ఈ స్టేషన్‌లలో మెట్రో రైలు ఆగదు

  • Published By: vamsi ,Published On : March 19, 2019 / 02:26 AM IST
ఈ స్టేషన్‌లలో మెట్రో రైలు ఆగదు

ఎప్పుడు ఎప్పుడా అని ఎదురు చూస్తున్న హైటెక్ సిటీ నుంచి అమీర్‌పేట్ మెట్రో రైలు రేపు(20 మార్చి 2019) ప్రారంభం కానుంది. ఉదయం తొమ్మిది గంటలకు ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ జెండా ఊపి లాంఛనంగా మెట్రో రైలును ప్రారంభిస్తారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న కారణంగా ఈ కార్యక్రమంను నిరాడంబరంగా నిర్వహించనున్నారు. అదేరోజు సాయంత్రం 4 గంటల నుంచి మెట్రో రైలు నడవనుంది. మెట్రో ద్వారా 18 నిమిషాల్లో అమీర్‌పేట్‌ నుంచి హైటెక్‌ సిటీ చేరుకోవచ్చు. జూబ్లీ చెక్‌పోస్ట్‌ నుంచి సింగిల్‌ట్రాక్‌లో మెట్రోరైలు హైటెక్‌సిటీ వరకు వెళ్లనుంది. అమీర్ పేట నుంచి హైటెక్‌ సిటీ వరకు 10 కిలో మీటర్ల దూరంలో మొత్తం 9 స్టేషన్లు ఉన్నాయి. అమీర్‌పేట్, తరుణి–మధురానగర్, యూసుఫ్‌గూడ, జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం.5, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్, పెద్దమ్మగుడి, మాదాపూర్, దుర్గంచెర్వు, హైటెక్‌ సిటీ స్టేషన్లు ఉండగా..  సింగిల్‌ లైన్‌ కారణంగా కొన్ని రోజులపాటు జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్, పెద్దమ్మగుడి, మాదాపూర్‌ స్టేషన్లలో మెట్రో రైలు ఆగదు అని చెబుతున్నారు. 

మెట్రో అందుబాటులోకి వచ్చిన మార్గాలు:
ఎల్బీనగర్‌–మియాపూర్‌ (29 కి.మీ.)
నాగోల్‌–అమీర్‌పేట్‌ (17 కి.మీ.)

అందుబాటులోకి రావలసిన మార్గాలు:
అమీర్‌పేట–హైటెక్‌సిటీ (10 కి.మీ.) (20 మార్చి 2019 నుంచి రాకపోకలు ప్రారంభం)
జేబీఎస్‌–ఎంజీబీఎస్‌ (ఈ ఏడాది జూన్‌ లేదా డిసెంబర్‌ నుంచి ప్రారంభమయ్యే అవకాశం)
ఎంజీబీఎస్‌–పాతనగరం (2019 చివరి నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం)