పరిమితం : ఎంపీ ఎన్నికల్లో గులాబీకి పతంగి మద్దతు

  • Published By: madhu ,Published On : January 27, 2019 / 01:51 PM IST
పరిమితం : ఎంపీ ఎన్నికల్లో గులాబీకి పతంగి మద్దతు

హైదరాబాద్ : లోక్‌సభ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ కేవలం హైదరాబాద్‌కే పరిమితంకానుంది. మిగతా ఎంపీ స్థానాల్లో టీఆర్ఎస్‌కు మద్దతు తెలపనుంది. పరస్పర సహకారంతో తెలంగాణలోని 16 స్థానాలను టీఆర్ఎస్‌.. హైదరాబాద్‌ స్థానాన్ని ఎంఐఎం దక్కించుకునేందుకు పక్కా వ్యూహం రచిస్తున్నాయి. కేసీఆర్ ప్రతిపాదించిన ఫెడరల్‌ ఫ్రంట్‌కు పూర్తిస్థాయిలో మద్దతు తెలుపుతామన్న ఎంఐఎం.. ఆ దిశగా అడుగులు వేస్తోంది.   తెలంగాణలో ఉన్న 17 లోక్ సభ స్థానాలను కైవసం చేసుకునే దిశగా పరస్పర అంగీకారంతో టీఆర్ఎస్, ఎంఐఎం పావులు కదుపుతున్నాయి. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ.. హైదరాబాద్ లోక్ సభ స్థానానికే పరిమితం కావాలని నిశ్చయించుకుంది. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా  లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ 16 స్థానాలు గెలుస్తుంది… ఒక స్థానం ఎంఐఎం గెలుస్తుందని సీఎం కేసీఆర్ మొదటి నుండి చెప్తూ వస్తున్నారు. ఇందుకు తగినట్టే  ఎంఐఎం తెలంగాణలో కేవలం హైదరాబాద్ లోక్ సభ స్థానంలో పోటీ చేసి మిగతా స్థానాల్లో టీఆర్ఎస్ కు మద్దతు తెలుపనుంది.

గతంలో కాంగ్రెస్, టీడీపీలకు ఎంఐఎం మద్దతిచ్చింది. పాతబస్తీతో పాటు పాతబస్తీ వెలుపల ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లో పోటీ చేస్తూ వచ్చేది.  కొన్ని నియోజకవర్గాల్లో ముస్లిమేతర అభ్యర్దులకు టిక్కెట్లను కేటాయించేది. కానీ ఈ సారి మాత్రం పార్టీ బలపడటానికి అవకాశమున్నా పార్టీ క్యాడర్ నుండి వ్యతిరేకత వస్తున్నా ..ఎంఐఎం వెనక్కి తగ్గకుండా ఇటీవల జరిగిన  అసెంబ్లీ ఎన్నికల్లో పాత బస్తీలోని తమకు వున్న ఏడు సిట్టింగ్ స్థానాలతో పాటు కేవలం రాజేంద్రనగర్‌లో మాత్రమే  పోటీ చేసింది. మిగతా అన్ని స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించడమే కాకుండా… ఎన్నడూ లేని విధంగా  టీఆర్ఎస్‌తో కలసి ఎంఐఎం క్యాడర్ ప్రచార సభల్లో పాల్గొంది. వచ్చే లోక్ సభ ఎన్నికలకు గతంలో పోటీ చేసిన సికింద్రాబాద్, మల్కాజ్ గిరి లోక్ సభ స్థానాల్లో ఎంఐఎం పోటీ చేయకూడదని నిర్ణయించుకుంది.  సర్వేలు కూడా టీఆర్ఎస్‌ 16 ఎంపీ స్థానాలు.. ఎంఐఎం ఒక్క స్థానంలో గెలుస్తుందని తేల్చడంతో ఎంఐఎం .. హైదరాబాద్‌ పార్లమెంట్‌ స్థానానికే పరిమితం కానుంది.