జర జాగ్రత్త: కుక్క నాకింది.. ఒళ్లంతా కుళ్లి యజమాని మృతి

  • Published By: sreehari ,Published On : November 25, 2019 / 01:48 PM IST
జర జాగ్రత్త: కుక్క నాకింది.. ఒళ్లంతా కుళ్లి యజమాని మృతి

మూగ జీవాలంటే చాలామంది ఇష్టపడతారు. మనుషుల కంటే ఎంతో విశ్వాసమైన కుక్కలను ఇళ్లల్లో పెంచుకుంటుంటారు. పెంపుడు జంతువుల పోషణలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు యజమానులు. అయితే వీటితో మెలిగే ముందు కాస్త జాగ్రత్తగా ఉండాలంటున్నారు వైద్య నిపుణులు.

ఎందుకంటే.. పెంపుడు జంతువుల్లో ఎంత శుభ్రతను పాటించినప్పటికీ వాటిలో కొన్ని ఇన్ఫెక్షన్లు ఈజీగా మనుషులకు వ్యాప్తి చెందుతుంటాయి. ప్రాణాలు తీసేంతగా ఉండవు. కానీ, జర్మనీలో ఇంట్లో పెంచుకునే కుక్క నాకడంతో 63ఏళ్ల యజమాని ఇన్ఫెక్షన్ సోకి ప్రాణాలు కోల్పోయాడు. కుక్క లాలాజాలంలోని (Capnocytophaga canimorsus) అనే బ్యాక్టీరియా కారణంగా అతడు మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. 

సాధారణంగా ఈ బ్యాక్టరీయా కుక్కలు కరవడం ద్వారా సోకుతుంది. కానీ, కేవలం నాకడం ద్వారా కూడా ఈ బ్యాక్టీరియా సోకుతుందని వైద్యులు నిర్ధారించారు. అప్పటివరకూ ఎంతో ఆరోగ్యంగా ఉన్న యజమాని.. కుక్క నాకినప్పటి నుంచి రెండువారాలుగా తీవ్ర జ్వరంతో మంచానపడ్డాడు. ప్నెమోనియా (ఊపిరితిత్తుల్లో వాపు), గ్యాంగ్రేనే (శరీరం కుళ్లడం) సహా 41డిగ్రీల జ్వరంతో ఆస్పత్రిలో చేరాడు. తొలుత అతడికి మూడు రోజుల నుంచి బాగా జ్వరం వచ్చి శ్వాస తీసుకోవడమే కష్టంగా మారింది.

జర్మనీలోని బ్రేమెన్ లో రోటే క్రియుజ్ క్రాంకెనోహాస్ నుంచి వచ్చిన వింత కేసుగా వైద్యులు చెప్పినట్టు మెడికల్ జనరల్ నివేదించింది. ఆస్పత్రిలో చికిత్స సమయంలోనే బాధితుడి ముఖం చేతులపై బొబ్బలు వచ్చి కుళ్లిపోయే స్థితికి చేరుకుంది. దీంతో అతడి ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు ఐసీయూలోకి తరలించారు. 

తొలి నాలుగు రోజుల్లో అతడి పరిస్థితి విషమంగానే ఉంది. అతడి ముఖం, కాళ్లు, చేతులపై బొబ్బులు వచ్చినట్టు వైద్యులు తెలిపారు. క్రమంగా ఆరోగ్యం క్షీణించి గుండెనొప్పితో మరణించాడు. C. canimorsus అనే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఎక్కువగా కుక్కలు కరవడం ద్వారా సోకుతుందని వైద్యులు తెలిపారు. కేవలం నాకడం ద్వారా మాత్రమే బ్యాక్టరీయా సోకడంపై వైద్యులు ఆశ్చర్యపోయారు. ఇదో అరుదైన కేసుగా వైద్యులు చెబుతున్నారు.

శరీరంపై వచ్చిన బొబ్బలు చాలా అరుదుగా కనిపిస్తున్నాయని నెదర్లాండ్స్ లో అధ్యయనం తెలిపింది. ఈ బ్యాక్టీరియా ప్రతి 1.5 మిలియన్ల మందిలో ఒకరికి మాత్రమే సోకుతుందని పేర్కొంది. దీని కారణంగా 28శాతం నుంచి 31 శాతం మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపింది.