సైనసైటిస్..ట్రీట్ మెంట్

సీజన్ తో సంబంధం లేకుండా తరచుగా జలుబు చేస్తూ ఉంటే మాత్రం అది సైనసైటిస్ ఇన్ ఫెక్షన్ కి దారి తీయొచ్చు.

  • Published By: veegamteam ,Published On : February 2, 2019 / 10:15 PM IST
సైనసైటిస్..ట్రీట్ మెంట్

సీజన్ తో సంబంధం లేకుండా తరచుగా జలుబు చేస్తూ ఉంటే మాత్రం అది సైనసైటిస్ ఇన్ ఫెక్షన్ కి దారి తీయొచ్చు.

మన ఊపిరితిత్తులు ఎంత పెద్దవో మీకు తెలుసా? వాటిని ఓపెన్ చేసి పరిచి పెడ్తే ఒక టెన్నిస్ కోర్ట్ అంత సైజ్ లో ఉంటాయి. ఇకపోతే మన శరీరంలోని 70 శాతం వ్యర్థాలను శ్వాసకోశాల ద్వారా బయటకు పంపిస్తాం. ఒక గంటకి 17.5 మిల్లీ లీటర్ల నీరు ఊపిరి వదలడం ద్వారా బయటకు పోతుంది. ఆశ్చర్యంగా ఉంది కదూ. ఇక ఈరోజు స్టోరీలోకి వద్దాం. సీజన్ మారిందంటే జలుబు చేయడం సహజం. ఎప్పుడో ఒకప్పుడు, ఏడాదిలో ఒకట్రెండు సార్లు జలుబైందంటే దాన్ని పెద్దగా పట్టించుకోనక్కర లేదు. కానీ సీజన్ తో సంబంధం లేకుండా తరచుగా జలుబు చేస్తూ ఉంటే మాత్రం అది సైనసైటిస్ ఇన్ ఫెక్షన్ కి దారి తీయొచ్చు. ఇంతకీ ఈ సైనస్ లంటే ఏమిటి? వీటికి ఇన్ ఫెక్షన్ వస్తే ఏమవుతుంది? ట్రీట్ మెంట్ ఏమిటి.. ఇప్పుడు తెలుసుకుందాం. 

వాతావరణం చల్లబడిందంటే చాలు.. తుమ్ములు, దగ్గులు మొదలవుతాయి కొందరికి. కొన్నిసార్లు చల్లటి వాతావరణం లేకపోయినా పదే పదే జలుబు అవుతుంటుంది. దీనికి కారణం అలర్జీ. 20 శాతం మందిలో అలర్జీ కనిపిస్తుంది. అయితే వీరిలో 5 శాతం మేరకు సైనసైటిస్ తో బాధపడేవాళ్లు కనిపిస్తుంటారు. సైనస్ లు లేదా గాలి గదులలో వచ్చే ఇన్ ఫెక్షన్ నే సైనసైటిస్ అంటారు. చాలా సార్లు అలర్జీ వల్ల జలుబు వచ్చి క్రమంగా గాలిగదులు లేదా సైనస్ లలో ఇన్ ఫెక్షన్ వస్తుంది. సైనస్ లలో ఇన్ ఫెక్షన్ వచ్చినప్పుడే అది నెమ్మదిగా దీర్ఘకాలిక సమస్యగా మారుతుంది. 

సైనసైటిస్ ని సాధారణ జలుబు అని అనుకొని ఏ యాంటి హిస్టమిన్లో వాడి ఊరుకుంటుంటారు. కాని అది సైనసైటిస్ అని గుర్తించలేరు. చాలా సందర్భాల్లో రెండింటి లక్షణాలూ ఒకేలా ఉండడం వల్ల ఇలా జరుగుతుంది. అయితే జలుబు రాని వాళ్లు ఎవరూ ఉండరు. అయితే సాధారణ జలుబు అయితే అయిదారు రోజుల్లో తగ్గిపోతుంది. జలుబుతో పాటు సైనస్ లు ఉన్న భాగాల్లో తలనొప్పి గా ఉంటే అది సైనసైటిస్ అని అనుమానించాలి. అక్యూట్ సైనసైటిస్ లో లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి తక్కువ అయ్యాయంటే సైనస్ దీర్ఘకాలిక సమస్యగా మారుతోందనే అర్థం. 

