మీ స్మార్ట్ ఫోనే మీ మెట్రో టికెట్

  • Published By: chvmurthy ,Published On : December 11, 2019 / 03:21 AM IST
మీ స్మార్ట్ ఫోనే మీ మెట్రో టికెట్

హైదరాబాద్ మహా నగరంలో మెట్రో సేవలు క్రమేపి పూర్తి స్ధాయిలో అందుబాటులోకి వస్తున్నాయి. ఇటీవలే  నాగోల్ మెట్రో సర్వీసును హైటెక్ సిటీ నుంచి రాయదుర్గం వరకు పొడిగించారు. మరోవైపు ఎల్బీనగర్-మియాపూర్ సర్వీసు నడుస్తోంది. జనవరి నెలాఖరుకల్లా జూబ్లీ బస్టాండ్ నుంచి ఎంజీబీఎస్ సర్వీసు కూడా ఫ్రారంభం చేయబోతున్నారు. ఈ క్రమంలో ప్రయాణికులకు మెరుగైన సేవల కోసం  సులువైన టికెటింగ్ విధానం తీసుకు వస్తోంది హైదరాబాద్ మెట్రో.  

ప్రస్తుతం మెట్రో రైలుప్రయాణికుల్లో 60 శాతం మంది మెట్రో  స్మార్ట్ కార్డు ఉపయోగిస్తున్నారు.  మిగతా వారు కౌంటర్లలో టికెట్లు కొంటున్నారు. దీనివల్ల రద్దీ సమయాల్లో కౌంటర్ల వద్ద ప్రయాణికుల క్యూలైన్ పెరిగిపోతోంది.  వీటిని అరికట్టాటనికి మెట్రో కొత్త సదుపాయం తీసుకువస్తోంది.  ఎక్కడి నుంచైనా మొబైల్ లోనే టికెట్ తీసుకునేలా  కొత్త యాప్ ను ఎల్అండ్ టీ, హైదరాబాద్ మెట్రో రైలు అభివృధ్ది చేస్తోంది.  

క్యూఆర్ కోడ్  రూపంలో టికెట్ మీ మొబైల్ లో కనిపిస్తుంది. దాన్ని మెట్రో ఎంట్రీ గేట్ వద్ద చూపించి మీరు లోపలికి వెళ్లవచ్చు. ఈసేవలు డిసెంబర్ నెలాఖరుకు అందుబాటులోకి వస్తున్నట్లు ఎల్.అండ్.టీ, హైదరాబాద్ మెట్రో అధికారులు తెలిపారు.

ఎలా ఉపయోగించాలి 
స్టేషన్ కు రాకుండానే మొబైల్ నుంచి యాప్ లో టికెట్ తీసుకోవచ్చు. 
ఇంటర్నెట్ బ్యాంకింగ్,డెబిట్, క్రెడిట్ కార్డు ద్వారా టికెట్ చార్జి చెల్లించవచ్చు. 
ఢిల్లీలో అయితే ఈ విధానంలో ఒకేసారి ఆరు టికెట్లు తీసుకోవచ్చు..మనదగ్గర ఎంత మంది తీసుకోవచ్చు  అనేది ఈ నెలాఖరుకు స్పష్టత వస్తుంది.
ఏ స్టేషన్ నుంచి ఏ స్టేషన్ వరకు కావాలో చెబితే అంతదూరానికి టికెట్ క్యూఆర్ కోడో రూపంలో యాప్ లో కనిపిస్తుంది.
స్టేషన్ కు చేరుకుని క్యూఆర్ కోడ్  గుర్తించే ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ గేట్లు వద్ద చూపించగానే గేట్లు తెరుచుకుని లోపలికి ప్రవేశం దొరుకుతుంది.తిరిగి బయటకు వచ్చేటప్పుడు క్యూఆర్ కోడ్ చూపిస్తే గేట్లు తెరుచుకుంటాయి.
ఒక ప్రయాణం ముంగించుకుని బయటకు వచ్చిన తర్వాతే  మరో టికెట్ బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది.  
ఈ టికెట్ కు కాలపరిమితి విధించారు. ఈరోజు తీసుకున్న టికెట్ అర్ధరాత్రి తర్వాత  టికెట్ చెల్లుబాటు కాదు. అర్ధరాత్రి తర్వాత ఎగ్జిట్ అయినట్లు పరిగణలోకి తీసుకుంటారు. టికెట్ తీసుకున్నరోజు ప్రయాణించకపోతే టికెట్ మురిగిపోతుంది.