War in Ukraine: నిముషాల వ్యవధిలో మారిపోతున్న పరిణామాలు: యుక్రెయిన్ వైమానిక, మిలిటరీ స్థావరాలే లక్ష్యమన్న రష్యా

చిమ్మచీకటిలో ఇంకా సూర్యోదయాన్ని కూడా చూడని యుక్రెయిన్ ప్రజలు.. రష్యా సైనికుల బాంబు దాడులతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బికెక్కుబిక్కుమంటూ ఇళ్లలోనే ఉండిపోయారు

War in Ukraine: నిముషాల వ్యవధిలో మారిపోతున్న పరిణామాలు: యుక్రెయిన్ వైమానిక, మిలిటరీ స్థావరాలే లక్ష్యమన్న రష్యా

Ukraine War

War in Ukraine: యుక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రారంభించిన నేపథ్యంలో అక్కడి పరిణామాలు వేగంగా మలుపు తిరుగుతున్నాయి. నిముషాల వ్యవధిలో చోటుచేసుకుంటున్న పరిణామాలతో అటు యుక్రెయిన్ ప్రభుత్వము, ఇటు ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి దాటాక(గురువారం తెల్లవారుజామున) రష్యా సైనికులు యుక్రెయిన్ లోని మారియుపోల్ నగరంపై అత్యంత శక్తివంతమైన బాంబుతో విరుచుకుపడ్డారు. అనంతరం నిముషాల వ్యవధిలోనే యుక్రెయిన్ దేశ రాజధాని కీవ్, మరికొన్ని ప్రధాన నగరాల్లో రష్యా బలగాలు మోహరించాయి. చిమ్మచీకటిలో ఇంకా సూర్యోదయాన్ని కూడా చూడని యుక్రెయిన్ ప్రజలు.. రష్యా సైనికుల బాంబు దాడులతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బికెక్కుబిక్కుమంటూ ఇళ్లలోనే ఉండిపోయారు. రష్యా సైనిక దాడులతో అప్రమత్తమైన యుక్రెయిన్ ప్రభుత్వం.. అందుకు ధీటుగా బదులిస్తుంది.

Also read: Russia Attack On Ukraine: పుతిన్‌దే బాధ్యత.. రష్యాపై అమెరికా ఆగ్రహం

యుద్ధం ప్రారంభమైన గంటల వ్యవధిలో యుక్రెయిన్ వైమానిక స్థావరాన్ని ధ్వంసం చేసినట్లు రష్యా ప్రకటించగా.. లుహాన్స్క్ లోకి చొరబడ్డ ఐదు రష్యా యుద్ధ విమానాలను ఒక హెలికాప్టర్ ను కూల్చివేసినట్లు యుక్రెయిన్ ప్రకటించింది. మరోవైపు రష్యాను ఎదుర్కొనేందుకు యుక్రెయిన్ మద్దతుగా నాటో దళాలు సిద్ధం అయ్యాయి. ఇప్పటికే 800 మంది నాటో సైన్యాన్ని, యుద్ధ ట్యాంకులను రష్యా సరిహద్దులోని నాటో భాగస్వామ్య దేశాలకు పంపింది అమెరికా. రష్యా వెనక్కు తగ్గని పక్షంలో నాటో దళాలతో యుద్ధం తప్పదంటూ అమెరికా అధ్యక్షుడు హెచ్చరించగా.. అదే జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ రష్యా అధ్యక్షుడు బదులిచ్చారు. దీంతో యుద్ధాన్ని ఆపేందుకు ఐరాస సభ్య దేశాలు కృషి చేయాలంటూ యుక్రెయిన్ అధ్యక్షుడు ప్రపంచ దేశాలను కోరారు.

Also read: Indians in Ukraine: ఇంకా యుక్రెయిన్ లోనే ఉన్న భారతీయుల పరిస్థితేంటి?

యుక్రెయిన్ లోని కీవ్, ల్వివ్, ఖార్కివ్, మారియుపోల్ జరిగిన బాంబు దాడుల్లో వందలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయి ఉంటారని యుక్రెయిన్ అధికారులు భావిస్తున్నారు. భారీ స్థాయిలో రష్యా వైమానిక దాడులకు పాల్పడుతున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వీడియోల ఆధారంగా యుక్రెయిన్ లోని ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నట్లు ఆ మీడియా కధనాలు పేర్కొన్నాయి. ఇక దాడులపై యుక్రెయిన్ అంతర్గత వ్యవహారాలశాఖ స్పందిస్తూ.. గురువారం మధ్యాహ్నం దాటితే గాని దాడులు, ప్రాణాపాయం, ఇతర యుద్ధ నష్ఠాన్ని(పాక్షికంగా) అంచనా వేయలేమని ప్రకటించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది.

Also read: Russia-Ukraine: యుద్ధం మొదలైంది.. పుతిన్ ఆదేశాలు.. యుక్రెయిన్‌పై బాంబులతో రష్యా దాడి