సైనస్ – లక్షణాలు
తల భారం 
కంటి కింది భాగంలో నొప్పి
ముక్కు దిబ్బడ
ముక్కు నుంచి చిక్కటి ద్రవ పదార్థాలు
ఈ పదార్థాలు గొంతు లోకి జారడం
వాసన తెలియకపోవడం
గొంతు నొప్పి, బొంగురు గొంతు
కొన్నిసార్లు దగ్గు

సైనసైటిస్ ఎక్కువ కాలం వేధిస్తున్నప్పుడు అది ఫంగల్ సైనసైటిస్ గా మారుతుంది. అప్పటివరకు బాక్టీరియాపై మన శరీరంలోని తెల్ల రక్తకణాల రియాక్షన్ వల్ల సూక్ష్మ క్రిములు, కొన్ని తెల్ల రక్తకణాలు చనిపోయి చీము ఏర్పడుతుంది. ఇలాంటప్పుడు చీము పదార్థాలు బయటికి రాలేక సైనస్ లోపలే ఉండిపోతాయి. ఈ పదార్థాలను తిని ఫంగస్ పెరుగుతుంది. దీన్నే ఫంగల్ సైనసైటిస్ అంటారు. దీనివల్ల అనేక రకాల కాంప్లికేషన్లు వస్తాయి. 

దీర్ఘకాల సమస్య అయినప్పుడు సైనస్ ను కంట్రోల్ చేయడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి అది దీర్ఘకాల వ్యాధిగా పరిణమించకుండా ముందు జాగ్రత్తపడడమే మంచిది. పదే పదే జలుబు అవుతుందనుకున్నా, చల్లని వాతావరణంలో, చల్లని వస్తువుల వల్ల తలనొప్పి వస్తుందనుకున్నా వెంటనే సైనస్ కు చికిత్స మొదలుపెట్టాలి. సకాలంలో చికిత్స తీసుకుంటే కాంప్లికేషన్లు రాకుండా కూడా నివారించవచ్చు. 

ఇదీ పరిష్కారం 
వైరస్ తో వచ్చే సాధారణ జలుబు ప్రతి ఒక్కరికి ఏడాదిలో ఒక్కసారైనా వస్తూనే ఉంటుంది. జలుబు ఉన్నప్పుడే జాగ్రత్త పడితే అది సైనసైటిస్ గా మారకుండా నివారించవచ్చు. మరి అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. జలుబు వల్ల ముక్కు దిబ్బడ వేసి, ముక్కు లోపల తయారైన ద్రవాలు బయటికి రాక ఇబ్బంది పడుతుంటాం. ఇలాంటప్పుడు నిర్లక్ష్యం చేస్తే అది బాక్టీరియల్ సైనసైటిస్ అయ్యేందుకు ఆస్కారం ఉంటుంది. అందుకే జలుబు మొదలైన తొలి దశలోనే మిరియాల పాలు తాగడం, ఆవిరి పట్టడం లాంటి జాగ్రత్తలు తీసుకుంటే అది మరింత తీవ్రంగా మారకుండా ఉంటుంది. అంతేకాదు, ఇలాంటప్పుడు ముక్కులోకి వేసుకునే చుక్కల మందు ద్వారా కూడా దీన్ని కంట్రోల్ చేయవచ్చు. 

సైనసైటిస్ కి కారణం అవుతున్న దాన్ని బట్టి చికిత్స ఉంటుంది. కనీసం ఆరు నెలల పాటు మందులు వాడాల్సి ఉంటుంది. కొన్నిసార్లు కొన్నేళ్లు కూడా వాడాల్సి రావొచ్చు. ఇప్పుడున్న మందుల వల్ల చాలావరకు సైనస్ కంట్రోల్ అయిపోతుంది. చాలా సందర్భాల్లో ఆపరేషన్ అవసరం లేకుండానే మందుల ద్వారా బాగవుతుంది. అయితే మందులు వేసుకున్నా కంట్రోల్ కావడం లేదనుకున్నప్పుడు సర్జరీ ద్వారా సైనస్ మార్గాల్లోని అవరోధాలను తొలగిస్తారు. 

