ఓటు పిలుస్తోంది : ఏపీకి ఓటర్ల పయనం..మరో సంక్రాంతి

  • Published By: madhu ,Published On : April 8, 2019 / 03:53 AM IST
ఓటు పిలుస్తోంది : ఏపీకి ఓటర్ల పయనం..మరో సంక్రాంతి

ఓటు పిలుస్తోంది. అంటూ ఏపీ ఓటర్లు ఆ రాష్టానికి పయనమౌతున్నారు. సొంతూళ్లకు వచ్చి ఓటు వేయాలంటూ నేతలు అభ్యర్థిస్తున్నారు. అంతేకాదండోయ్..పలు ఆఫర్స్ కూడ ఇస్తున్నారు. ఉచితంగా రవాణా సదుపాయం కల్పిస్తాం..భోజనం కూడా అందిస్తాం..అంటూ నేతలు పేర్కొంటున్నారంట. కొందరైతే స్వయంగా కలిసి ఓటేసేందుకు రండి అంటూ బతిమాలుడుతున్నారు. ఒక్క రోజు లీవ్ పెట్టుకుంటే నాలుగు రోజులు కలిసి వస్తాయి..చలో..అంటూ బ్యాగులు సర్దేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది వారి వారి సొంతూళ్లకు వెళ్లిపోయారు. మరోసారి సంక్రాంతి పండుగ వచ్చినట్లుగా ఉందని పలువురు అనుకుంటున్నారు

ఏప్రిల్ 11వ తేదీ ఏపీ రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్ సభకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలను పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. హైదరాబాద్‌లో అత్యధికంగా ఏపీ ఓటర్లు నివాసం ఉంటున్నారు. ఏప్రిల్ 11న పోలింగ్ రోజున సెలవు ఉంది. తెల్లారి అంటే ఏప్రిల్ 12వ తేదీ శుక్రవారం ఒక్క రోజు సెలవు పెట్టుకుంటే శని, ఆదివారాలు కలిసి వస్తున్నాయి. మొత్తంగా నాలుగు రోజులు సెలవు దొరకడంతో టూర్లకు వెళుతారేమోనని ముందే గ్రహించిన ఏపీ నేతలు..ఓటర్లను ప్రసన్నం చేసుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఏప్రిల్ 09వ తేదీ నుండే ఉచితంగా తీసుకెళ్లేందుకు నేతలు ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం. ఓటు వేసిన అనంతరం తిరిగి తీసుకొచ్చేందుకు కూడా సదుపాయం కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. ఓటుకు ఇంత డబ్బు కూడా ముట్టచెప్పుతున్నట్లు టాక్. 

ఇప్పటికే నగర శివారు ప్రాంతాల్లోని ప్రజలు ఏపీ రాష్ట్రంకు వెళుతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డితో పాటు వివిధ జిల్లాల్లో ఏపీ ఓటర్లు నివాసం ఉంటున్నారు. ప్రధానంగా హైదరాబాద్‌లోని కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ , మల్కాజ్ గిరి, అంబర్ పేట్, ఎల్బీ నగర్‌తో పాటు ఇతర ప్రాంతాలతో పాటు ఉమ్మడి ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలో సీమాంధ్రులు ఎక్కువగానే ఉన్నారు. ఏపీకి వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రాత్రి వేళ్లల్లో రహదారులపై ప్రైవేటు బస్సులు, ఆర్టీసీ బస్సులు కిటకిటలాడుతున్నాయి. ఆర్టీసీ, రైళ్లు ఫుల్ అయిపోవడంతో జనాలు ప్రైవేటు వైపు మొగ్గు చూపుతున్నారు.