Afghanistan Govt : తాలిబన్లకు ఆఫ్ఘాన్ ప్రభుత్వం ఆఫర్..అధికారం పంచుకుందాం..ఆర్మీ చీఫ్ మార్పు

ఆఫ్ఘానిస్తాన్ నుంచి నాటో, అమెరికా ద‌ళాల ఉపసంహరణతో అక్క‌డ మ‌రోసారి తాలిబ‌న్లు రాజ్య‌మేల‌డానికి సిద్ధ‌మ‌వుతున్న విషయం తెలిసిందే.

Afghanistan Govt : తాలిబన్లకు ఆఫ్ఘాన్ ప్రభుత్వం ఆఫర్..అధికారం పంచుకుందాం..ఆర్మీ చీఫ్ మార్పు

Afgan

Afghanistan Govt  ఆఫ్ఘానిస్తాన్ నుంచి నాటో, అమెరికా ద‌ళాల ఉపసంహరణతో అక్క‌డ మ‌రోసారి తాలిబ‌న్లు రాజ్య‌మేల‌డానికి సిద్ధ‌మ‌వుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తాలిబన్ గెరిల్లా ఆర్మీ దేశంలోని ప్ర‌ధాన న‌గరాల‌ను ఆక్ర‌మిస్తూ వస్తోంది. వాళ్ల‌ను ఎదుర్కోవ‌డం ఆప్ఘాన్ ప్రభుత్వ సాయుధ బ‌ల‌గాల వ‌ల్ల కావ‌డం లేదు. ఇప్పటికే ఆఫ్ఘానిస్తాన్ లోని మూడింట రెండొంతుల భూభాగాన్ని తమ అధీనంలోకి తీసుకున్న తాలిబన్లు..ఇప్పుడు రాజ‌ధాని కాబూల్ ని తమ ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసిన క్రమంలో ఆఫ్ఘానిస్తాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

తాలిబన్లు వేగంగా దూసుకొస్తూ దేశంలోని ఒక్కొక్క ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకుంటున్న క్రమంలో అక్కడి ప్ర‌భుత్వం పవర్ షేరింగ్ ఆఫ‌ర్‌తో ముందుకొచ్చింది. దేశంలో కొనసాగుతున్న హింసను ఆపివేస్తే అధికారాన్ని పంచుకునేందుకు అంగీకరిస్తామని ఖతార్ లోని ఆఫ్ఘాన్ ప్రభుత్వ రాయబారులు తాలిబన్లకు ఆఫర్ చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన ప్రపోజల్ ను మధ్యవర్తిగా ఖతార్ కి ఆఫ్ఘాన్ ప్రభుత్వం సమర్పించింది.

అయితే ఇప్పటికే ఆఫ్ఘానిస్తాన్ లోని మూడింట రెండొంతుల భూభాగాన్ని తమ అధీనంలోకి తీసుకున్న తాలిబన్లు..ఇప్పుడు రాజ‌ధాని కాబూల్ ని తమ ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసిన క్రమంలో ప్ర‌భుత్వం ఇలా స్నేహ హ‌స్తాన్ని చాచింది. కాగా,తాలిబన్లు గత వారం రోజుల్లోనే ఆరు రాష్ట్రాల రాజధానులను తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. అందులో దేశంలోని అతిపెద్ద నగరాల్లో ఒకటైన కుందుజ్​ రాష్ట్ర రాజధాని కుందుజ్​ నగరం ఉంది. ఆఫ్ఘానిస్తాన్ లోని మొత్తం 34 రాష్ట్రాల్లో..కాబూల్ కి 150 కిలోమీటర్ల దూరంలో గాజ్నీ రాష్ట్ర రాజధాని గాజ్నీ సిటీ సహా ఇప్పటివరకు మొత్తంగా 10 రాష్ట్రాల రాజధానులు తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయాయి.

తాలిబన్లు, ఆఫ్ఘాన్ ప్రభుత్వ బలగాల మధ్య తలెత్తుతున్న ఘర్షణల్లో వేలాది మంది పౌరుల భద్రతకు ముప్పు వాటిల్లుతోంది. అమెరికా బలగాలు అడపాదడపా క్షిపణి దాడులు చేపడుతున్నా.. దాదాపుగా ఆపరేషన్లకు దూరంగా ఉంటున్నట్లే కనిపిస్తోంది. మరోవైపు, తాలిబన్ల ఏరివేతకు ప్రత్యేక ఆపరేషన్​ దళాలను విస్తరిస్తోంది ప్రభుత్వం.

తాలిబాన్ దాడుల మధ్య ఆఫ్ఘన్ ఆర్మీ చీఫ్ ని మార్చింది అక్కడి ప్రభుత్వం. జనరల్ వలీ మహ్మద్ అహ్మద్‌జాయ్ స్థానంలో బుధవారం స్పెషల్ ఆపరేషన్స్ కార్ప్స్ కమాండర్ హిబతుల్లా అలిజాయ్ ని కొత్త ఆర్మీ స్టాఫ్ చీఫ్ గా నియమించింది ఆఫ్ఘాన్ ప్రభుత్వం.