ఆపరేషన్ అంటే భయంతో చాలామంది సైనస్ ట్రీట్ మెంట్ తీసుకోవడానికి వెనుకంజ వేస్తుంటారు. కాని ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన ఆపరేషన్ పద్ధతుల వల్ల చాలా సులువుగా సర్జరీ అయిపోతుంది. అయినా మందులు సక్రమంగా వాడుకుంటే చాలావరకు ఆపరేషన్ అవసరం లేకుండానే సైనసైటిస్ సమస్య నుంచి బయటపడవచ్చు. 

సైనస్ – అపోహలు
యాంకర్ : సైనస్ ప్రాబ్లమ్ ఒకసారి వచ్చిందంటే ఇక దానికి సర్జరీ తప్ప మార్గం లేదు అంటుంటారు. కాని మందులు వాడినా తగ్గని పరిస్థితిలో మాత్రమే సర్జరీ చేస్తారని తెలుసుకున్నాం కదా. అన్ని రోజులు యాంటి బయాటిక్స్ వాడితే ప్రమాదం రాదా..? అనే సందేహం చాలామందికి కలుగుతుంది. అదేవిధంగా ఒకసారి సర్జరీ చేయించుకుంటే చాలదు. మళ్లీ మళ్లీ అవసరం అవుతుందనే అనుమానం ఉంటుంది. ఇలాంటి సందేహాలకు డాక్టర్ ఏమంటున్నారో చూద్దాం. 

సైనసైటిస్ ఉన్నప్పుడు ఆపరేషన్ చేయించుకోవాలంటే భయపడుతారు. ఒకసారి ఆపరేషన్ చేయించుకున్నా అది పూర్తిగా సక్సెస్ కాదనే భయం ఉంటుంది. మళ్లీ పదే పదే ఆపరేషన్ చేయించుకోవాల్సి ఉంటుందని ఆపరేషన్ కు వెనుకాడుతారు. మరి ఇది నిజమేనా? సైనస్ సమస్య దీర్ఘకాలిక సమస్య కాబట్టి దానికి యాంటి బయాటిక్స్ మందులు ఎక్కువ రోజులు వాడాల్సి ఉంటుంది. కనీసం పది రోజుల పాటైనా యాంటి బయాటిక్స్ వేసుకోవాల్సి వస్తుంది. కాని యాంటి బయాటిక్స్ ఎక్కువ వాడకూడదని వేసుకోవడానికి సంశయిస్తుంటారు. కొందరు మధ్యలో ఆపేస్తుంటారు కూడా. ఇది ఎంతమాత్రం మంచిది కాదు. 

సైనసైటిస్ సమస్యకు ఇంతకు ముందు కన్నా ఇప్పుడు చాలా మంచి మందులు ఉన్నాయి. ఆపరేషన్ పద్ధతుల్లో కూడా మార్పులు వచ్చాయి. అయితే ఎంత ముందుగా చికిత్స మొదలుపెడ్తే అంత మంచి ఫలితాలు ఉంటాయి. కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా, ఎటువంటి అనుమానాలు పెట్టుకోకుండా సకాలంలో సైనస్ కి చికిత్స చేయించుకోవాలి. 

చంటి పిల్లలు ఎందుకు ఏడుస్తారు?
చంటి పిల్లలున్న ఏ ఇంట చూసినా ఆ తల్లిదండ్రులకు రాత్రి శివరాత్రే. బుజ్జి పాపాయి ఏడుస్తూ ఉంటుంది. ఎందుకేడుస్తుందో, ఏం జరిగిందో తెలియని ఆందోళన ఒక వైపు, చుట్టు పక్కల వాళ్లు ఏమంటారో అనే ఆలోచన మరోవైపు.. ఏం చేయాలో తెలియక తల్లిదండ్రులు ఆందోళన చెందుతుంటారు. ఆ టెన్షన్ తో ఇక ఆ రాత్రి జాగరణ చేయడం తప్ప గత్యంతరం ఉండదు. కొన్నిసార్లు పగటి పూట కూడా ఏడుస్తారు. మాటలు రాని పాపాయి తనకేమవుతుందో చెప్పలేదు. ఇలాంటప్పుడు తల్లిదండ్రులు అనేక రకాలుగా పరిశీలించాలి. 

