డిజైన్ లో ఎలాంటి లోపం లేదు : 10 రోజుల్లో బయో డైవర్సిటీ ఫ్లైఓవర్ రీ-ఓపెన్

  • Published By: veegamteam ,Published On : December 18, 2019 / 09:27 AM IST
డిజైన్ లో ఎలాంటి లోపం లేదు : 10 రోజుల్లో బయో డైవర్సిటీ ఫ్లైఓవర్ రీ-ఓపెన్

బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్ పై జరిగిన ఘోర కారు ప్రమాదం నగరవాసులను ఉలిక్కిపడేలా చేసిన సంగతి తెలిసిందే. అతివేగంగా దూసుకొచ్చిన కారు.. ఫ్లై ఓవర్ పై నుంచి కింద పడింది. ఈ ఘటనలో ఓ మహిళ చనిపోయింది. పలువురు గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇంకా కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ కల్వకుంట్ల కృష్ణమిలన్ రావ్ మాత్రం సేఫ్ గా బయటపడ్డాడు. ప్రమాద ఘటన తర్వాత ఫ్లై ఓవర్ ను మూసేశారు. కాగా.. ప్రమాదానికి కారు డ్రైవర్ అతివేగమే కారణం అని ట్రాఫిక్ పోలీసులు ఆరోపించగా.. ఫ్లై ఓవర్ లో డిజైన్ లోపం వల్లే యాక్సిడెంట్ జరిగిందని కారు నడిపిన వ్యక్తి చెప్పాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.

బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్ పై ఇంజినీరింగ్ నిపుణుల కమిటీ అధ్యయనం చేసింది. ఓ నివేదికను రూపొందించింది. ఆ నివేదిక తమకు అందిందని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ తెలిపారు. నిపుణుల కమిటీ పలు సూచనలు చేసిందన్నారు. వేగ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని చెప్పిందన్నారు. ఫ్లైఓవర్ పై వాహనాలు 40 కిలోమీటర్ల కన్నా వేగంగా వెళ్లకూడదని రిపోర్టులో పేర్కొన్నారని కమిషనర్ వెల్లడించారు. భవిష్యత్తులో ప్రమాదాలు జరక్కుండా రంబుల్ స్ట్రిప్స్, మలుపుల్లో బారియర్స్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. రోడ్డుపై వెళ్తున్నప్పుడు సైడ్ చూడకుండా వ్యూ కట్టర్స్ పెట్టాలని నిర్ణయించారు. లైవ్ లో స్పీడ్ తెలిపేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఫ్లైఓవర్ డిజైన్ లో ఎలాంటి తప్పిదం, లోపం లేదని నివేదికలో తెలిపారని అన్నారు. 40 కిలోమీటర్ల కంటే ఎక్కువ స్పీడ్ తో వెళ్లడం వల్లే ఫ్లైఓవర్‌ పై ఇటీవల ప్రమాదం జరిగిందన్నారు.

వాహనాల వేగంపై ఎక్కువ పెనాల్టీ వేయాలనే ఆలోచనలో ఉన్నట్టు కమిషనర్ చెప్పారు. 900 మీటర్ల ఫ్లైఓవర్ పై 40 కిలోమీటర్ల స్పీడ్ దాటితే చర్యలు తీసుకుంటామన్నారు. రద్దీ తక్కువగా ఉండే సమయాల్లోనూ వేగ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు.  ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామని జీహెచ్ఎంసీ కమిషనర్ చెప్పారు. మరో 8 నుంచి 10 రోజుల్లో బయో డైవర్సిటీ ఫ్లైఓవర్ రీ ఓపెన్ చేసే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వ అనుమతి రాగానే ఫ్లైఓవర్‌ పైకి మళ్లీ వాహనాలను అనుమతిస్తామన్నారు.

స్ట్రేటజిక్ రోడ్స్ డెవలప్‌మెంట్ స్కీమ్ (ఎస్‌ఆర్డీపీ) కింద నిర్మించిన బయో డైవర్సిటీ ఫ్లైఓవర్ నవంబర్ 4న అందుబాటులోకి వచ్చింది. ఖాజాగూడ జంక్షన్ నుంచి మైండ్‌ స్పేస్‌ వరకు వన్‌ వే లో వెళ్లే వాహనాలకు మాత్రమే పర్మిషన్ ఉంటుంది. ఈ ఫ్లైఓవర్ పై నవంబర్ 9న జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు మరణించారు. అది జరిగిన కొద్ది రోజులకే… నవంబర్ 23వ తేదీన రెండవ ప్రమాదం జరిగింది. 104 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన ఫోక్స్ వ్యాగన్ పోలో కారు.. మలుపు దగ్గర బ్రిడ్జి ప్రహరీని ఢీకొట్టి.. పైనుంచి రోడ్డుపై పడింది. ఫ్లైఓవర్ ఓపెన్ చేసిన కొన్ని రోజుల వ్యవధిలోనే రెండు ప్రమాదాలు జరగడం ఉలిక్కిపడేలా చేసింది. ఈ రెండు ఘటనలతో బ్రిడ్జి డిజైన్‌లో లోపాలున్నాయనే విమర్శలు వచ్చాయి. దీంతో జీహెచ్ఎంసీ నిపుణులతో కమిటీ వేసింది.