది. చదువు పేరుతో ఓ యువకుడు నీచానికి ఒడిగట్టాడు. కూల్ డ్రింక్ లో మత్తు మందు ఇచ్చి నగ్న వీడియోలు తీసి వాటితో యువతిని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. చివరికి పాపం పండి పోలీసులకు చిక్కాడు.

చదువు పేరుతో ఇంటికి తీసుకెళ్లి, అమ్మాయి నగ్న వీడియోలు తీసి:
నగ్న వీడియోలతో యువతిని వేధిస్తున్న ఘటనలో గుంటూరు అర్బన్‌ పోలీసులు ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. మూడేళ్ల కిందట గుంటూరుకు చెందిన 17 ఏళ్ల విద్యార్థినికి (ఇప్పుడు 20 ఏళ్లు) అదే ప్రాంతానికి చెందిన వరుణ్‌ పరిచయమయ్యాడు. స్నేహం ముసుగులో ఆమెను చదువుకుందాం రమ్మంటూ తన అపార్ట్ మెంట్‌కు తీసుకెళ్లాడు. కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపిన వరుణ్ దాన్ని విద్యార్థినికి ఇచ్చాడు. అది తాగిన విద్యార్థిని స్పృహ కోల్పోయింది. ఇదే అదనుగా ఆమెను నగ్నంగా వీడియో తీశాడు వరుణ్. ఆ వీడియోలను అడ్డుపెట్టుకొని బెదిరించే ప్రయత్నం చేశాడు. దీంతో యువతి అతడిని దూరం పెట్టింది.

యువతి నూడ్ వీడియోలు లీక్:
ఇంతలో ఆమె ఇంజినీరింగ్‌ కాలేజీలో జాయిన్ అయ్యింది. అక్కడ మరో యువకుడు కౌశిక్‌ పరిచయమయ్యాడు. ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అతని కుటుంబ సభ్యులు కాలేజీకి వెళ్లి అమ్మాయి గురించి వాకబు చేయగా వరుణ్‌ గురించి తెలుసుకున్నారు. అతనితో మాట్లాడంతోపాటు వీడియోలను తీసుకొచ్చి కౌశిక్‌కు చూపించారు. దీంతో కౌశిక్ ఆమెతో సంబంధాన్ని వదులుకున్నాడు.

పోర్న్ సైట్ లో యువతి నగ్న వీడియోలు:
ఆ యువతి మూడో వ్యక్తితో సన్నిహితంగా ఉంటోందని అనుమానించిన కౌశిక్‌ తన దగ్గరున్న నగ్న వీడియోలను ఇంటర్నెట్‌లో పెట్టి ఆమెను డబ్బులివ్వాలని బెదిరించాడు. విషయం తెలిసిన యువతి బంధువులు వరుణ్‌, కౌశిక్‌ కుటుంబ సభ్యులను కలిసి వాటిని ఇంటర్నెట్‌ నుంచి తీసివేయించారు. సమస్య తొలగిపోయిందని అనుకుంటుండగానే కొద్ది రోజుల కిందట సోషల్ మీడియాలో వీడియో ప్రత్యక్షమవడంతో యువతి షాక్ తింది. దాదాపుగా మూడేళ్లుగా వేధింపులకు గురైన బాధిత యువతి చివరికి పోలీసులను ఆశ్రయించింది. గుంటూరు అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డికి ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో వరుణ్‌, కౌశిక్‌లను పోలీసులు అరెస్టు చేశారు.