పాపాయి మనకు ఏ విషయం చెప్పాలన్నా ఏడుపు ద్వారానే చెప్తుంది. సాధారణంగా ఆకలేసినప్పుడు పిల్లలు ఏడుస్తారు. పాలివ్వడం ఆలస్యం అయితే ఇక పాలు ఇచ్చినా కాసేపు ఏడుస్తూనే ఉంటారు. డయాపర్ తడి అయినా ఏడుస్తారు. రాత్రిపూట ఎక్కువగా ఏడవడానికి కారణం వాతావరణంలో ఉష్ణోగ్రతల్లో మార్పులే. పగటిపూట ఎక్కువగా ఉన్న ఉష్ణోగ్రత మారి, చల్లగా అయ్యేసరికి కొన్నిసార్లు మారిన ఆ వాతావరణాన్ని తట్టుకోలేక ఏడుస్తుంటారు. జలుబో, జ్వరమో ఉంటే మనకు తెలుస్తుంది. కాని ఒళ్లునొప్పలుంటే కూడా ఏడుస్తారు. 

పొట్టలో గ్యాస్ చేరడం వల్ల ఆ ఇబ్బందితో ఏడుస్తారు పిల్లలు. పాలు తాగిన తరువాత రిఫ్లక్స్ అయ్యే అవకాశం చంటిపిల్లల్లో ఎక్కువ. అన్నవాహిక, జీర్ణాశయం మధ్యలో ఉండే స్పింక్టర్ చిన్న పిల్లల్లో వదులుగా ఉండడం వల్ల రిఫ్లక్స్ అవకాశం ఉంటుంది. పాలు తాగిన తరువాత జీర్ణాశయం లోని ఆమ్లంతో కలిసి అవి తిరిగి అన్నవాహిక వైపు రావడాన్నే రిఫ్లక్స్ అంటారు. చంటి పిల్లలు నోరు తెరిచి తమ సమస్య చెప్పలేరు కాబట్టి అమ్మే అన్నీ గ్రహించాలి. వారి ఏడుపు వెనుక ఏ కారణం ఉందో అన్ని రకాలుగా అబ్జర్వ్ చేసి కనుక్కోవాలి. పాలు తాగిన తరువాత భుజం మీద వేసుకుని తేన్పు వచ్చేవరకు వెన్ను తట్టాలి. ఏ ప్రయత్నం చేసినా అలా ఏడుస్తూనే ఉన్నారంటే ఒకసారి డాక్టర్ ని కలవండి. 

ప్రసవం కాగానే మంచినీళ్లు తాగకూడదా?
అదో గవర్నమెంటు హాస్పిటల్. ప్రసూతి వార్డులోకి తీసుకు వచ్చారామెను. గంట క్రితం పండంటి బిడ్డను ప్రసవించిందామె. ‘అమ్మా.. దాహంగా ఉంది.. మంచినీళ్లివ్వవా..’ అని అడుగుతోంది. కాని కుటుంబ సభ్యులెవరూ ఆమెకు నీళ్లివ్వడానికి సిద్ధపడలేదు. ‘ఇప్పుడు నీళ్లు తాగకూడదు. ఒంట్లో నెమ్ము చేరుతుంది. వాతం చేస్తుంది’ అంటూ హెచ్చరిస్తున్నారు. ఆమె దాహంతో నీరసపడిపోయింది. ఇలాంటి మూఢ నమ్మకాలు ఇప్పటికీ కనిపిస్తుంటాయి. డెలివరీ అయిన తరువాత మంచినీళ్లు తాగించకూడదనే బలమైన నమ్మకంతో ఉంటారు. నిజంగానే బాలింతకు మంచినీళ్లు ఇవ్వకూడదా?

