తెలంగాణ కేబినెట్ : మంత్రి పదవులు వీరికే దక్కుతాయా ? 

  • Published By: madhu ,Published On : January 7, 2019 / 01:30 AM IST
తెలంగాణ కేబినెట్ : మంత్రి పదవులు వీరికే దక్కుతాయా ? 

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్నాయి. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి రోజులు గడుస్తున్నాయి…కానీ గులాబీ బాస్ ఇంకా మంత్రివర్గ విస్తరణ చేయలేదు. తమకు ఛాన్స్ వస్తుందని అనుకుంటున్న ఆశావాహులు మరింత టెన్షన్‌కు గురవుతున్నారు. తమకు మాత్రం కేబినెట్‌లో చోటు దక్కుతుందని కొంతమంది ధీమాగా ఉంటున్నారు. డిసెంబర్ 13న గులాబీ బాస్ కేసీఆర్ సీఎంగా.. మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ హోం మంత్రిగా ప్రమాణం చేశారు. అప్పటి నుంచి కేబినెట్ కూర్పుపై అనేక ఊహాగానాలు వినిపించాయి. త్వరలోనే విస్తరణ జరిగే అవకాశం ఉందనే వార్తలతో ఆశావహులంతా తమకే మంత్రి పదవి దక్కుతుందని ఆశల పల్లకిలో ఊరేగారు. అయితే.. సమయాభావం, ముహూర్తాల కారణంగా విస్తరణ జరగలేదు. 
4 డేస్ అసెంబ్లీ సమావేశాలు…
సంక్రాంత్రి తర్వాత నాలుగు రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. ఈ సమయంలోనే… మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చనే వాదన బలంగా వినిపిస్తోంది. మొత్తం 18మందితో కేసీఆర్ మంత్రివర్గం ఉండే అవకాశం ఉందని టీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి…. జిల్లాల వారీగా కొందరు నేతల పేర్లు తెరపైకి వస్తున్నాయి.
హైదరాబాద్ నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు… ఆదిలాబాద్ జిల్లా నుంచి ఇంద్రకరణ్‌రెడ్డి, రేఖానాయక్… కరీంనగర్ నుంచి ఈటల రాజేందర్, కేటీఆర్, కొప్పుల ఈశ్వర్ పేర్లు రేసులో వినిపిస్తున్నాయి. అలాగే.. నిజామాబాద్ జిల్లా విషయానికి వస్తే.., వేముల ప్రశాంత్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్దన్‌, మెదక్ నుంచి హరీష్‌రావు, పద్మాదేవేందర్‌రెడ్డి, వరంగల్ నుంచి ఎర్రబెల్లి దయాకర్‌రావు, రెడ్యానాయక్.. నల్గొండ నుంచి గుత్తా సుఖేందర్‌రెడ్డి, జగదీష్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మహబూబ్‌నగర్ నుంచి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. 
ఈ సారి ఎలాంటి ఇబ్బంది రాకుండా కేసీఆర్ జాగ్రత్త తీసుకుంటున్నారు. ఇక.. ఖమ్మం.. రంగారెడ్డి జిల్లాల నుంచి మంత్రివర్గంలో ఉన్న నేతలిద్దరూ ఓటమి పాలవడంతో.. ఆ జిల్లాల్లో పదవులు ఎవరికి వరిస్తాయనే విషయంపై ఉత్కంఠ నెలకొంది.