HP Assembly Polls: వారసత్వ రాజకీయాలంటూ కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తూ మరోసారి విరుచుకుపడ్డ అమిత్ షా
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు శుక్రవారం ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. నవంబర్ 12న హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుందని, డిసెంబర్ 8న కౌంటింగ్ నిర్వహిస్తామని ఈసీ ప్రకటించింది. అక్టోబర్ 17న నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపింది. నామినేషన్లకు చివరి తేదీ అక్టోబర్ 25 కాగా.. అక్టోబర్ 27న నామినేషన్ల పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 29 వరకు గడువు ఉంటుందని ఈసీ స్పష్టంచేసింది

Amit Shah once again targeted Congress as inheritance politics
HP Assembly Polls: వారసత్వ రాజకీయాలంటూ కాంగ్రెస్ పార్టీపై తరుచూ విరుచుకుపడే కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. మరోసారి అవే వ్యాఖ్యలను ఊటంకిస్తూ విమర్శలు గుప్పించారు. వారసత్వ రాజకీయాల నుంచి దేశానికి విముక్తి లేదా అని సభికుల్ని ప్రశ్నించిన ఆయన.. తమ ప్రభుత్వం అదే పనిలో ఉందని మళ్లీ ఆయనే సమాధానం ఇచ్చారు. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా శనివారం సిర్మౌర్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో అమిత్ షా పాల్గొని ప్రసంగించారు.
‘‘దేశం 70 ఏళ్లపాటు వారసత్వ రాజకీయాలతోనే నడిచింది. ఈ దేశానికి వారసత్వ రాజకీయాల నుంచి విముక్తి లేదా?.. దేశానికి ఇలాంటి రాజకీయాల నుంచి విముక్తి కావాలి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అదే పనిలో ఉన్నారు. ఇప్పటికే వారసత్వ రాజకీయాలను దాదాపుగా దేశం నుంచి పారదోలారు. కాంగ్రెస్ పార్టీకి కేవలం అధికారం మాత్రమే కావాలి. కానీ, మన పురాతన వారసత్వ సంపద గురించి వారికెలాంటి పట్టింపూ ఉండదు’’ అని అన్నారు.
ఇక హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మరోసారి విజయం సాధిస్తుందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం బీజేపీనే అధికారంలో ఉన్న ఆ రాష్ట్రంలో.. మరో కొద్ది రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో మూడింట రెండవ వంతు మెజారీటీ సాధిస్తుందని ఆయన జోస్యం చెప్పారు.
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు శుక్రవారం ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. నవంబర్ 12న హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుందని, డిసెంబర్ 8న కౌంటింగ్ నిర్వహిస్తామని ఈసీ ప్రకటించింది. అక్టోబర్ 17న నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపింది. నామినేషన్లకు చివరి తేదీ అక్టోబర్ 25 కాగా.. అక్టోబర్ 27న నామినేషన్ల పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 29 వరకు గడువు ఉంటుందని ఈసీ స్పష్టంచేసింది. ఒకే విడతలో హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించింది. జనవరి 8తో హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ పదవీకాలం ముగియనుంది. హిమాచల్‌ప్రదేశ్‌లో మొత్తం 68 అసెంబ్లీ స్థానాలు ఉండగా, 5 లక్షల 7 వేల 261 మంది ఓటర్లు ఉన్నారు.