ఎందుకీ వివక్ష : పవన్ కళ్యాణ్ తీరుపై జనసేన కార్యకర్తల ఆవేదన

నేను తెలుగు భాష లెక్క.. ఆడా ఉంటా.. ఈడా ఉంటా.. ఈ డైలాగ్‌ అల్లు అర్జున్‌కు సరిపోతుందేమో గానీ.. ఆయన మేనమామ పవర్‌ స్టార్‌కు మాత్రం సెట్‌ కాదు. ఆయన ఆడ

  • Published By: veegamteam ,Published On : February 12, 2020 / 03:06 PM IST
ఎందుకీ వివక్ష : పవన్ కళ్యాణ్ తీరుపై జనసేన కార్యకర్తల ఆవేదన

నేను తెలుగు భాష లెక్క.. ఆడా ఉంటా.. ఈడా ఉంటా.. ఈ డైలాగ్‌ అల్లు అర్జున్‌కు సరిపోతుందేమో గానీ.. ఆయన మేనమామ పవర్‌ స్టార్‌కు మాత్రం సెట్‌ కాదు. ఆయన ఆడ

నేను తెలుగు భాష లెక్క.. ఆడా ఉంటా.. ఈడా ఉంటా.. ఈ డైలాగ్‌ అల్లు అర్జున్‌కు సరిపోతుందేమో గానీ.. ఆయన మేనమామ పవర్‌ స్టార్‌కు మాత్రం సెట్‌ కాదు. ఆయన ఆడ మాత్రమే ఉన్నాడు.. ఈడ లేడు కాబట్టి. పార్టీ పెట్టి ఆరేళ్లయినా.. తెలంగాణలో నామ మాత్రంగానే పెర్‌ఫార్మెన్స్‌ చేస్తూ.. ఏపీలో మాత్రం ఫుల్‌ పెర్ఫార్మెన్స్‌ చేసేస్తున్నాడు. ఆయన పెర్ఫార్మెన్స్‌లో ఎందుకింత తేడా? ఆడా ఈడా.. రెండు చోట్ల ఉండలేడా?

తెలంగాణ జనసైనికుల్లో నిరాశ:
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో నూతన వరవడి సృష్టిస్తానంటూ పురుడుపోసుకున్న జనసేన పార్టీ.. తెలంగాణలో అసలు కనిపించకుండా పోతోంది. అధినేత పవన్‌ కల్యాణ్‌ తీరుపై తెలంగాణలోని ఆ పార్టీ నేతలు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారట. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఏ సమస్య వచ్చినా.. ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తానంటూ పార్టీ ఆవిర్భావ సమయంలో పవన్‌ ప్రకటించారు. అందులో భాగంగా తెలంగాణలోని కొండగట్టు నుంచి తన పర్యటన ప్రారంభించారు. ఆ తర్వాత తెలంగాణలో పార్టీ బలోపేతానికి జిల్లాలు, నియోజకవర్గాల వారిగా అధ్యక్షులను, ఇన్‌చార్జులను సైతం నియమించారు. అప్పుడప్పుడు స్థానిక సమస్యలపై గళమెత్తారు. 

2018 ఎన్నికల్లో తెలంగాణలో 7 చోట్ల జనసేన పోటీ:
2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలకు మద్దతిచ్చి, ఆ పార్టీల తరఫున ప్రచారంలో పాల్గొన్నారు పవన్‌ కల్యాణ్‌. అందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించి, ముఖ్యంలో ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడంతో ఇతోధిక సాయమందించారు. ఆ తర్వాత 2018 తెలంగాణలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో ఏడు చోట్ల పోటీ చేశారు. ఒక్కచోట కూడా గెలవలేకపోయారు. మిగిలిన చోట్ల బీఎస్పీకి మద్దతిచ్చి, బీఎస్పీ అధినేత్రి మాయావతితో కలసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో పోటీ చేసి ఒక్క చోటే మాత్రమే గెలిచారు. 

