Afghan War Cost : అప్ఘాన్ యుద్ధానికి అమెరికా చేసిన ఖర్చు,ప్రాణ నష్టం ఎంతో తెలుసా

  రెండు దశాబ్దాలపాటు అప్ఘానిస్తాన్ లో అమెరికా కొనసాగించిన యుద్ధం తాలిబన్ల హస్తగతంలో ముగిసింది.

Afghan War Cost : అప్ఘాన్ యుద్ధానికి అమెరికా చేసిన ఖర్చు,ప్రాణ నష్టం ఎంతో తెలుసా

Troops2

Afghan War Cost  రెండు దశాబ్దాలపాటు అప్ఘానిస్తాన్ లో అమెరికా కొనసాగించిన యుద్ధం తాలిబన్ల హస్తగతంలో ముగిసింది. 2001లో బిన్ లాడెన్ ను వెతుక్కుంటూ వచ్చి అప్ఘానిస్తాన్ లో తిష్ఠ వేసిన అమెరికా..చివరకు మీ చావు మీరు చావండంటూ ఇప్పుడు అప్ఘాన్ ప్రజల ప్రాణాలను తాలిబన్ల చేతుల్లో పెట్టి పలాయనం చిత్తగించింది. 20ఏళ్ల సుదీర్ఘకాలం పాటు అప్ఘానిస్తాన్ లో యుద్ధం కొనసాగించిన అమెరికా గతేడాది తాలిబన్లతో కుదిరిన ఒప్పందం ప్రకారం..ఈ ఏడాది సెప్టెంబర్-11 నాటికి తమ బలగాలను అప్ఘానిస్తాన్ నుంచి పూర్తిగా ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. అయితే ఆ గడువు కన్నా ముందే ఉపసంహరణ ప్రక్రియను అమెరికా పూర్తి చేసింది.

బ్రౌన్ యూనివర్శిటీ అంచనా ప్రకారం.. 20 ఏళ్లుగా అప్ఘానిస్తాన్ లో జరిపిన యుద్ధం కోసం అమెరికా.. దాదాపు 2 ట్రిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. కేవలం అప్ఘాన్ సైన్యానికి శిక్షణ,అధునాత ఆయుధాల కోసమే అమెరికా దాదాపు 89 బిలియన్ డాలర్లను ఖర్చు చేసింది. అంటే తాలిబాన్లను అప్ఘానిస్తాన్ నుంచి దూరంగా ఉంచడానికి అమెరికా ఖర్చు చేసిన మొత్తం…. జెఫ్ బెజోస్, ఎలోన్ మస్క్, బిల్ గేట్స్ మరియు అమెరికాలోని 30 అత్యంత ధనవంతులైన బిలియనీర్ల సంపద కంటే ఎక్కువ.

అప్ఘాన్ యుద్ధం అమెరికా భారీగానే అప్పులు చేసింది.   అప్ఘాన్ యుద్ధం కోసం అమెరికా చేసిన అప్పులు లక్షల కోట్ల డాలర్లలో ఉండగా..ఈ భారాన్ని రానున్న కొన్ని తరాల అమెరికన్ లు మోయాల్పి వస్తుందని అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అమెరికా యొక్క అఫ్ఘాన్ యుద్ధ రుణంపై వడ్డీ 2050 నాటికి6.5 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని బ్రౌన్ విశ్వవిద్యాలయం అంచనా చేసింది. అంటే ప్రతి ఒక్క అమెరికా పౌరుడి తలపై 20,000 అప్పు ఉన్నట్లే లెక్క.

అయితే కొరియా యుద్ధం సమయంలో వాటికి అయ్యే ఖర్చుల కోసం అప్పటి అమెరికా అధ్యక్షుడు హ్యారీ ట్రూమన్ పన్నులను తాత్కాలికంగా 92శాతానికి పెంచారు. వియత్నాం యుద్ధం సమయంలోనూ అప్పటి అమెరికా అధ్యక్షుడు లిండన్ జాన్సన్ పన్నులను 77 శాతం పెంచారు. కానీ అప్ఘానిస్తాన్ యుద్ధం ప్రారంభమైన మొదట్లో అధ్యక్షుడిగా ఉన్న జార్జ్ డబ్లూ బుష్ మాత్రం సంపన్నులపై పన్నుల భారం మోపకుండా దాదాపు 8 శాతం తగ్గించడం గమనార్హం. ఇలా అప్ఘాన్ యుద్ధం కోసం అమెరికా ఇలా భారీగా అప్పులు చేయాల్సి వచ్చింది.

మరోవైపు అప్ఘానిస్తాన్ లో యుద్ధం ముగించినా కూడా ఆ దేశంలోని మాజీ సైనికులు,సీనియర్ సిబ్బంది ఆరోగ్య సంరక్షణకు కట్టుబడి ఉన్నట్లు ఇప్పటికే అమెరికా ప్రకటించిన నేపథ్యంలో లక్షల మందికి సహాయం చేసేందుకు అమెరికాకు మరింత ఖర్చు అయ్యే అవకాలున్నాయి. అప్ఘాన్ తో పాటు ఒకే సమయంలో ఇరాన్ తో కూడా అమెరికా యుద్ధం చేసిన నేపథ్యంలో ఇలా యుద్ధాలపై అమెరికా చేసిన ఖర్చు కొన్ని తరాల అమెరికన్లపై ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

అయితే అప్ఘాన్ యుద్ధం కోసం భారీగా డబ్బు ఖర్చు చేయడమే కాకుండా వేల మంది సైనికులను కూడా కోల్పోవాల్సి వచ్చింది. బ్రౌన్ యూనివర్శిటీ లెక్కల ప్రకారం..అఫ్ఘానిస్తాన్‌లో తాలిబన్‌లతో పోరాడే సమయంలో 2448 మంది అమెరికా సైనికులు(ఈ ఏడాది ఏప్రిల్ నాటికి) ప్రాణాలు కోల్పోయారు. 3846మంది అమెరికాకు చెందిన తాత్కాలిక సిబ్బంది మరణించారు. గత 20 ఏళ్లలో 66,000మందికి పైగా అప్ఘాన్ సైన్యం,పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. 47,245మంది అప్ఘాన్ పౌరులు మరణించారు. 51,191 మంది తాలిబన్లు మరియు ఇతర ప్రత్యర్థి బలగాలు చనిపోయారు. 72 మంది జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు.