చెట్లు నరికినందుకు రూ. 53వేలు జరిమానా

  • Published By: vamsi ,Published On : February 29, 2020 / 02:05 AM IST
చెట్లు నరికినందుకు రూ. 53వేలు జరిమానా

అటవీశాఖ అనుమతి లేకుండా హైదరాబాద్ నగరంలోని కుకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ(KBHB)లో ది ఇందూ ఫార్చూన్ గార్డెనియా అనే గేటెడ్ కమ్యూనిటీ 20 అడుగుల ఎత్తున్న చెట్లను నరికివేసిన కారణంతో రూ. 53,900 జరిమానా విధించారు అధికారులు. హరితహారం కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో చెట్లు పెంచాలని అవగాహన కార్యక్రమాలు చేస్తుంటే చెట్లు నరకడంతో మేడ్చల్ అటవీశాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ క్రమంలోనే కూకట్‌పల్లిలోని ది ఇందూ ఫార్చూన్ గార్డెనియా అనే గేటెడ్ కమ్యూనిటీకి మేడ్చల్ అటవీశాఖ భారీ జరిమానా విధించింది. గేటెడ్ కమ్యూనిటీ సొసైటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ 25 నుంచి 30 అడుగుల పొడవున్న 40కి పైగా చెట్లను నరికేసింది. అంతేకాదు ఆ చెట్లను కేపీహెచ్‌బీ పార్కుకు తరలిస్తామని చెప్పి మాట తప్పడంతో అటవీశాఖ ఈ జరిమానా విధించింది. 22 ఫిబ్రవరిన గ్రీన్‌బెల్ట్ జోన్‌కు చెందిన ఈ చెట్లు ఫేజ్13లోని ఇందు గార్డెనియా అపార్ట్‌మెంట్స్ దగ్గర నరికివేశారు.

చెట్లను నరుకుతున్నారన్న సమాచారం అటవీశాఖ దృష్టికి రావడంతో సొసైటీ ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్‌కు జరిమానా విధిస్తూ నోటీసులు ఇచ్చారు. నరికివేయబడ్డ చెట్లన్నీ అంతరించి పోతున్న వృక్షాల జాబితాలో ఉండగా.. వాటిని కూల్చాలంటే అనుమతి తప్పనిసరి అని అటవీశాఖ అధికారి సుధాకర్ రెడ్డి చెప్పారు. ఇది అక్రమమైన పని కావడంతో సొసైటీపై భారీ జరిమానా విధించినట్లు వెల్లడించారు. వాల్టా (వాటర్ ల్యాండ్ అండ్ ట్రీస్ యాక్ట్ 2002) చట్టం కింద సొసైటీకి జరిమానా విధించినట్లు ఆయన చెప్పారు. 

ఈ తరహా చెట్లను అనుమతి లేకుండా కూల్చితే ఆ చెట్టు ఎంత విలువైతే చేస్తుందో అంతకు రెట్టింపు జరిమానా విధించాల్సిందిగా చట్టంలో ఉందని సుధాకర్ రెడ్డి చెప్పారు. ఇప్పుడు విధించిన జరిమానా ఇంకా ఐదు రెట్ల వరకు పొడిగించే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు అధికారులు.