తెలంగాణలో పార్టీ నేతలతో టచ్‌లో లేని పవన్‌:
ఎన్నికల తర్వాత జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పూర్తిగా ఏపీ రాజకీయాలపైనే దృష్టి పెట్టారు. అమరావతిలో రైతుల భూసేకరణ సమయంలో అక్కడి రైతుల పక్షాన నిలబడ్డారు. ఏపీలో ఏ సమస్య వచ్చినా అక్కడి ప్రజలకు బాసటగా ఉంటూ వచ్చారు. పార్టీ ప్రారంభంలో తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీ సైనికులుంటారు అని చెప్పిన పవన్.. పెద్దగా తెలంగాణపై దృష్టి సారించడం లేదు. హైదరాబాద్ కేంద్రంగా ఉంటున్నా తెలంగాణలో ఒకరిద్దరు తప్ప పెద్దగా ఆ పార్టీ నేతలతో టచ్‌లో ఉండడం లేదంటున్నారు. రాజకీయాల్లోకి రాక ముందు పవన్‌ కళ్యాణ్‌కు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ అభిమానులు ఎక్కువగానే ఉన్నారు.

జనసేన నుంచి జంప్:
సినిమాల్లో లేకపోయినా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తమకు పవన్‌ దగ్గరవుతారని ఆయన అభిమానులు భావించారు. ఏపీతో పోల్చుకుంటే తెలంగాణలో జనసేనానికి ఫ్యాన్‌ ఫాలోయింగ్ కొద్దిగా ఎక్కువే. ఎన్ని సమస్యలు వచ్చినా తమ నాయకుడితో కలిసి పని చేయవచ్చని అనుకున్నారు. కానీ ఆయన ఫోకస్ అంతా ఏపీపైనే పెట్టడంతో తెలంగాణలో ఆయన అభిమానిగా ఉంటూ పార్టీ నాయకులుగా మారిన వారు నిరాశ చెందుతున్నారట. తెలంగాణలో పార్టీ ఊసే లేకపోవడంతో చాలామంది ఆయన అభిమానులు ఇతర పార్టీలకు వలస వెళ్ళిపోయారు. 

పవన్‌ను కలిసేందుకు నో పర్మిషన్:
తాజాగా తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. పవన్‌ ఆదేశాల మేరకు ఒకరిద్దరు పార్టీ గుర్తు మీద కాకుండా ఇండిపెండెంట్‌గా బరిలో నిలబడ్డారు. ముందస్తు ఎన్నికల్లో అనుకున్నంత ఓట్లు రాకపోవడంతో తెలంగాణలో ఆ పార్టీ గుర్తును ఎన్నికల సంఘం తొలగించింది. ఏదో ఉన్నామంటే ఉన్నట్లు ఓ పత్రిక ప్రకటనతో అప్పుడప్పుడూ వార్తల్లో మాత్రమే కనిపిస్తున్నారు ఆ పార్టీ నేతలు. తాజాగా పవన్‌ కల్యాణ్‌ ఏపీలో బీజేపీతో కలిసి ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత సినిమాల్లో బిజీ అయ్యారు. పవన్‌ను నమ్ముకొని రాజకీయాలకు వచ్చిన వారు సరైన ఆదరణ లేకపోవడంతో ఫీలవుతున్నారట. హైదరాబాద్‌లో ఉన్న తమ అధినేతను కలిసే ప్రయత్నం చేస్తున్నా అనుమతి లభించడం లేదంటున్నారు.

తెలంగాణలో జనసేన ఉన్నా లేనట్టేనా?
ప్రస్తుతానికి ఏపీ రాజకీయాలతో పాటు అక్కడ పార్టీ బలోపేతానికి పవన్ ఫోకస్ పెడుతున్నారు. పార్టీ స్థాపించినప్పటి నుంచి రెండు మూడు సార్లు తప్ప తెలంగాణ నేతలతో పార్టీ పరిస్థితిపై సమావేశం పెట్టలేదు. కనీసం పార్టీని ముందుకు తీసుకు వెళ్లే ప్రయత్నాలు కూడా చేయడం లేదు. ఇక్కడ పార్టీకి చెప్పుకోదగ్గ నేతలు లేకపోయినా.. అభిమానులు మాత్రం ఉన్నారు. వారంతా తమ అధినేత పవన్‌ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారట. కానీ, ఆయన మాత్రం ఎలాంటి ఆసక్తి చూపించడం లేదంటున్నారు. దీంతో అసలు రాష్ట్రంలో జనసేన పార్టీ అనేది ఉన్నా లేనట్టే అని జనాలు అనుకుంటున్నారు.