ఎల్డీఎమ్మార్సీ ఫార్ములా : లోక్ స‌భ ఎన్నిక‌ల‌పై కాంగ్రెస్ క‌స‌ర‌త్తు  

పార్లమెంట్ ఎన్నిక‌ల‌పై తెలంగాణ కాంగ్రెస్ క‌స‌ర‌త్తును ముమ్మరం చేసింది.

  • Published By: veegamteam ,Published On : February 1, 2019 / 07:06 PM IST
ఎల్డీఎమ్మార్సీ ఫార్ములా : లోక్ స‌భ ఎన్నిక‌ల‌పై కాంగ్రెస్ క‌స‌ర‌త్తు  

పార్లమెంట్ ఎన్నిక‌ల‌పై తెలంగాణ కాంగ్రెస్ క‌స‌ర‌త్తును ముమ్మరం చేసింది.

హైదరాబాద్ : తెలంగాణ‌లో రిజ‌ర్వుడ్ లోక్ స‌భ స్థానాల‌పై కాంగ్రెస్ ప్రత్యేక ఫోక‌స్ పెడుతోంది. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అనుస‌రించిన లీడర్‌ డెవలప్‌మెంట్ మిషన్‌ ఇన్‌ రిజర్వుడ్‌ కానిస్టిట్యూయన్సీ ఫార్ములాను పార్లమెంట్ ఎన్నిక‌ల్లో కూడా వ‌ర్కౌట్ చేసేందుకు ప‌క్కా స్కెచ్ వేస్తున్నారు. దీనిలో భాగంగా  గెలుపు గుర్రాల ఎంపిక‌పై ఢిల్లీ పెద్దలు దృష్టి సారిస్తున్నారు.

పార్లమెంట్ ఎన్నిక‌ల‌పై తెలంగాణ కాంగ్రెస్ క‌స‌ర‌త్తును ముమ్మరం చేసింది. అధికార టీఆర్ఎస్‌కు ధీటుగా ఎన్నిక‌ల బ‌రిలో దిగేందుకు వ్యూహ‌ర‌చ‌న చేస్తున్నారు హ‌స్తం నాయ‌కులు.  అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల అనుభ‌వంతో త‌గు జాగ్రత్తలు తీసుకొని ముంద‌డుగు వేస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గాల వారిగా కాంగ్రెస్ కు పోలైన ఓట్ల శాతాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకొంటూ .. గెలుపుపై అంచనాలు వేస్తున్నారు.

అభ్యర్థుల ఎంపిక‌పై పార్టీ హైక‌మాండ్ ఇప్పటికే ఇంట‌ర్నల్ గా అభిప్రాయ సేక‌ర‌ణ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏ నియోజ‌క‌వ‌ర్గంలో ఏ అభ్యర్థిని నిలబెడితే ఎలా ఉంటుంది… అక్కడ ఉండే ప్లస్‌లు, మైనస్‌లు  ఏంటీ  అనే లెక్కలు వేస్తున్నారు ఢిల్లీ పెద్దలు. పార్లమెంట్ బరిలో దింపేందుకు.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన నేతల పేర్లను  కూడా పరిశీలిస్తున్నారు

రాష్ట్రంలో రిజ‌ర్వుడ్ లోక్ స‌భ స్థానాల‌పై సీరియ‌స్‌గా దృష్టి సారిస్తున్నారు పార్టీ పెద్దలు.  పార్టీ అనుస‌రించిన ఎల్డీఎమ్మార్సీ ఫార్ములా.. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కొంత మెరుగైన ఫ‌లితాలు ఇచ్చింది. గెలిచిన 19 మంది ఎమ్మెల్యేల్లో ఏడుగురు రిజ‌ర్వుడ్ స్థానాల్లోనే గెలుపొందారు.  ఇప్పుడు లోక్ స‌భ ఎన్నిక‌ల్లో కూడా ఈ ఫార్ములాను ప‌క్కాగా అమ‌లు చేసేలా ప్లాన్ చేస్తున్నారు ఢిల్లీ నాయ‌కులు.

ఇప్పటికే ఢిల్లీలో ఎల్డీఎమ్మార్సీ పై రివ్యూ నిర్వహించిన పార్టీ హైక‌మాండ్ .. తెలంగాణలో అనుస‌రించాల్సిన వ్యూహంపై ప్రత్యేకంగా చ‌ర్చించింది. వ‌రంగ‌ల్ స్థానం నుంచి మంద కృష్ణ మాదిగ‌ను, నాగ‌ర్ క‌ర్నూల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి స‌తీశ్ మాదిగ‌, పెద్దప‌ల్లి నుంచి అద్దంకి ద‌యాక‌ర్‌ను బ‌రిలో దించే ఛాన్స్ ఉంది. 

ఇక మ‌రోవైపు ఆదిలాబాద్ స్థానం నుంచి ర‌మేష్ రాథోడ్, సోయం బాబూరావులు పోటీ ప‌డుతుండ‌గా .. సోయంబాబూ రావుకు టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. మ‌హ‌బూబాబాద్ స్థానం నుంచి కేంద్ర మాజీ మంత్రి బ‌ల‌రాం నాయ‌క్ టికెట్ అడుగుతుండ‌గా ఆయ‌న‌కు పోటీగా బెల్లయ్య నాయ‌క్ టికెట్ కోసం ప‌ట్టుబ‌డుతున్నారు. వీరిద్దరిలో హైక‌మాండ్ ఎవ‌రికి అవ‌కాశం ఇస్తుంద‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.