పేపర్ లెస్ : పాస్ పోర్టు దరఖాస్తుకు ఈ – టోకెన్

  • Published By: madhu ,Published On : August 26, 2019 / 03:20 AM IST
పేపర్ లెస్ : పాస్ పోర్టు దరఖాస్తుకు ఈ – టోకెన్

అమీర్ పేట పాస్ పోర్టు సేవా కేంద్రంలో ప్రయోగాత్మకంగా ఈ టోకెన్ సక్సెస్ కావడంతో 4 పాస్ పోర్టు కేంద్రాలు, 23 పోస్టాఫీస్ పాస్ పోర్టు కేంద్రాల్లో సేవలను అందుబాటులోకి తెచ్చారు. కాగిత రహిత దిశగా పాస్ పోర్టు కేంద్రాలు ఉంచేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ – టోకెన్ విధానం సత్ఫలితాన్నిస్తోంది. ఆన్ లైన్‌లో పాస్ పోర్టు పొందేందుకు దరఖాస్తు చేసుకున్న వారికి ఈ టోకెన్ నంబర్ SMS రూపంలో మొబైల్‌కు అందుతుంది. దీంతో పాస్ పోర్టు సేవా కేంద్రానికి అన్ని డాక్యుమెంట్ల జిరాక్స్ పత్రాలను తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. 

సిబ్బందికి సెల్ ఫోన్‌కు అందిన దరఖాస్తు రిఫరెన్స్ నెంబర్ చూపితే చాలు. నిమిషాల్లో పని పూర్తవుతుంది. ఢిల్లీ తర్వాత ఈ విధానాన్ని మన నగరంలో అమలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఏఆర్ఎన్ ద్వారా తమ పాస్ పోర్టు అప్లికేషన్ ఏ స్థాయిలో ఉందో ఈ ట్రాకింగ్‌తో తెలుసుకొనే సౌకర్యం విదేశాంగ శాఖ కల్పించడం విశేషం. పాస్ పోర్టు గడువు తీరిన వినియోగదారుల మొబైల్ నంబర్లకు SMS అందించే సేవలను ప్రాంతీయ పాస్ పోర్టు కార్యాలయం ప్రారంభించింది.

ఆరు నెలల ముందుగానే ఈ సమాచారాన్ని తెలియచేయడం ద్వారా వారు రెన్యువల్‌కు దరఖాస్తు చేసుకొనే అవకాశం ఉంటుందని పాస్ పోర్టు అధికారులు వెల్లడించారు. పాస్ పోర్టు డేటాను డిజిటల్ మాధ్యమంలో భద్రపరిచామని తెలిపారు. ఎస్ఎంఎస్ అలర్ట్ సైతం కంప్యూటర్ ద్వారా ఆటోమెటిక్‌గా వినియోగదారులకు చేరేలా ఏర్పాట్లు చేయడం విశేషం.  పాస్ పోర్టుకు దరఖాస్తు చేసుకొనే వినియోగదారులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్ సైట్ http://www.passportindia.gov.in నుంచే చేసుకోవాలని అధికారులు వెల్లడించారు. ఈ విషయంలో ఇతర లింక్‌లను ఆశ్రయించి మోసపోవద్దంటున్నారు.

Read More :  పైపులైన్ లీకేజీ : 28, 29 తేదీల్లో కృష్ణా నీళ్లు బంద్
విదేశాలకు వెళుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. విద్య, వ్యాపారం, మెడికల్ టూరిజం, ఉద్యోగం ఇతరత్రా కారణాలతో విమానాలు ఎక్కేస్తున్నారు. ఇందుకు పాస్ పోర్టు అవసరం కావడంతో దీనికి దరఖాస్తులు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. నిత్యం పాస్ పోర్టు కార్యాలయాలకు సుమారు 3 వేల దరఖాస్తులు అందుతున్నట్లు అంచనా. ప్రస్తుతం పోలీస్ క్లియరెన్స్ అందిన 3 నుంచి 4 రోజుల్లో పాస్ పోర్టును జారీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.