Ganesh Chaturthi: బహిరంగ వినాయక మండపాలు, సామూహిక నిమజ్జనానికి అనుమతి లేదు

  • Published By: bheemraj ,Published On : August 19, 2020 / 09:47 PM IST
Ganesh Chaturthi: బహిరంగ వినాయక మండపాలు, సామూహిక నిమజ్జనానికి అనుమతి లేదు

Vinayaka Chaturthi 2020: వినాయక చవితిపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో బహిరంగ వినాయక మండపాలు, భారీ గణనాథుల ఏర్పాటు, నదులు, చెరువుల్లో సామూహిక నిమజ్జనానికి అనుమతి లేదని స్పష్టం చేసింది. ఈ ఏడాది బహిరంగ వినాయక మండపాలు, సామూహిక నిమజ్జనానికి అనుమతి లేదని.. ఇళ్లల్లోనే పూజలు చేసుకోవాలని స్పష్టం చేసింది.



విగ్రహాల పొడవు 2 అడుగుల కంటే ఎక్కువగా ఉండకూడదని.. ఎక్కడ ప్రతిష్టించారో అక్కడే నిమజ్జనం చేయాలని తెలిపింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు.

బుధవారం (ఆగస్టు 19, 2020) దేవాదాయశాఖ కార్యాలయంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ నేతృత్వంలో వినాయక చవితి వేడుకలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. భేటీ అనంతరం మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ కరోనా పరిస్థితుల దృష్ట్యాల బహిరంగ వినాయక మండపాలు, భారీ గణనాథుల ఏర్పాటు, నదులు, చెరువుల్లో సామూహిక నిమజ్జనానికి అనుమతి లేదని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాయాల్లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వినాయక పూజలు చేసుకోవచ్చన్నారు.



ఊరేగింపులు, లౌడ్ స్పీకర్లు, డీజేలకు అనుమతులు లేవని స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని.. అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

కాగా, ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,16,003కి చేరింది. కరోనా నుంచి కోలుకుని 2,26,372 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. కరోనా బారినపడి రాష్ట్రంలో 2,906 మంది మరణించారు. ప్రస్తుతం 86,725 కరోనా యాక్టివ్ కేసులున్నట్లు ఏపీ వైద్యఆరోగ్యశాఖ తెలిపింది.



గడిచిన 24 గంటల్లో 57,685 శాంపిల్స్‌ను పరీక్షించారు. ఇందులో 23,599 ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్‌లు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 30,19,296 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.