సమయం లేదు మిత్రమా : నామినేషన్లకు 2 రోజులే

సమయం లేదు మిత్రమా : నామినేషన్లకు 2 రోజులే

సమయం లేదు మిత్రమా : నామినేషన్లకు 2 రోజులే

హైదరాబాద్: 2 రోజులే మిగిలి ఉంది. అంతా ఉరుకులు పరుగులు తీస్తుంటే.. కొందరు మాత్రం నింపాదిగా ఉన్నారు. మంచి ముహూర్తం ఉందిగా.. అప్పుడు చూసుకుందాంలే అంటూ.. ప్రచారంలో మునిగిపోతున్నారు. దీంతో.. ప్రారంభమై 3 రోజులైనా.. నామినేషన్లు పెద్దగా దాఖలు కాలేదు.

పార్లమెంట్ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. పార్టీలన్నీ అభ్యర్థుల వేటలో పడ్డాయి. కాంగ్రెస్ ఇప్పటికే 16 మంది పేర్లు ప్రకటించింది. కొందరు సిట్టింగ్ లకు టీఆర్ఎస్ హింట్ ఇచ్చింది. ప్రచారాన్ని కూడా ప్రారంభించేశారు. ఎన్నికల ముఖ్య ఘట్టం నామినేషన్ల ప్రక్రియ మాత్రం మందకొడిగానే సాగుతోంది.

తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం(మార్చి 18, 2019) ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయగా, తొలి రోజు కేవలం 5 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ఏడుగురు అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. రెండో రోజు మంగళవారం(మార్చి 19) 9 నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో ప్రధాన పార్టీల అభ్యర్థులెవరూ తమ పత్రాలు సమర్పించలేదు. నామినేషన్లు వేసిన 9 మందిలో నలుగురు స్వతంత్రులు, పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా తరఫున ముగ్గురు, శ్రమజీవి, సమాజ్‌వాది పార్టీ తరఫున ఒక్కొక్కరున్నారు.

3వ రోజు కాంగ్రెస్ నుంచి పొన్నం ప్రభాకర్ నామినేషన్ వేశారు. అధికార టీఆర్‌ఎస్‌తో పాటు విపక్షాలు బీజేపీ, టీడీపీ, టీజేఎస్, వామపక్షాలు ఇంకా అభ్యర్థులను ప్రకటించకపోవడంతో నామినేషన్ల సందడి కనిపించడం లేదనే వాదన వినిపిస్తోంది. మార్చి 25వ తేదీతో నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుంది. అందులో మార్చి 21న హోలీ, 23న నాలుగో శనివారం, 24న ఆదివారం సెలవులు పోగా.. నామినేషన్ల స్వీకరణకు 2 రోజుల(మార్చి 22, 25) సమయమే ఉంది. టీఆర్‌ఎస్‌ 21న అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.

అభ్యర్థులు, పార్టీలు ముహూర్తం చూసుకుంటున్నారు. 22న విదియ, 25న పంచమి మంచి రోజులుగా ఉన్నాయని పండితులు చెబుతున్నారు. దీంతో మిగిలిన 2 రోజుల్లోనే భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ ఆ 2 రోజుల్లోనే పత్రాలు సమర్పించే అవకాశం ఉండటంతో… రిటర్నింగ్ ఆఫీసుల దగ్గర సందడి నెలకొనే అవకాశం ఉంది.

×