ఆర్టీసీ సమ్మె : బస్సులు నిల్..మెట్రో ఫుల్

  • Published By: madhu ,Published On : October 5, 2019 / 07:33 AM IST
ఆర్టీసీ సమ్మె : బస్సులు నిల్..మెట్రో ఫుల్

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. ఎక్కడికక్కడ బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేటు బస్సులను తిప్పుతామని అని ప్రభుత్వం చెప్పినా..అవి సరిపోయినవన్నీ లేకపోవడంతో ప్రయాణీకులు ప్రత్యామ్నాయ మార్గాల వైపు వెళుతున్నారు. ప్రధానంగా నగరంలో నివాసం ఉంటున్న వారు ఇక్కట్లకు గురయ్యారు. దసరా పండుగ సందర్భంగా సొంత ఊళ్లకు వెళ్లే వారి ఇబ్బందులు చెప్పనవసరం లేదు. 

ఆఫీసులకు, ప్రైవేటు ఉద్యోగులు ఇతరత్రా పనులకు వెళ్లే వారు ఇబ్బందులు పడ్డారు. బస్సులు లేకపోవడంతో మెట్రో రైళ్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో అక్టోబర్ 05వ తేదీ శనివారం ఉదయం నుంచే రైళ్లు కిక్కిరిసిపోయాయి. సమ్మె వల్ల తాము సమయాలను పొడిగిస్తున్నట్లు ఇదివరకే మెట్రో ప్రకటించిన సంగతి తెలిసిందే. రెండు కారిడార్లలో ప్రయాణీకులతో మెట్రో రైళ్లల్లో సందడి నెలకొంది. రద్దీ దృష్ట్యా మెట్రో అదనపు సర్వీసులు నడుపుతోంది.

ఉదయం 10 గంటల వరకు మెట్రోలో 78 వేల మంది ప్రయాణీంచారని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. సాధారణ రోజుల్లో 42 వేల మంది జర్నీ చేస్తుంటారని తెలిపారు. సికింద్రాబాద్ నుంచి మాదాపూర్, హైటెక్ సిటీ, సైబర్ టవర్స్ వెళ్లే ఉద్యోగులు మెట్రో రైళ్లను ఆశ్రయిస్తున్నారు. రాత్రి 11.30 గంటల వరకు రైళ్లు నడువనున్నాయి. రద్దీని బట్టి ప్రతి మూడు నిమిషాలకు ఒక మెట్రో రైలును నడుపనున్నారు అధికారులు. 

సమ్మె వల్ల 10 వేల 600 బస్సులు నిలిచిపోయాయి. టి.సర్కార్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. తాత్కాలికంగా డ్రైవర్లు, కండక్టర్లను నియమిస్తోంది. మరోవైపు ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం డెడ్ లైన్ విధించింది. శనివారం సాయంత్రం 6 గంటల్లోగా విధుల్లో చేరకుంటే..ఉద్యోగాలకు ముప్పు ఉంటుందని హెచ్చరిస్తోంది. సమ్మె ఎన్ని రోజులు ఉంటుందో..తాము ఇంకా ఎన్ని తిప్పలు పడాలోనని ప్రయాణీకులు ఆందోళన చెందుతున్నారు.
Read More : పండుగ చేస్కోండి : హైదరాబాద్ టూ కరీంనగర్ ఛార్జీ రూ.750