బాలింతగా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నిజమే.. కాని దాహమేస్తే మంచినీళ్లు ఇవ్వడానికి కూడా భయపడడం కరెక్ట్ కాదు. బాలింతకు నీళ్లు తాగిస్తే ఊపిరితిత్తుల్లో నెమ్ము చేరుతుందని అపోహ పడుతుంటారు. రోజుకు పావు లీటరు నీళ్లకు మించి తాగనివ్వరు. నెమ్ము చేరడం, వాతం చేయడంలో నిజం లేదు గానీ నీళ్లు తాగకపోవడం వల్ల ఇతర సమస్యలు మాత్రం వస్తాయి. ఇలా నీళ్లు తాగకపోవడం వల్ల మూత్రంలో ఇన్ ఫెక్షన్లు వస్తాయి. శరీరానికి తగినన్ని నీళ్లు అందక డీహైడ్రేషన్ అవుతుంది. కొన్నిసార్లు ఇది ప్రాణాంతకం కూడా కావొచ్చు. నెమ్ము చేరడం, వాతం చేయడంలో నిజం లేదు గానీ నీళ్లు తాగకపోవడం వల్ల ఇతర సమస్యలు మాత్రం వస్తాయి. మూత్రంలో ఇన్ ఫెక్షన్లు, డీహైడ్రేషన్ సమస్యలు వస్తాయి. 

పశ్చిమ దేశాల్లో సాధారణ ప్రసవం అయిన తరువాత వెంటనే మంచి భోజనం పెడ్తారు. కానీ మన దేశంలో చాలా చోట్ల నార్మల్ డెలివరీ అయిన తరువాత మూడు రోజులకు గానీ సరైన తిండి పెట్టరు. భోజనం చేయొచ్చని చెప్పినా ఎవరూ వినిపించుకోరు. నిజానికి మామూలు వాళ్ల కన్నా బాలింతరాళ్లకు మరింత బలమైన ఆహారం, తగినన్ని పోషకాలతో కూడిన సమతులాహారం ఇవ్వాలి. కాన్పు అయిన తరువాత శరీరంలో రక్తం, నీరు కోల్పోతారు. కాబట్టి మంచి నీళ్లు ఎక్కువగా అవసరం అవుతాయి. బిడ్డకు పాలివ్వాలంటే సరైన ఆహారం, నీళ్లూ అవసరం. పాలిచ్చే ముందు ప్రతిసారీ రెండు గ్లాసుల మంచినీళ్లు తాగాలి. 

బాలింతలకు పథ్యాలు కూడా చాలా పెడతారు. మన దక్షిణాదిలో కారప్పొడి, వెల్లుల్లి, వేపుడు కూరలూ ఎక్కువగా తినిపిస్తుంటారు. మజ్జిగ, పెరుగు తింటే జలుబు చేస్తుందని అవి ఇవ్వడం మానేస్తుంటారు. ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల బాలింతకు విపరీతమైన దాహం వేస్తుంది. కానీ ఎంత అడిగినా మంచి నీళ్లు ఇవ్వరు. దాంతో డీహైడ్రేషన్ కి గురవుతారు. మూత్రం సరిగా రాదు. యూరినరీ ఇన్ ఫెక్షన్లు, జననాంగాల్లో కూడా ఇన్ ఫెక్షన్లు వచ్చి అవస్థలు పడుతుంటారు. ఒక్కోసారి డీహైడ్రేషన్ వల్ల మెదడులో రక్తం గూడు కట్టుకుపోయి, ఫిట్స్ కూడా రావొచ్చు. అందుకే సాధారణ ప్రసవం అయిన వాళ్లకు గంట తరువాత మంచి నీళ్లు, ఇతర ద్రవ పదార్థాలను ఇవ్వాలి. సిజేరియన్ అయితే ఆరు గంటల తరువాత ఇవ్వాలి. 

