మావోలతో పరిచయాలు : ఓయూ ప్రొఫెసర్ కాశీం నివాసంలో పోలీసుల తనిఖీలు

  • Published By: veegamteam ,Published On : January 18, 2020 / 05:25 AM IST
మావోలతో పరిచయాలు : ఓయూ ప్రొఫెసర్ కాశీం నివాసంలో పోలీసుల తనిఖీలు

పోరాటాల పురిటిగడ్డ ఉస్మానియా యూనివర్శిటీలో మరోసారి మావోయిస్టుల కలకలం రేగింది. దీంతో పోలీసులు ఓయూ క్యాంపస్ లో సోదాలు నిర్వహించారు.  ఓయూ క్యాంపస్ లోని క్వార్టర్స్ లో నివాసిస్తున్న ప్రొఫెసర్ కాశీం నివాసంలో గజ్వేల్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. 2016లో కాశీంపై నమోదైన ఓ కేసు విచారణలో భాగంగా..కాశీంకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నట్లుగా ఆరోపణలు వస్తున్న క్రమంలో పోలీసులు కాశీం ఇంట్లో సోదాలు చేశారు. 

కాగా..కాశీం ఇటీవలే విరసం రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. దీంతో మరింత అనుమానాలు పెరగటంతో పోలీసులు సోదాలు చేసినట్లుగా తెలుస్తోంది. గజ్వేల్ ఏసీపీ నారాయణ నేతృత్వంలోని పోలీసులు బృందం శనివారం (జనవరి 18,2020) ఉదయం నుంచి సోదాలు కొనసాగిస్తున్నారు. 

2016లో సిద్ధిపేట సమీపంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలోని ఓ కారులో కాశీంకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నట్లుగా కొన్ని కీలక డాక్యుమెంట్లు, కరపత్రాలు పోలీసుల కళ్లబడ్డాయి. వీటి ఆధారంగా పోలీసులు విచారణ కొనసాగించారు. దీంట్లో భాగంగా కాశీంకు ఈ  మావోయిస్టులతో సంబంధాలు ఉన్నట్లుగా తెలిసింది. కారులో లభ్యమైన కీలక డాక్యుమెంట్లు, కరపత్రాలను కాశీం పంపిణీచేసినట్లుగా పోలీసులు గుర్తించారు.  ఈ క్రమంలో ప్రొఫెసర్ కాశీం ఇటీవల విరసం కార్యదర్శిగా ఎన్నికైన క్రమంలో మరోసారి పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు.