హవాలాకి కేంద్రంగా హైదరాబాద్: రూ.5 కోట్లు పట్టివేత

  • Published By: vamsi ,Published On : August 28, 2019 / 02:34 AM IST
హవాలాకి కేంద్రంగా హైదరాబాద్: రూ.5 కోట్లు పట్టివేత

హైదరాబాద్ నగరంలో భారీ హవాలా రాకెట్ గుట్టు రట్టయ్యింది. రూ.5 కోట్లు హవాలా డబ్బును రవాణా చేస్తూ చిక్కిన ముఠాను పోలీసులు పట్టుకున్నారు. బేగం బజార్, జనరల్ బజార్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో హవాలా డబ్బును మార్చుతున్నట్లుగా పోలీసులకు సమాచారం అందడంతో నిఘా పెట్టిన పోలీసులకు ఏడుగురు హవాలా వ్యక్తులు పట్టుబడ్డారు. గుజరాత్ కు చెందిన విపుల్ కుమార్ పటేల్, శైలేష్, విపుల్, అర్జున్, రాజేష్, ఉపేందర్, చేతన్ అనే ఏడుగురిని పట్టుకున్న పోలీసులు హవాలా గుట్టు రట్టు చేశారు.

సాధారణంగా హవాలా వ్యాపారం అంటే బేగంబజార్ లో ఎక్కువగా జరుగుతుంది. ఈ క్రమంలోనే పోలీసుల చూపు ఎక్కువగా అక్కడ ఉంటుంది. అయితే ఈసారి మాత్రం ఎవరూ ఊహించని విధంగా జూబ్లిహిల్స్ చెక్ పోస్టు వద్ద నిఘా పెట్టిన అధికారులకు హోండా యాక్టివాపై వెళుతున్న ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. వారిని విచారించగా అసలు విషయం బయటపడింది. అయితే పట్టుబడ్డ వారంతా ట్రాన్స్ పోర్టర్లు అయితే సూత్రధారులు ఎవరనేదానిపై విచారణ చేపట్టారు. ముంబయి, గుజరాత్ తరువాత హవాలాకు హైదరాబాద్ నిలుస్తోందని పోలీసులు అంచనా వేస్తున్నారు.

వీరంతా హైదర్ గూడలో ఉంటూ ఈ హవాలా వ్యాపారానికి ట్రాన్స్ పోర్టర్లుగా నిర్ణయిస్తారని, చేరవేయాల్సిన డబ్బును బట్టి కమీషన్ ను నిర్ణయించి తీసుకునే బిజినెస్ వీళ్లు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ బిజినెస్ డాన్ ఓ ప్రముఖ వ్యాపారి అనే అనుమానం ఉంది. పట్టుబడ్డ డబ్బును ఇన్ కంట్యాక్స్ అధికారులకు అప్పగించనున్నట్లు పోలీసులు చెప్పారు.  ఈ సంధర్భంగా మాట్లాడిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్.. ఇల్లీగల్ బిజినెస్ లపై టాస్క్ ఫోర్స్  పోలీసులతో ప్రత్యేక నిఘా పెట్టినట్లు చెప్పారు.