అనారోగ్య సమస్యలు భరించలేక..భార్యతో కలిసి జర్నలిస్టు ఆత్మహత్య

  • Published By: murthy ,Published On : October 17, 2020 / 09:45 AM IST
అనారోగ్య సమస్యలు భరించలేక..భార్యతో కలిసి జర్నలిస్టు ఆత్మహత్య

husband and wife suicide : భార్య ఫ్రభుత్వ పాఠశాలలో ఉద్యోగిని…..తాను ఒక ప్రైవేట్ న్యూస్ ఛానల్ లో రిపోర్టర్ గా పని చేస్తున్నాడు. 12 ఏళ్లపాటు సాగిన వారి ప్రేమ ఫలించి సంతోషంతో పెళ్లి చేసుకున్నారు. పెళ్లై ఏడాది తిరక్కముందే తలెత్తిన అనారోగ్య సమస్యలు… వాటిని ఎలా భరించాలో అనే భయంతో భార్యా భర్తలిద్దరూ చెరువులో దూకి ఆత్నహత్య చేసుకున్నారు.

బెల్లంపల్లిలోని సుభాష్ నగర్ కుచెందిన మోసం మల్లేష్ కుమార్(36) బాబు క్యాంపు బస్తీకి చెందిన నర్మద (28) శుక్రవారం మధ్యాహ్నం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్రంగా కలిచివేసింది. నర్మద మందమర్రి గురుకులంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పని చేస్తోంది. మల్లేష్‌ ఓ ప్రముఖ టీవీ న్యూస్ ఛానల్‌లో రిపోర్టర్గా పని చేస్తున్నాడు‌.



పెళ్లయిన కొద్ది నెలలకే దంపతులిద్దరికీ అనారోగ్య సమస్యలు ఏర్పడ్డాయి. వాటిని ఎలా భరించాలో తెలియక……చనిపోదామనే నిర్ణయించు కున్నారు. గురువారం అర్ధరాత్రి దాటాక (12.40 గంటల ప్రాంతంలో) మల్లేశ్‌ తన స్నేహితులు  కొందరికి వాట్సాప్‌ మెసేజ్‌ చేశాడు. అనంతరం భార్యా భర్తలిద్దరూ పోచమ్మ చెరువు కట్ట వద్దకు బైక్‌పై వచ్చి అందులో దూకారు.



కొద్దిసేపటికి మిత్రులు మెసేజ్‌ చూసి వారికోసం వెదకడం ప్రారంభించారు. చెరువు కట్ట వద్ద బైక్‌ కనిపించడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారణకు వచ్చారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో శుక్రవారం ఉదయం ఏసీపీ ఎంఏ రహమాన్, వన్‌టౌన్‌ ఎస్‌హెచ్‌ఓ రాజు, తహసీల్దార్‌ కుమారస్వామి గజ ఈతగాళ్లను రప్పించారు.

మల్లేశ్‌ మృతదేహం 11 గంటలకు బయటపడగా.. నర్మద మృతదేహం కోసం గజ ఈతగాళ్లు శ్రమించాల్సి వచ్చింది. చివరకు సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో ఆమె మృతదేహాన్ని బయటకు తీయించారు. వారి మృతదేహాలను చూసి ఇరు కుటుంబాలు బోరున విలపించాయి. మిత్రులు, సన్నిహితులు కన్నీరుపెట్టుకున్నారు. కాగా …. రుణాలు ఉంచుకోకూడదనుకున్నాడో ఏమో మల్లేశం చాలా నిజాయితీగా వ్యవహరించాడు. తనకు ఎవరెవరి వద్ద నుంచి డబ్బులు రావాలి… తాను ఎవరెవరికి ఎంత చెల్లించాలనే లెక్కలు చెపుతూ మరోక వాట్సప్ మెసేజ్ కూడా చేసి దానిద్వారా ఆప్పులు తీర్చి తన కుటుంబ సభ్యులకు అండగా ఉండమని స్నేహితులను కోరాడు.