Afghanistan Poverty : అప్ఘానిస్థాన్ లో ఆకలి కేకలు .. చిన్నారుల కడుపు నింపలేక మత్తు మందులిచ్చి నిద్రపుచ్చుతున్న దుస్థితి

అప్ఘానిస్థాన్ లో ఆకలి కేకలు మిన్నంటుతున్నారు. ఆడబిడ్డలను అంగట్లో సరుకుల్లా అమ్మేస్తున్నారు. . చిన్నారుల కడుపు నింపలేక మత్తు మందులిచ్చి నిద్రపుచ్చుతున్న దుస్థితి నెలకొంది తాలిబన్ ప్రభుత్వం పాలనలో.

Afghanistan Poverty : అప్ఘానిస్థాన్ లో ఆకలి కేకలు .. చిన్నారుల కడుపు నింపలేక మత్తు మందులిచ్చి నిద్రపుచ్చుతున్న దుస్థితి

Afghanistan Poverty

Afghanistan Poverty : చేసేందుకు పనిలేదు.. తినేందుకు తిండి లేదు. ఆకలి బాధను తట్టుకోలేక.. కన్న కూతుళ్లను అమ్మేసుకుంటున్నారు. ఆకలితో ఉన్న పిల్లలకు పట్టెడన్నం పెట్టలేక.. నిద్రపుచ్చేందుకు మత్తు గోళీలు ఇస్తున్నారు. బతికేందుకు కావాల్సిన మెతుకు కోసం.. అఫ్ఘాన్ ప్రజలు ఆకలితో ఓ యుద్ధమే చేస్తున్నారు. తాలిబాన్ల పాలనలోకి వెళ్లాక.. మనుగడ సాగించడమే అఫ్ఘాన్ ప్రజలకు పెను సవాల్‌గా మారింది. గడిచిన కొన్ని నెలల్లోనే అక్కడ పేదరికం ఊహించని స్థాయిలో పెరిగిపోయింది.జనం ఆకలితో అలమటిస్తున్నారు.. తల్లిదండ్రులు పిల్లలకు తిండి పెట్టలేక మత్తు మందులు ఇచ్చి నిద్రపుచ్చుతున్నారు. కొందరైతే.. బతకడం కోసం తమ కన్న కూతుళ్లను అమ్మేస్తున్నారు. ఇంకొందరు.. తమ అవయవాలనే అమ్ముకుంటున్నారు. తాలిబాన్లు అప్ఘానిస్తాన్‌లో అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత.. పరిస్థితులు ఇలా దారుణంగా మారిపోయాయ్. విదేశీ నిధులు కూడా ఇంకా స్తంభించిపోయే ఉన్నాయ్. లక్షలాది మంది జనం.. తీవ్రమైన కరవు ముంగిట్లో ఉన్నారు.

పెద్దలైతే ఆకలికి తట్టుకోగలరు. కానీ.. పిల్లలు అలా కాదు. తిండి కోసం ఏడుస్తున్నారు. నిద్రకూడా సరిగాపోవడం లేదు. కానీ.. వాళ్లకు పెట్టేందుకు తల్లిదండ్రుల దగ్గర తిండి లేదు. అందుకే.. మత్తు మందు బిళ్లలు వేసి వాళ్లను నిద్రపుచ్చుతున్నారు. ఆకలిని మర్చిపోయి నిద్రపోతున్నారు. అప్ఘాన్‌లోని మూడో అతి పెద్ద నగరం హెరాత్‌తో పాటు మిగిలిన ప్రాంతాల్లోనూ ఇవే పరిస్థితులు నెలకొన్నాయ్. పిల్లలకు వీళ్లు ఇస్తున్న మాత్రలు.. కుంగుబాటు, ఆందోళన సమస్యలకు చికిత్సలో భాగంగా ఇచ్చేవి. చివరికి ఏడాది వయసున్న పిల్లలకు కూడా ఈ మత్తు బిళ్లలను వేస్తూ నిద్రపుచ్చుతున్నారు. సరైన తిండి, పోషకాహారం లేని పిల్లలకు ఈ మత్తు బిళ్లలు వేస్తే.. వారి కాలేయం దెబ్బతినడంతో పాటు నిస్సత్తువ, నిద్ర, ప్రవర్తనలో లోపాల లాంటి అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని.. డాక్టర్లు చెబుతున్నారు. అయితే.. ఈ టాబ్లెట్స్ పది రూపాయలకు ఐదు దొరుకుతున్నాయ్. అదే పది రూపాయలకు అప్ఘాన్‌లో ఒక రొట్టెముక్క మాత్రమే వస్తోంది. చాలా కుటుంబాలు రోజూ కొన్ని రొట్టెముక్కలను.. ఇంట్లో ఉన్నవాళ్లంతా పంచుకొని తింటున్నారు. ఈ పరిస్థితులన్నింటిని గమనిస్తున్న ఐక్యరాజ్యసమితి.. అప్ఘానిస్తాన్‌లో మానవ మహావిపత్తు ముంచుకొస్తోందని చెప్పింది.