సోషల్ మీడియాతో డిప్రెషన్
ఓ పది పదిహేనేళ్ల క్రితం వరకు కూడా పిల్లలకు చదువుతో పాటు ఆటలు కూడా ముఖ్యంగా ఉండేవి. స్కూల్ నుంచి రాగానే ఓ గంట సేపు ఆడుకుని, చదువుకుని, తినేసి రాత్రి ఎనిమిదింటికల్లా పడుకునేవారు. పెద్దవాళ్లకు ఉద్యోగాలూ, వాటి హోమ్ వర్క్ లూ.. దాంతో లేట్ నైట్ నిద్రలు ఎటూ తప్పవు. కాని పిల్లలకు ఏమయిందండీ.. టీనేజి పిల్లలు దాదాపు అందరూ కూడా రాత్రి ఎక్కువ సమయం మేలుకునే ఉంటున్నారు. వాళ్లను పడుకోమని చెప్పే తీరిక తల్లిదండ్రులకు ఉండడం లేదు. ఇది తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. 

ఇప్పుడు మనకు మాటలు తక్కువయ్యాయ్. వాట్సప్ చాట్ లు ఎక్కువయ్యాయ్. మనతో పాటు మన పిల్లలు కూడా ఇదే పద్ధతి. చిన్న పిల్లలైతే వీడియో గేమ్ లు ఆడుతూ ఎంతకీ నిద్రపోరు. ఇక టీనేజి పిల్లలైతే సరేసరి. స్నేహితులతో వాట్సప్ చాట్ లు చేస్తూ బిజీగా గడుపుతుంటారు. అర్ధరాత్రి వరకూ మెలకువతోనే ఉంటున్నారు. వాట్సప్పులూ, ఫేస్బుక్కులూ, ఇన్ స్టాగ్రాములంటూ సోషల్ మీడియాలో ఉంటూ నిద్రను మరిచిపోతున్నారు. 

పిల్లలకి రాత్రిపూట పది గంటల పాటు నిద్ర అవసరం. కానీ నేటి పిల్లలు 7 గంటలు లేదా అంతకన్నా తక్కువ సమయమే నిద్ర పోతున్నారు. దాంతో రకరకాల శారీరక సమస్యలతో పాటు మానసిక రుగ్మతల బారిన కూడా పడుతున్నారని రీసెంట్ స్టడీలో తేలింది. తగినంత నిద్ర లేకపోవడం ఒక్కటే కాదు, నిరంతరం  సోషల్ మీడియాలో ఉండడం వల్ల కావలసినన్ని లైకులు రాలేదనో, సరైన కామెంట్స్ రాలేదనో దిగులు పడుతున్నారు. ముఖ్యంగా టీనేజీలోని అమ్మాయిల్లో ఈ దిగులు, డిప్రెషన్ ఎక్కువగా ఉంటున్నాయి. తమ శరీరాకృతి గురించిన దిగులు కూడా వాళ్లలో ఉంటోంది. ఇందుకు కారణం సోషల్ మీడియాలో లీనమై ఉండడమేనంటున్నారు అధ్యయన కారులు.

టీనేజిలో ఉన్న అమ్మాయిల్లో మానసిక సమస్యలకు ఒకవైపు నిద్రలేమి, మరోవైపు సోషల్ మీడియా రెండింటి వల్ల డిప్రెషన్ లాంటి సమస్యల బారిన పడుతున్నారు. 14 ఏళ్ల వయసున్న 11 వేల మంది పిల్లలపై యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్, ఎసెక్స్ యూనివర్సిటీలు సంయుక్తంగా స్టడీ చేశారు. అందుకే పిల్లల మనసును ఆరోగ్యకరమైన ఆటల వైపు, చదువు వైపు మళ్లించాలని, వాళ్లతో ఎక్కువ సమయం స్పెండ్ చేయాలని సూచిస్తున్నారు రీసెర్చ్ ని లీడ్ చేసిన లండన్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ యువొన్నె కెల్లీ. 

