అదో నరకం బాసూ: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు తగ్గుతున్నాయి

అదో నరకం బాసూ: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు తగ్గుతున్నాయి

హైదరాబాద్ సిటీలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు తగ్గాయి. అవగాహన కార్యక్రమాలో.. జైలుకి వెళ్లాల్సి వస్తుందనే భయమో.. పరువు పోతుందనే బెంగో.. ఉద్యోగం చేసే కంపెనీలకు ఉత్తరాలు రాస్తారనే ఆందోళనలో ఏమో.. మందుకొట్టిన తర్వాత రోడ్డెక్కటం మానేశారు. రోజురోజుకీ గల్లీ స్థాయి నుంచి నిర్వహిస్తున్న డ్రంక్ అండ్ డ్రైవ్‌లు సత్ఫలితాలను ఇస్తున్నాయి. బార్లు, పబ్స్‌కు వెళ్లే వారు కూడా డోస్ తగ్గిస్తున్నారు. ఆ తర్వాత కూడా స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. దీంతో హైదరాబాద్ సిటీలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు భారీ తగ్గినట్లు పోలీస్ రిపోర్టులు చెబుతున్నాయి.

 

మన డబ్బులతో మందుకొట్టి.. వాళ్లతో ఛీ అనిపించుకోవటం, పరువు పోగొట్టుకోవటం ఎందుకు అనుకుంటున్నారు మందుబాబులు. రానురాను ఆలోచనలో మార్పు వచ్చింది. ఒక్కసారి దొరికినవాళ్లు మరోసారి డ్రంక్ అండ్ డ్రైవ్ కు భయపడుతున్నారు. దీంతో మందు మానేస్తున్నారు. ఒక వేళ మందుకొట్టినా క్యాబ్ బుక్ చేసుకోవడమో.. ఆటోల్లోనో ఇంటికి చేరుకుంటున్నారు. ఇలా హైదరాబాద్ సిటీలో కేసులు క్రమంగా తగ్గిపోతున్నాయి. విశేషం ఏంటంటే.. డ్రంక్ అండ్ డ్రైవ్ లో రెండోసారి దొరుకుతున్న వారు భారీ తగ్గిపోయారు. 

అది ఎంత అంటే 98శాతం. అవును.. డి.డి.లో రిపీట్ అఫెండర్స్ పర్సంటేజ్ కేవలం 2శాతానికి తగ్గిపోయింది. ఇది శుభపరిణామం అంటున్నారు పోలీసులు. మొదటి అనుభవం ఎంత నరకంగా ఉంటుందో తెలిశాక.. రెండోసారి అదే పని చేసే ఆలోచన ఎక్కవ వస్తుంది అంటున్నారు ఖాకీలు. డాక్టర్ కంటే సీనియర్ పేషంట్ వైద్యం బెటరనే సామెతలాగే.. ఒక్కసారి డీడీలో దొరికితే నరకం అంటున్నారు మొదటిసారి పట్టుబడిన వారు. క్లాసులకు వెళ్లాలి.. ఆ తర్వాత కోర్టుకి.. ఇలా రెండు రోజులు. ఆ తర్వాత జైలుకి. శిక్ష పడితే అది ఎన్ని రోజులో తెలియదు. 

 

అంతా అయిపోయాక, మళ్లీ మన బండి కోసం స్టేషన్ చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ఇలా వారం, 10 రోజులు పాటు ఘోరంగా నరకం అనుభవించాలి. దీంతో రెండోసారి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయటానికి భయపడిపోతున్నారు మందుబాబులు. ఆ నరకం కంటే మందు మానేయటమే బెటర్ అంటున్నారు. ప్రభుత్వమే బహిరంగంగా అమ్ముతున్నా.. ఆ బార్ల పక్కనే డీడీలు.. ఎందుకొచ్చిన గోలరా బాబూ.. అని మందు మానేస్తున్న వారి సంఖ్య హైదరాబాద్ సిటీలో పెరుగుతుందని.. డీడీలో నమోదు అవుతున్న కేసుల సంఖ్యే చెబుతోంది.