హైదరాబాద్ మరో ఘనత.. భారత్‌లో బెస్ట్‌ సిటీ భాగ్యనగరం.. నివాసానికి, ఉపాధికి ఉత్తమం

  • Published By: naveen ,Published On : September 16, 2020 / 02:59 PM IST
హైదరాబాద్ మరో ఘనత.. భారత్‌లో బెస్ట్‌ సిటీ భాగ్యనగరం.. నివాసానికి, ఉపాధికి ఉత్తమం

హైదరాబాద్‌ మరో ఖ్యాతిని సొంతం చేసుకుంది. దేశంలోని ఉత్తమ నగరాల్లో భాగ్యనగరం బెస్ట్‌ సిటీగా ఎంపికైంది. దేశంలోని ప్రఖ్యాతి గాంచిన 34 నగరాల్లో హైదరాబాద్‌ అగ్రస్థానంలో నిలిచింది. డెస్టినేషన్‌ డిస్కవరీ వెబ్‌సైట్‌ అయిన హాలిడిఫై డాట్‌కామ్‌ చేసిన సర్వేలో భాగ్యనగరం బాద్‌షాగా నిలిచింది. దీంతో హైదరాబాద్‌ ఘనతకు మరో రికార్డు గులామ్‌ అయ్యింది.

హైదరాబాద్‌ విభిన్న మతాలు, జాతుల కలయికతో వర్థిల్లుతోంది. ఇక్కడ అన్ని ప్రాంతాల ప్రజలు, దేశంలోని విభిన్న సంస్కృతులు కనిపిస్తాయి. అందుకే హైదరాబాద్‌ను మినీ ఇండియాగా కూడా పిలుస్తారు. అలాంటి హైదరాబాద్‌ ఇప్పటికే ఎన్నో రికార్డులు సొంతం చేసుకుంది. ఇప్పుడు మరోసారి దేశంలోని నగరాల్లో బెస్ట్‌ సిటీగా నిలిచింది.

నివాసానికి, ఉపాధికి ఉత్తమ రాజధాని:
నివాస యోగ్యం, ఉపాధి కార్యక్రమాల నిర్వహణతోపాటు పర్యాటక ప్రాంతాలు, భాషలు, సంస్కృతులు, రవాణా, వసతి సదుపాయాలు, వేగవంతమైన, సుందరమైన అభివృద్ధి కార్యక్రమాలపై హాలిడిఫై డాట్‌కామ్ అనే వెబ్‌సైట్ సర్వే చేసింది. దేశంలోని 34 నగరాల్లో ఈ సర్వే కొనసాగింది. ఈ సర్వే మొత్తం 5 పాయింట్లకు చేయగా… హైదరాబాద్‌ 4.0 స్కోరుతో అగ్రస్థానంలో నిలిచింది.

ముంబై, పుణె, బెంగళూరు, చెన్నైలాంటి నగరాలను వెనక్కి నెట్టి హైదరాబాద్‌ ఫస్ట్‌ ప్లేస్‌లో నిలిచింది. నివాసానికి, ఉపాధికి అత్యుత్తమ నగరంగా హైదరాబాద్‌ అగ్ర స్థానంలో నిలిచింది. అంతేకాదు భాగ్యనగరం సెప్టెంబర్‌ నుంచి మార్చి వరకు పర్యటించడానికి విశిష్టమైన కాలంగా సర్వేలో తేలింది.

దక్షిణ భారత న్యూయార్క్ నగరంగా కితాబు:
హైదరాబాద్‌ పర్యాటక కేంద్రాల్లో చారిత్రాత్మక చార్మినార్‌, గొల్కొండ కోట నిలిచాయి. దక్షిణ భారత న్యూయార్క్ నగరంగా హైదరాబాద్ మారుతోందని ఈ వెబ్‌సైట్ ప్రశంసించింది. ప్రజలు, సంస్కృతీ సంప్రదాయాలు, అతిథి మర్యాదలతో పాటుగా వ్యాపారాలు చేసుకునేందుకు, పరిశ్రమలు స్థాపించేందుకు హైదరాబాద్‌ అత్యంత అనువైన పట్టణమని సర్వేలో పాల్గొన్న ప్రజలు అభిప్రాయపడ్డారు.

ఇక వివిధ సంస్థలు పలు దశల్లో జరిపిన సర్వేల్లో 2020లో విశిష్ట నగరాల ఎంపికపై జరిగిన సర్వేలో.. హైదరాబాద్ నగరం అగ్రస్థానం పొందడంతో పాటు ఖండాంతరాల్లో రియల్ ఎస్టేట్ పెట్టుబడులను ఆకర్షించే నగరంగానూ గుర్తింపు పొందింది.

ఇతర మెట్రో నగరాలతో పోల్చితే.. ట్రాఫిక్‌ సమస్య తక్కువే:
భాగ్యనగరం ఐటీ హబ్‌గా అభివృద్ధి చెందడం, అత్యాధునిక విమానాశ్రయం, ప్రపంచ స్థాయి స్కూళ్లు కలిగి ఉండటం… హైదరాబాద్‌ను ఉత్తమ నగరంగా నిలవడానికి కారణమని హాలిడిఫై. కామ్‌ తెలిపింది. దేశంలోని మిగిలిన మెట్రో నగరాలతో పోల్చితే.. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ సమస్య తక్కువేనని తెలిపింది. చారిత్రక, వారసత్వ సంపదతో హైదరాబాద్‌ గొప్ప పర్యాటక కేంద్రంగా నిలిచిందని వెల్లడించింది. చార్మినార్‌, బిర్యానీ హైదరాబాద్‌ ప్రత్యేకతలని పేర్కొంది. హైదరాబాద్‌లో 80కిపైగా పర్యాటక కేంద్రాలు ఉన్నట్టు హాలిడిఫై వెల్లడించింది.

హైదరాబాద్‌కు ఇలాంటి ర్యాంకులు కొత్తేమీ కాదు:
వాస్తవానికి హైదరాబాద్‌కు ఇలాంటి ర్యాంకులు కొత్తేమీ కాదు. ప్రపంచ స్థాయి ర్యాంకింగ్‌లు అయినా… జాతీయ స్థాయి సర్వేల్లోనైనా హైదరాబాద్‌కు ఎల్లప్పుడూ స్థానం ఉంటూనే ఉంది. ఇది ఇప్పుడు మరోసారి నిరూపితమైంది. ఇటీవలే జోన్స్‌ ల్యాంగ్‌ లస్యాలే సిటీ మొమెంటం ఇండెక్స్‌ -2020లో ప్రపంచంలోనే అత్యంత డైనమిక్‌ సిటీగా ఎన్నికైంది. ఇప్పుడు హాలిడిఫై డాట్‌కామ్‌ నిర్వహించిన సర్వేలో అగ్రస్థానంలో నిలిచింది.

దేశంలోని 34 నగరాల్లో హైదరాబాద్ నంబర్ వన్‌గా నిలవడం పట్ల తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌కు.. ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. స్పందించిన కేటీఆర్ ఏపీ మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.