తెలంగాణ BJP కి కొత్త రెక్కలు : సౌత్‌లో పాగా వేస్తుందా

  • Published By: madhu ,Published On : March 21, 2019 / 01:36 PM IST
తెలంగాణ BJP కి కొత్త రెక్కలు : సౌత్‌లో పాగా వేస్తుందా

అసెంబ్లీ ఎన్నికల్లో సింగిల్ సీటుకే పరిమితమైన బీజేపీ… కొత్త రెక్కలు తొడుక్కొంటోంది. పక్క పార్టీల నుంచి ప్యారాచూటర్లు ల్యాండ్ అవుతుండటంతో… ఆ పార్టీ జవసత్వాలు నింపుకునే ప్రయత్నం చేస్తోంది. ఇతర పార్టీల నుంచి పెద్ద తలకాయలు వచ్చి చేరుతాయని అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి ఆ పార్టీ ఆశగా ఎదురుచూస్తోంది. ఆ కల ఇన్నాళ్లకు నెరవేరింది. డీకే అరుణ కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పేసి కమలం గూటికి చేరిపోయారు.

మరో ఐదారుగురు సీనియర్ నేతలు త్వరలోనే బీజేపీలో చేరుతారనే ప్రచారం ఉంది. ఢిల్లీలో ఈసారి కూడా మోడీ సర్కారే అని.. 400లకు పైగా సీట్లు సాధిస్తామని కమలం నేతలు ఢంకా భజాయించి చెబుతున్నారు. ఇక్కడ మాత్రం బీజేపీ ఎలాంటి ప్రభావం చూపెట్టలేకపోతోంది. అధినేత అమిత్ ఎంత ట్రై చేసినా.. ఎన్ని ప్లాన్లు ఇచ్చినా వాటిని అమలు చేయడంలో నేతలు ఫెయిల్ అయ్యారు. అటు కేడర్ కూడా పూర్తి నిరాశా, నిస్పృహల్లో మునిగిపోయింది. లోక్‌సభ ఎన్నికల్లో కనీసం డిపాజిట్ అయినా దక్కుతుందా అనే డౌట్ నేతలను పట్టిపీడించింది. మహబూబ్‌నగర్‌లో కీలక నేత.. మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్‌గా పేరున్న డీకే అరుణ చేరడం ఆ పార్టీలో జోష్ నింపుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలబడిన తమకు ఈ పరిణామం ఉత్సాహాన్నిస్తుందని కమలనాథులంటున్నారు.

మరికొంత మంది నేతలతో బీజేపీ మంతనాలు జరుపుతోంది. వాళ్లు కూడా వస్తే… ఇక సౌత్‌లో పాగా వేసేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో కొంత పురోగతి సాధించినట్లే అని ఆ పార్టీ నేతలంటున్నారు. ఈ పార్టీ ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ పైనే ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగిస్తోంది. వారిలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడిన వాళ్లే ఉన్నారు. వీరికి ఈజీగా గాలం వేయొచ్చనే ప్లాన్‌తో బీజేపీ వర్కౌట్ చేసింది. ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసి నేత సోయం బాపూరావును పార్టీలో చేర్చుకుంది బీజేపీ. అటు మహబూబ్‌నగర్.. ఇటు ఆదిలాబాద్.. రెండు జిల్లాల్లోనూ పట్టు సాధించినట్లే అని ఆ పార్టీ నేతలంటున్నారు.

అలాగే.. మెదక్.. నల్గొండ.. ఖమ్మం జిల్లాల్లోని కీలక నేతలను తిప్పుకోవాలని చూస్తున్నారు. పార్టీలన్నీ అభ్యర్థులను ప్రకటిస్తే.. మరికొంత మంది నేతలు బీజేపీలో చేరడం గ్యారెంటీ అనే ధీమా ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. అయితే.. కొత్త నేతలతో పార్టీ బలోపేతమవుతుందా.. లేక మైనస్ అవుతుందా… ఇలా చేరిన వాళ్లంతా ఎన్నికలయ్యాక పార్టీలోనే కొనసాగుతారా.. లేక తమదారి తాము చూసుకుంటారా అనే చర్చ ఇప్పుడు బీజేపీలో జరుగుతోంది.