5 నెలల్లో ఇంత మార్పా : తెలంగాణలో 62.69 శాతం పోలింగ్

  • Published By: veegamteam ,Published On : April 13, 2019 / 02:27 AM IST
5 నెలల్లో ఇంత మార్పా : తెలంగాణలో 62.69 శాతం పోలింగ్

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో గురువారం (ఏప్రిల్ 11, 2019) 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. పోలింగ్ శాతం వివరాలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌ అధికారికంగా ప్రకటించారు. 62.69 శాతం పోలింగ్‌ నమోదైనట్టు వెల్లడించారు. హైదరాబాద్‌ లోక్‌సభ పరిధిలో రాష్ట్రం మొత్తం మీద అతి తక్కువ పోలింగ్ జరిగిందన్నారు. 2014లో లోక్‌సభ ఎన్నికల్లో 70.75 శాతం పోలింగ్‌ నమోదైంది. 2018 డిసెంబర్ లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అప్పుడు 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో 76.07 శాతం పోలింగ్‌ నమోదైంది. 5 నెలల వ్యవధిలో 13.38 శాతం పోలింగ్‌ తగ్గడం గమనార్హం.

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గాల్లోనే పోలింగ్‌ తక్కువగా నమోదైంది. ఈ 3 స్థానాల్లో 50 శాతానికన్నా తక్కువగా పోలింగ్‌ నమోదైంది. హైదరాబాద్‌లో అతి తక్కువగా 44.75 శాతం, సికింద్రాబాద్‌లో 46.26 శాతం, మల్కాజిగిరిలో 49.40 శాతం, చేవెళ్లలో 53.22 శాతం ఓట్లు పోలయ్యాయి. 5 స్థానాల్లో 71 శాతానికి పైగా పోలింగ్‌ జరిగింది.

రాష్ట్రంలో అత్యధికంగా ఖమ్మం లోక్‌సభ స్థానంలో 75.28 శాతం పోలింగ్ నమోదైంది. అతి తక్కువగా హైదరాబాద్ నియోజకవర్గంలో 44.75 శాతం నమోదైంది. భువనగిరిలో 74.39 శాతం, నల్లగొండలో 74.11 శాతం పోలింగ్ జరిగింది. రాజధాని నగరంలో ఓటు వేయడానికి ప్రజలు ఆసక్తి చూపలేదు. చాలామంది సొంత ప్రాంతాల్లో ఓటు వేయడానికి వెళ్లారు. పలు కారణాలతో నగర పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల నియోజకవర్గాలలో పోలింగ్ శాతం తక్కువగా నమోదైంది.

పోలింగ్‌ తర్వాత ఈవీఎంలను స్ట్రాంగ్‌ రూమ్స్‌కు తరలించారు. స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర టైట్ సెక్యూరిటీ ఉంచారు. నిజామాబాద్‌ లోక్‌సభ నియోజవకర్గంలో 27 వేలకుపైగా ఈవీఎంలు, వీవీపీఏటీలను వినియోగించడంతో వాటన్నింటినీ స్ట్రాంగ్‌ రూమ్స్‌కు తరలించేందుకు గురువారం (ఏప్రిల్ 11) అర్ధరాత్రి దాటినట్లు సమాచారం. స్ట్రాంగ్స్ రూమ్స్ దగ్గర సాయుధ బలగాలతో పాటు సీసీ కెమెరాలతో నిఘాను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ జరిగే మే 23వ తేదీ వరకు స్ట్రాంగ్స్ రూమ్స్ దగ్గర టైట్ సెక్యూరిటీ ఉంటుందని అధికారులు చెప్పారు.