అసిడిటీ పోగొట్టే అరటి
తిన్నది సరిగా జీర్ణం కాకపోతే ఆ బాధ పైకి చిన్నదిలా కన్పిస్తుంది గానీ భరించడం కష్టం. గ్యాస్ ఫామ్ అయి కడుపుబ్బరంగా ఉంటుంది. అది కాస్తా అసిడిటీ అవుతుంది. ఈ సమస్యలనే అశ్రద్ధ చేస్తే క్యాన్సర్ లాంటి పెద్ద సమస్యలకు దారి తీయొచ్చు. ఇంత పెద్ద ఇష్యూ కాకుండా ఉండాలంటే జీర్ణ సమస్య దగ్గరే ఆపేయాలి. అందుకు తగిన ఔషధం అరటి పండు. రోజుకో అరటి పండు తీసుకుంటే జీర్ణ సమస్యలతో పాటు మలబద్దకం, గుండె సమస్యలు, క్యాన్సర్ లాంటివి కూడా రాకుండా నివారించొచ్చంటున్నారు నిపుణులు. 

కొన్ని పండ్లు కొన్ని సీజన్ లలో మాత్రమే దొరుకుతాయి. కొన్ని పండ్లు సంవత్సరానికి ఒక్కసారే దొరుకుతాయి. చాలా తక్కువ పండ్లు మాత్రమే ప్రతిరోజూ దొరుకుతాయి. అలా ప్రతి రోజు దొరికే పండ్లలో మనకు ఎక్కువగా అందుబాటులో ఉండేది అరటి పండు. అరటి పండు వలన చాలా ఉపయోగాలున్నాయి. దీన్ని పండుగా, జ్యూస్ గా మాత్రమే కాకుండా సలాడ్ గా కూడా తినవచ్చు. 

అరటి పండులో విటమిన్స్, మినరల్స్, ఫైబర్, పొటాషియం ఎక్కువగా ఉండడం వల్ల మనకు రోజంతా ఎనర్జీని ఇస్తుంది. మలబద్దకం ఎక్కువగా ఉన్నవారికి ఒక నెల రోజులు కచ్చితంగా తినిపిస్తే వారికి ఈ సమస్య ఉండదు. అరటిలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మలబద్దకాన్ని నివారిస్తుంది. హార్ట్ సమస్యలను అరటి తొందరగా అరికడుతుంది. అరటిలో పొటాషియం ఎక్కువగా ఉండి, సోడియం తక్కువగా ఉండడం వల్ల బ్లడ్ ప్రెషర్ ని తగ్గిస్తుంది. ప్రతిరోజు అరటి పండు తినడం వల్ల ఇందులో ఉండే ఐరన్, హిమోగ్లోబిన్ ని ఎక్కువ చేసి అనీమియాను రాకుండా చేస్తుంది. ఇందులో ఎక్కువగా విటమిన్స్ ఉండడం వల్ల అరటి కంటి చూపును కూడా సంరక్షిస్తుంది.  

అరటి పండు తినడం వల్ల జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయి. ముఖ్యంగా ఎసిడిటీని తగ్గించడంలో దీనిది చాలా ఇంపార్టెంట్ రోల్. మచ్చలున్న అరటి పండులో క్యాన్సర్ తో పోరాడే కణాలు అధికంగా ఉంటాయి. అరటి పండు తినడం వల్ల ఇలాంటి ఇంకా ఎన్నో ప్రయోజనాలున్నాయి. మనకి అరటి పండ్లు చాలా సులభంగా దొరుకుతాయి కాబట్టి ప్రతి రోజూ ఒక్క అరటి పండు అయినా తింటే చాలా ఆరోగ్య సమస్యల నుంచి మనం తప్పించుకోవచ్చు. మరిక ఆలస్యం చేయకండి.. ఇంటికి వెళ్తూ వెళ్తూ డజన్ అరటి పండ్లు కొనుక్కెళ్లండి. 

మన శరీరానికి ఇలా ప్రత్యేకమైన ఆకృతి రావడానికి గల కారణం ఏంటో మీకు తెలుసా? అవేనండీ.. బోన్స్. మన ఈ ఎముకల వ్యవస్థ మొత్తం ప్రతి 7 సంవత్సరాలకు ఒకసారి కొత్తగా ఏర్పడుతుంది. మెదడు, గుండె, ఊపిరితిత్తులకు రక్షణగా ఉండడమే కాకుండా రక్తకణాల తయారీలో కూడా ఎముకల వ్యవస్థ కీలకమైంది.