SHINE ఆస్పత్రి ఘటనపై మంత్రి కేటీఆర్ ఆరా

  • Published By: veegamteam ,Published On : October 21, 2019 / 12:28 PM IST
SHINE ఆస్పత్రి ఘటనపై మంత్రి కేటీఆర్ ఆరా

హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్ షైన్ ఆస్పత్రిలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై మంత్రి కేటీఆర్ ఆరా తీశారు. GHMC ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు. ఆస్పత్రిలో ఫైర్ సేఫ్టీపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఉన్న 600 ఆస్పత్రులకు అధికారులు నోటీసులు ఇచ్చారు. 

ఎల్బీనగర్ లోని షైన్‌ చిల్డ్రన్స్ ఆస్పత్రిలో సోమవారం ( అక్టోబర్ 21, 2019) అగ్నిప్రమాదం సంభవించింది. తెల్లవారుజామున 4వ అంతస్తులోని ఐసీయూలో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఊపిరి ఆడక ఓ చిన్నారి మృతి చెందగా.. పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.

ప్రమాదంలో గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం ఇతర ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆసుపత్రిలో 42మంది చిన్నారులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆస్పత్రి ఎదుట బాధిత తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా ఈ ఘోరం జరిగిందని ఆరోపించారు.

బాధితుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు షైన్ ఆస్పత్రిని పోలీసులు సీజ్ చేశారు. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. షైన్ ఆస్పత్రి యాజమాన్యం ఏడాదిగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు తెలిసింది. ఫైర్ సేఫ్టీ ఎన్వోసీని రెన్యువల్ చేయించలేదని బయటపడింది.