టెస్టు చేయని కరోనా వ్యాక్సీన్ వేయించుకున్న వైద్యురాలు!

  • Published By: sreehari ,Published On : March 5, 2020 / 02:28 AM IST
టెస్టు చేయని కరోనా వ్యాక్సీన్ వేయించుకున్న వైద్యురాలు!

చైనాలోని వుహాన్ సిటీలో ఉద్భవించిన కరోనా వైరస్‌ను నిర్మూలించేందుకు డ్రాగన్ దేశం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. కరోనాకు మందు కనిపెట్టేందుకు ఆ దేశ సైంటిస్టులు నెల రోజుల నుంచి రాత్రింబవళ్లూ వుహాన్ ఇన్సిస్ట్యూట్ ఆఫ్ వైరాలజీలోని టెస్టు ల్యాబుల్లో విస్తృత స్థాయిలో పరిశోధనలు చేస్తున్నారు. ఈ క్రమంలో కరోనా వైరస్ విరుగుడు కోసం కొన్ని రకాల వ్యాక్సీన్లను రూపొందించారు చైనీస్ సైంటిస్టులు.. అయితే కరోనా వైరస్ వ్యాక్సీన్ మార్కెట్లోకి రావాలంటే పూర్తిస్థాయిలో పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది.(పేటీఎం ఉద్యోగికి కరోనా)

ముందుగా జంతువులపై ఆ వ్యాక్సీన్ ప్రయోగించిన తర్వాతే మనుషులపై ప్రయోగించడం జరుగుతుంది. కనీసం జంతువులపై కూడా పరీక్షించకుండానే కరోనా వైరస్ వ్యాక్సీన్‌ను నేరుగా తనపైనే ప్రయోగించుకున్నారు ప్రపంచ ప్రఖ్యాత ఎపిడెమియాలజిస్ట్, చైనాలోని పీపుల్స్ లిబరేషన్స్ ఆర్మీ మేజర్ జనరల్ చెన్ వెయి వైద్యురాలు.

గతంలో ఎబోలా, SARS వంటి వైరస్ లు విజృంభించిన సమయంలో కూడా ఈ వైద్యురాలే ధైర్యంగా పోరాడారు. ఇప్పుడు కరోనా వైరస్ వ్యాప్తిపై కూడా చెన్ అదే స్పూర్తితో ముందుకు వచ్చారు. 54ఏళ్ల చెన్.. తన ఆరుగురు వైద్యబృందంతో కలిసి టెస్టింగ్ చేయని కరోనా వ్యాక్సీన్ తన ఎడమ చేతికి తనకు తానే వేయించుకున్నారు.

తనతోపాటు బృందంలోని మిగిలినవారు కూడా ఆమెతో పాటు వ్యాక్సీన్ స్వయంగా వేయించుకున్నారు. కమ్యూనిస్ట్ పార్టీకి విధేయులుగా వీరంతా వ్యాక్సీన్ వేయించుకునేందుకు ముందుకు వచ్చారు. వాస్తవానికి ఈ కరోనా వైరస్ వ్యాక్సీన్ ఇంకా జంతువులపై కూడా పరీక్షించలేదు. వుహాన్ సిటీలో కరోనా విజృంభించినప్పటి నుంచి అక్కడే ఉంటూ చెన్ తన వైద్య సేవలు అందిస్తున్నారు.

రోజురోజుకీ తీవ్రమైపోతున్న కరోనా వైరస్ వ్యాప్తిని నిర్మూలించేందుకు చైనా వ్యాక్సీన్ కనిపెట్టడంలో నిమగ్నమైంది. చైనా పరిశోధక బృందం ప్లాస్మా థెరపీ సహా పలు చికిత్సలపై వర్క్ చేస్తోంది. అంతేకాదు.. వైరస్ నుంచి వ్యాధి నిరోధక శక్తిని మరింత పెంచుకునేందుకు నాజల్ స్ర్పే వంటి కారకాలను తిరిగి పునరుద్ధరిస్తోంది.

ఈ సందర్భంగా చైనా వైద్యురాలు చెన్.. దేశీయ టెలివిజన్ స్టేషన్ తో మాట్లాడుతూ.. కరోనా వ్యాక్సీన్ తయారీ కోసం తీవ్రస్థాయిలో పరిశోధనలు జరుగుతున్నట్టు తెలిపారు. ‘వైరస్ ఎదుర్కొనే వ్యాక్సీన్ డెవలప్ చేసేందుకు చేయాల్సినంత చేస్తున్నాం. క్లినికల్ ట్రయల్ వరకు వ్యాక్సీన్ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. వైరస్‌ను నిర్మూలించేందుకు పటిష్టమైన టెక్నికల్ సపోర్టు అందుబాటులో ఉంది’ అని ఆమె వెల్లడించారు. 

ఈ సందర్భంగా ప్రాంతీయ టెలివిజన్ రిపోర్టులో వ్యాక్సీన్ వేయించుకున్న ఫొటేజీలను జత చేయలేదు. కానీ, PLA అధికారిక Weibo ఛానల్ ద్వారా చెన్.. తన ఎడమ చేతికి వ్యాక్సీన్ వేయించుకుంటున్న ఫొటోలను షేర్ చేసింది. ఆ ఫొటోల్లో చెన్‌తో పాటు ఆరుగురు PLA సభ్యులు కూడా వ్యాక్సీన్ వేయించుకున్నట్టుగా కనిపిస్తున్నాయి. అయితే కొద్దిసేపటికే వెయిబో పోస్టులో ఆ ఫొటోలను డిలీట్ చేసింది.

కానీ, ఆయా ఫొటోలకు సంబంధించి స్రీన్ షాట్లు ట్విట్టర్ సహా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతున్నాయి. చైనా అధ్యక్షుడు జి జిన్ పింగ్ అకాడమీ మిలటరీ మెడికల్ సైన్సెస్ సందర్శించిన మరుసటి రోజే ఈ వార్త వెలుగులోకి వచ్చింది. కరోనా వైరస్ ను ఎలాగైనా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందని ఆయన అక్కడి పరిశోధకులకు నొక్కి చెప్పినట్టు తెలుస్తోంది.

మరోవైపు ప్రపంచవ్యాప్తంగా చైనా తర్వాత డజన్ల కొద్ది ల్యాబుల్లో కరోనా వైరస్ కోసం వ్యాక్సీస్ కనిపెట్టే పనిలో పడ్డాయి. చాలా ల్యాబుల్లో ప్రొటోటైప్ వ్యాక్సీన్లను జంతువులపై ప్రయోగిస్తున్నారు. మనుషులపై ప్రయోగించడానికి కొన్ని నెలల ముందుగానే వ్యాక్సీన్లపై టెస్టింగ్ ప్రక్రియ జరుగుతోంది.

కరోనా వైరస్‌పై వ్యాక్సీన్ ఎంతవరకు సమర్థవంతంగా పనిచేస్తుంది.. దాని వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా? అనేదానిపై కూడా ట్రయల్స్ నడుస్తున్నాయి. ఏదైనా ఒక వ్యాక్సీన్ మార్కెట్లోకి రావాలంటే ముందుగా రెగ్యులేటరీ ఆమోదం పొందాలి. అప్పుడే అది పబ్లిక్ లోకి విడుదల చేసే అవకాశం ఉంటుంది. పూర్తి స్థాయిలో ఈ వ్యాక్సీన్ అందరికి అందుబాటులోకి రావాలంటే వచ్చే ఏడాది వరకు వేచి చూడాల్సిందే…