అప్ఘాన్‌లోని చాలా మంది ప్రజలు రోజువారీ కూలీలుగా పనిచేస్తుంటారు. వీరిలో చాలా మంది జీవితాలు ఏళ్లుగా కష్టాల్లోనే ఉన్నాయ్. గతేడాది ఆగస్టులో తాలిబాన్లు అధికారం చేజిక్కించుకున్నాక.. వారు ఏర్పాటు చేసిన కొత్త ప్రభుత్వానికి అంతర్జాతీయంగా గుర్తింపు దక్కలేదు. దీంతో.. అప్పటిదాకా అప్ఘానిస్తాన్‌కు వస్తున్న విదేశీ నిధులన్నీ ఆగిపోయాయ్. ఫలితంగా దేశ ఆర్థిక పరిస్థితులు క్రమంగా దిగజారుతూ.. కేవలం 3 నెలల్లోనే ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయింది. దాని ప్రభావమే ఇప్పుడు జనంపై బలంగా కనిపిస్తోంది. చాలా మందికి కొన్ని నెలలుగా చేసేందుకు పనులు దొరకడం లేదు. ఎప్పుడైనా అరుదుగా పని దొరికితే.. వారికి వచ్చే కూలీ వంద లోపే ఉంటోంది. దాంతో.. చాలా చోట్ల అప్ఘాన్ ప్రజలు ఆకలితో పస్తులుంటున్నారు. ఎక్కవ శాతం మంది ఒక రోజు రాత్రి తింటే.. తర్వాతి రోజు రాత్రి పస్తులుంటున్నారు.

కొందరైతే తమ కుటుంబాలను పోషించేందుకు, ఆకలితో అలమటించకుండా ఉంచేందుకు.. ఊహించని పనులు చేస్తున్నారు. ఒకతను.. 3 నెలల కిందట.. తన శరీరంలోని ఓ కిడ్నీని అమ్మేశాడు. పొత్తికడుపు మీద ముందు నుంచి వెనుక వరకు ఉన్న 9 అంగుళాల గాటు, కుట్ల గుర్తులను కూడా చూపించాడు. అతనింకా.. ఇరవైల వయసులోనే ఉన్నాడు. కిడ్నీ అమ్మితే.. అతనికి 2 లక్షల 70 వేల దాకా చెల్లించారు. అందులో.. చాలా వరకు తన కుటుంబాన్ని పోషించుకునేందుకు చేసిన అప్పులు తీర్చటానికే సరిపోయింది. డబ్బు కోసం శరీరంలో అవయవాలు అమ్ముకోవడమనేది.. అఫ్ఘానిస్తాన్‌లో కొత్తేమీ కాదు. తాలిబాన్లు అధికారంలోకి రాకముందు కూడా ఇలాంటి ఘటనలు జరిగేవి. కానీ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంతటి తీవ్రమైన నిర్ణయాలు తీసుకున్నాక కూడా వారికి.. బతకడానికి మరో దారి కనిపించడం లేదు.

మరో మహిళ కూడా ఏడు నెలల కిందటే తన కిడ్నీని అమ్మేసింది. దానికంటే ముందు వాళ్లు అప్పు చేసి గొర్రెలను కొన్నారు. రెండేళ్ల కిందట వచ్చిన వరదల్లో అవి చనిపోయాయి. దాంతో.. వారి జీవనాధారం పోయింది. కిడ్నీ అమ్మగా వచ్చిన రెండు లక్షల 40 వేల రూపాయలు.. అప్పు తీర్చడానికే సరిపోలేదు. తర్వాత బతుకులు మరింత దుర్భరంగా మారడంతో.. వాళ్ల రెండేళ్ల కూతురును అమ్మేస్తున్నారు. అప్పు తీర్చలేకపోతే.. కూతురిని ఇచ్చేయాలంటూ.. అప్పు ఇచ్చిన వాళ్లు వేధిస్తున్నారని.. అవమానంతో కుంగిపోతున్నామని తెలిపారు. ఇలా బతకడం కన్నా.. చావడమే మేలనిపిస్తోందని అప్ఘాన్ ప్రజలు చెబుతున్నారు. ఇలా.. ఆర్థిక కష్టాల నుంచి బయటపడేందుకు.. బతుకీడ్చేందుకు కూతుళ్లను అమ్ముకుంటున్న ఉదంతాలు చాలానే కనిపిస్తున్నాయ్.

ఒకతను.. తన ఐదేళ్ల కూతురును లక్ష రూపాయలకు అమ్మేశాడు. లక్ష రూపాయలంటే.. ఒక కిడ్నీ అమ్మితే వచ్చే డబ్బుల్లో సగం కూడా కాదు. అలాంటి పరిస్థితుల్లోనూ.. కూతురిని అమ్మేసేందుకు సిద్ధపడ్డారంటే.. వాళ్ల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వాళ్లు తమ కూతురిని 14 ఏళ్ల వయసు వచ్చాక.. ఎవరికైతే అమ్మారో వాళ్లకు అప్పగిస్తారు. కూతురి అమ్మకంతో వచ్చిన డబ్బును.. తిండి తినేందుకు, మిగతా కుటుంబ అవసరాల కోసం వాడుకుంటున్నారు. అయితే.. డబ్బు కోసం, బతుకు కోసం కూతుళ్లను అమ్ముకోవడం ఇస్లామిక్ చట్టాలకు విరుద్ధమని తెలిసినా.. తమ పిల్లల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నామని తెలిసినా.. వాళ్లకు అంతకుమించి మరో దారి కనిపించడం లేదని చెబుతున్నారు. వాస్తవం చెప్పాలంటే.. అప్ఘాన్‌లో తాలిబాన్ల ప్రభుత్వం ఏర్పడినప్పుడే అక్కడి ప్రజల ఆత్మగౌరవం ఎప్పుడో ఆకలి మంటల్లో కాలిపోయింది.