Colombia : కొలంబియా జైలులో నిప్పు పెట్టిన ఖైదీలు..51 మంది మృతి

కొలంబియాలోని ఓ జైలులో ఖైదీల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో రెచ్చిపోయిన ఖైదీలు జైలులో నిప్పు పెట్టారు. మంగళవారం (జూన్ 28,2022) జరిగిన ఈ ఘటనలో 51మంది ఖైదీలు మరణించారు.మరో 24మంది వరకు గాయపడ్డారు.

Colombia : కొలంబియా జైలులో నిప్పు పెట్టిన ఖైదీలు..51 మంది మృతి

Fire in Colombia Jail : లాటిన్‌ అమెరికా దేశమైన కొలంబియాలోని ఓ జైలులో ఖైదీల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో రెచ్చిపోయిన ఖైదీలు జైలులో నిప్పు పెట్టారు. మంగళవారం (జూన్ 28,2022) జరిగిన ఈ ఘటనలో 51మంది ఖైదీలు మరణించారు.మరో 24మంది వరకు గాయపడ్డారు. పశ్చిమ కొలబియాలోని తులువా జైలులో ఖైదీల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణ కాస్తా తీవ్రస్థాయికి చేరుకుని ఖైదీల దుప్పట్లు..బట్టలకు నిప్పు పెట్టారు. ఆ ఘటనతో 51 మంది మరణించారని జైళ్ల శాఖ అధికారులు తెలిపారు.

తులువా నగరంలోని జైలులో తెల్లవారుఝామున 2 గంటలకు ఖైదీల మధ్య ఘర్షణ మొదలైంది. దీన్ని ఆపటానికి గార్డులు యత్నించారు. పోలీసులు తమ ఎన్ క్లోజర్ లోకి ప్రవేశించకుండా నిరోధించటానికి ఖైదీలు వారిని అడ్డుకోవడానికి ఖైదీలు.. దుప్పట్లు, ఇతర వస్తువులకు నిప్పంటించారు. దీంతో మంటలు వేగంగా వ్యాపించాయి. ఆ పొగతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారని నేషనల్ పెనిటెన్షియరీ అండ్ ప్రిజన్ ఇన్‌స్టిట్యూట్ (INPEC) డైరెక్టర్ టిటో కాస్టెల్లానోస్ తెలిపారు.

ఈ ఘటనలో దాదాపు 24 మంది గాయపడ్డారని, వారిలో జైలు సిబ్బంది కూడా ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం జైలులో మంటలు అదుపులోకి వచ్చాయని, ఖైదీలెవరూ తప్పించుకోలేదని చెప్పారు. ఈ ఘటన జరిగిన సమయంలో అందులో 1,267మంది ఖైదీలు ఉన్నారని వెల్లడించారు. మంటలు చెలరేగిన బ్లాక్‌లో 180 మంది ఉన్నట్లు తెలుస్తున్నది.