ఆ రెండింట్లో ఏ వ్యాక్సిన్ వేస్తారో : ఇచ్చిందే వేయించుకోవాలి.. నో ఆప్షన్.. !

ఆ రెండింట్లో ఏ వ్యాక్సిన్ వేస్తారో : ఇచ్చిందే వేయించుకోవాలి.. నో ఆప్షన్.. !

Covid vaccine may not be able to pic and Choose : భారత్‌లో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్‌కు కేంద్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. దేశవ్యాప్తంగా జనవరి 16 నుంచి కరోనా వ్యాక్సిన్ డ్రైవ్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. ఆక్స్ ఫర్డ్ ఆస్ట్రాజెనికా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్, భారత్ బయోటెక్ కోవాగ్జిన్ వ్యాక్సిన్ ల పంపిణీ కొనసాగుతోంది.. రెండు కరోనా వ్యాక్సిన్ మోతాదులను ఇప్పటికే పలు రాష్ట్రాలకు పంపిణీ చేయడం ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఒకటి కంటే ఎక్కువగా కరోనా వ్యాక్సిన్లను అందిస్తున్నారు. ఈ దేశాల్లో వ్యాక్సిన్ తీసుకునేవారికి ఏ వ్యాక్సిన్ కావాలో ఎలాంటి ఆప్షన్ అందుబాటులో లేదు.

ఆయా దేశాల ప్రభుత్వాలు ఏ వ్యాక్సిన్ వేస్తే అదే వేయించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు భారతదేశంలో కూడా ఇదే విధానం అమలు కానుంది. పుణె ఆధారిత సీరమ్, హైదరాబాద్ ఆధారిత భారత్ బయోటెక్ వ్యాక్సిన్లు అయిన కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలను తీసుకునేవారికి కూడా ఎలాంటి ఆప్షన్ లేదు. నచ్చిన వ్యాక్సిన్ వేయించుకుంటానంటే కుదరదు. భారత్‌లో కరోనా వ్యాక్సినేషన్ స్వచ్చంధమే అయినప్పటికీ ముందుగా హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు టీకా ఎంపికలో ఏదైనా ఆప్షన్ ఉందా? లేదా అనేది స్పష్టత లేదు. లేదంటే ఎవరికి ఏ వ్యాక్సిన్ వేస్తారో తెలియదు. అందరికి ఒకే రకమైన వ్యాక్సిన్ వేయికపోవచ్చు. కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాలలో ఏదో ఒకటి ఇచ్చే అవకాశం ఉంది.

వ్యాక్సిన్ మోతాదుల విషయానికి వస్తే.. 28 రోజుల వ్యవధిలో టీకా రెండు మోతాదులను ఇవ్వనున్నారు. రెండు వారాల తర్వాత రెండో మోతాదు టీకాను అందిస్తారు. రెండో డోస్ తీసుకున్న 14 రోజుల తర్వాతే వ్యాక్సిన్ పనిచేయడం మొదలవుతుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. దేశంలో గతవారంలో కరోనా పాజిటివిటీ రేటు 2శాతానికి పడిపోగా.. కేరళ, మహారాష్ట్రలో మాత్రమే 50వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి.

కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలకు జనవరి 3న అత్యవసర వినియోగానికి డ్రగ్ రెగ్యులేటర్ ఆమోదం తెలిపింది. ఈ రెండు వ్యాక్సిన్లపై వేలామందితో ట్రయల్స్ నిర్వహించగా సురక్షితమేనని తేలింది. ఈ రెండు వ్యాక్సిన్లు సురక్షితమేననడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు. ఇప్పటివరకూ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదని, ఎలాంటి ముప్పు లేదంటున్నారు.